India Captain: సూర్యపై బీసీసీఐ సెలెక్టర్లకు నమ్మకం లేదా?.. కెప్టెన్ రేసులో కొత్త పేరు!

India Captain: సూర్యకుమార్ యాదవ్‌ టీ20 కెప్టెన్సీ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.

Rishvik
Published on: 24 May 2026 7:39 PM IST
India Captain
X

India Captain: సూర్యపై బీసీసీఐ సెలెక్టర్లకు నమ్మకం లేదా?.. కెప్టెన్ రేసులో కొత్త పేరు!

India Captain: సూర్యకుమార్ యాదవ్‌ టీ20 కెప్టెన్సీ భవిష్యత్తుపై భారత క్రికెట్‌లో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్‌పై పూర్తిగా నమ్మకం ఉంచడం లేదని, అతడి భవిష్యత్తు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. కెప్టెన్సీ సంగతి పక్కనపెడితే.. బ్యాటర్‌గా కూడా జట్టులో స్థానం సంపాదించే స్థాయిలో ప్రస్తుతం సూర్యకుమార్ లేడని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.

గత ఐపీఎల్ సీజన్‌లో 700కు పైగా పరుగులు చేసినట్లే.. ఈసారి కూడా సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి వస్తాడని బీసీసీఐ సెలెక్టర్లు ఆశించారు. అయితే ఈ సీజన్‌లో అతడు బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. అంతేకాదు బ్యాటింగ్‌లో ఎలాంటి టెక్నికల్ మార్పులు కనిపించలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ పేసర్లు సైతం హార్డ్ లెంగ్త్ బంతులతో అతడిని ఇబ్బంది పెట్టగలుగుతున్నారని బీసీసీఐ సీనియర్ వర్గాలు పేర్కొన్నాయి. 2028 ఒలింపిక్స్ దృష్ట్యా భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో సూర్యకుమార్ ఉండకపోవచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. దీంతో కొత్త టీ20 కెప్టెన్ ఎవరనే చర్చ వేడెక్కింది.

టీమిండియా టీ20 కెప్టెన్ రేసులో పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తోంది. వ్యూహాత్మకంగా ఆలోచించే కెప్టెన్‌గా శ్రేయస్‌కు మంచి గుర్తింపు ఉంది. అయితే కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి శ్రేయస్ సాఫీగా పని చేయగలరా? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచినప్పుడు మొత్తం క్రెడిట్ గంభీర్‌కే వెళ్లడం శ్రేయస్‌ను నిరాశకు గురిచేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. గత రెండు సీజన్లుగా పంజాబ్ జట్టును అద్భుతంగా ముందుకు సడిపించడం, బ్యాటర్‌గా కూడా రాణించడం శ్రేయస్‌కు కలిసొచ్చే అంశం.

మరోవైపు శుభమాన్ గిల్ కూడా భవిష్యత్తు కెప్టెన్‌గా బలమైన అభ్యర్థిగా మారాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున మరో అద్భుతమైన ఐపీఎల్ సీజన్ ఆడిన గిల్.. కెప్టెన్‌గా కూడా ఆకట్టుకున్నాడు. ఒక దశలో అన్ని ఫార్మాట్లకు గిల్‌ను భవిష్యత్తు నాయకుడిగా ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావించినట్లు సమాచారం. అయితే టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు అతడి ఫామ్ బాగా లేకపోవడంతో.. జట్టులో చోటు కూడా డాకించుకోలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గిల్‌ను తిరిగి టీ20 జట్టులోకి తీసుకురావచ్చని చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో గిల్ ఓపెనర్‌గా, సంజు శాంసన్ మూడో స్థానంలో, ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో ఆడే కాంబినేషన్‌పై కూడా ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు కూడా భవిష్యత్తు ప్రణాళికల్లో కీలకంగా మారింది. 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని అతడిని తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన పేరు మాత్రం తిలక్ వర్మదే. సూర్యకుమార్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే తిలక్ వర్మను నాయకత్వ బాధ్యతలకు పరిశీలించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

ఇటీవల జరిగిన త్రైముఖ ‘ఏ’ సిరీస్‌కు తిలక్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం వెనుక కూడా అతడి నాయకత్వ లక్షణాలను అంచనా వేయడమే ప్రధాన ఉద్దేశమని సమాచారం. ప్రస్తుతం భారత క్రికెట్‌లో ఫామ్, భవిష్యత్తు ప్రణాళికలు, నాయకత్వ మార్పులు అన్నీ కలిపి టీమిండియా టీ20 కెప్టెన్సీ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు పూర్తిగా గౌతమ్ గంభీర్ విశ్వాసంపైనే ఆధారపడి ఉందనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story