Yoga Healing: రీల్స్ యుగంలో యోగాతో రిలాక్స్.. టెక్కీలు, యువతకు డిజిటల్ డిటాక్స్ ఇలా..
Yoga Healing: టెక్కీలు, యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న నిద్రలేమి, మానసిక ఒత్తిడి సమస్యలకు యోగా ఎలా అద్భుతమైన పరిష్కారం చూపిస్తుందో తెలుసా.?
Yoga Healing: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో టెక్కీలు, విద్యార్థులు, యువత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కెరీర్ టార్గెట్లు, మరోవైపు చదువుల భారం.. వీటికి తోడు స్మార్ట్‌ఫోన్ల వ్యసనం వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కంటినిండా నిద్ర కరువై అనారోగ్యాల బారిన పడుతున్న ఈ ఆధునిక తరానికి 'యోగా' ఒక దివ్యౌషధం. నేటి యువతను మార్చడంలో యోగా ఎంతటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..
ఐటీ ఉద్యోగులు రోజులో సగానికి పైగా సమయం కంప్యూటర్ స్క్రీన్ల ముందే కూర్చుని గడుపుతుంటారు. దీనివల్ల మెడనొప్పి, వెన్నునొప్పి, కంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే డెడ్‌లైన్ల భారం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. క్రమం తప్పకుండా ప్రాణాయామం, సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది. కూర్చునే భంగిమ వల్ల వచ్చే నొప్పులకు యోగాసనాలు చక్కటి ఉపశమనాన్ని ఇస్తాయి.
మరోవైపు చదువుల ఒత్తిడి, పోటీ పరీక్షల భయంతో నేటి విద్యార్థులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళన వారి ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. ధ్యానం లాంటి యోగా పద్ధతులు మనసును ప్రశాంతంగా ఉంచి, చదువుపై ఏకాగ్రతను పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. తద్వారా వారు పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలరు.
నిద్రలేమికి చెక్:
రాత్రిళ్లు నిద్రపోకుండా గంటల తరబడి మెలకువగా ఉండటం నేటి యువతలో సర్వసాధారణం అయిపోయింది. ఇది శారీరక, మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. పడుకునే ముందు శవాసనం లేదా 'యోగా నిద్ర' చేయడం వల్ల నాడీ వ్యవస్థ శాంతించి, శరీరంలోని అలసట మొత్తం దూరమవుతుంది. ఎలాంటి మందుల అవసరం లేకుండానే గాఢమైన, ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
డిజిటల్ డిటాక్స్:
ప్రస్తుత 'రీల్స్' యుగంలో యువత తమ స్మార్ట్‌ఫోన్లలో స్క్రోలింగ్‌కు బానిసలైపోతున్నారు. ఈ డిజిటల్ వ్యసనం వల్ల ఆందోళన, తోటివారితో పోల్చుకుని బాధపడటం లాంటి నెగెటివ్ భావాలు పెరుగుతున్నాయి.
యోగా, మైండ్‌ఫుల్‌నెస్ ద్వారా ఈ వర్చువల్ మాయాజాలం నుంచి విరామం తీసుకోవచ్చు. కళ్ళు మూసుకుని మన శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల, మనసు గతం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేస్తుంది. ఈ మైండ్‌ఫుల్‌నెస్ ద్వారా యువత తాము కోల్పోయిన మానసిక ప్రశాంతతను తిరిగి పొందవచ్చు.
యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానం. జూన్ 21న వచ్చే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున, రోజుకు కనీసం 30 నిమిషాలైనా యోగా కోసం కేటాయిద్దామని సంకల్పించుకుందాం.




