Urmila: ఊర్మిళ అంటే నిద్రకాదు... లక్ష్మణుడికి రక్షణకవచం... వాల్మీకి ఆ పాత్రను ఎలా ముగించాడంటే

రామాయణ ఇతిహాస గమనాన్ని మార్చిన ఊర్మిళ కథ... లక్ష్మణుడికి అడుగడుగున రక్షణ కవచంగా మారిన వీరనారి... వాల్మికి ఆమె పాత్రను ఎలా ముగించాడో తెలిస్తే ఆశ్చర్యపోతాడు.

Balachander
Published on: 9 Jun 2026 9:20 AM IST
Urmila: ఊర్మిళ అంటే నిద్రకాదు... లక్ష్మణుడికి రక్షణకవచం... వాల్మీకి ఆ పాత్రను ఎలా ముగించాడంటే
X

Urmila: రామాయణ మహాకావ్యం పేరు వినగానే మనకు రాముడు సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు ఇలా కొద్దిమంది పాత్రలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ, వీరందరికంటే మిన్నగా, రామాయణం ఇతిహాస గమనాన్ని మార్చిన మహోన్నత పాత్ర ఊర్మిళాదేవిది. మనందరికి ఊర్మిళ అంటే 14 ఏళ్లపాటు నిద్ర అని మాత్రమే తెలుసు. కానీ, ఆ నిద్రను ఎంచుకోవడం ద్వారా లక్ష్మణుడికి రక్షణ కవచంగా నిలిచింది. జనక మహారాజు సొంత కూతురైన ఊర్మిళ, భూమిలో దొరికిన సీతమ్మను తన సొంత అక్కగా ప్రాణప్రదంగా ప్రేమించింది. లక్ష్మణుడిని వివాహం చేసుకొని ఆయోధ్యలో అడుగుపెట్టిన ఆమె జీవితం ఓ మహాత్యాగానికి వేదికగా మారింది.

14 ఏళ్ల నిశ్శబ్ద తపస్సు ... లక్ష్మణుడికి ప్రాణభిక్ష

శ్రీరాముడితో పాటు లక్ష్మణుడు వనవాసానికి వెళ్లే సమయంలో, ఊర్మిళ కూడా తనతో వస్తానని అడగలేదు. ఎందుకంటే, భార్య పక్కన ఉంటే లక్ష్మణుడు అన్నసేవలో నిమగ్నం కాలేడని ఆమెకు తెలుసు. అరణ్యంలో లక్ష్మణుడు అన్నదమ్ముల రక్షణ కోసం రాత్రింబవళ్లు మేల్కొని ఉండాలి. దానికోసం నిద్రాదేవిని ప్రార్థించి, తన భర్త భాగం నిద్రను కూడా తానే స్వీకరించింది. అలా ఆమె అంతఃపురంలో ఒకే గదిలో, ఒకే మంచంపై 14 సంవత్సరాల పాటు 'యోగనిద్ర'లోకి జారుకుంది. ఈ 14 ఏళ్ల కాలంలో ఆమె కేవలం నిద్రపోలేదు... పతివ్రతా ధర్మంతో, ఉపవాస దీక్షతో ఒక మహా తపస్సు చేసింది. రావణుడి కుమారుడైన మేఘనాథుడిని అంతమొందించడం సామాన్యమైన విషయం కాదు. 14 ఏళ్లపాటు నిద్రాహారాలులేని నిరుపమాన బ్రహ్మచారి మాత్రమే అతడిని చంపగలడనే వరం ఉంది. లక్ష్మణుడు అరణ్యంలో నిద్రపోకుండా ఉన్నాడంటే, దానికి కారణం అయోధ్యలో ఊర్మిళ చేసిన తపస్సే. ఆమె సాధించిన ఆ పాతివ్రత్య శక్తే లక్ష్మణుడికి రక్షణకవచంగా మారి, యుద్ధంలో అతడిని గెలిపించింది.

వాల్మీకి పాత్రను ఎలా ముగించాడు?

రామాయణం ముగింపులో లక్ష్మణుడు శ్రీరాముడి ఆజ్ఞ మేరకు, కాలపురుషుడితో రాముడి సంభాషణకు భంగం కలిగించినందుకు గాను, సరయూ నదిలో ప్రాణత్యాగం చేసి తన అవతారాన్ని చాలించాడు. అయితే, వాల్మీకి మహర్షి ఊర్మిళ మరణాన్ని ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. దీని వెనుక ఒక అద్భుతమైన పరమార్థం ఉంది. ఊర్మిళ కేవలం భౌతిక దేహం కాదు, ఆమె లక్ష్మణుడి ప్రాణ శక్తి. లక్ష్మణుడు సరయూ నదిలో లీనమవగానే, లక్ష్మణుడి ఆత్మలో భాగమైన ఊర్మిళ కూడా తన దేహాన్ని విడిచి, ఆదిశేషుడితో పాటు వైకుంఠానికి చేరిపోయింది. అందుకే ఆమెకు ప్రత్యేక మరణం అంటూ లేదు. ఊర్మిళ చూపిన సహనం, త్యాగం సీతాదేవి, సావిత్రిల సరసన ఆమెను నిలబెట్టాయి. రామాయణంలో లక్ష్మణుడి విజయం వెనుక ఉన్న అసలైన శక్తి ఊర్మిళా దేవి మాత్రమే.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story