Karimnagar: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. ఇసుక సమస్య లేకుండా కలెక్టర్ యాక్షన్ ప్లాన్!
Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశం.
Karimnagar: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. ఇసుక సమస్య లేకుండా కలెక్టర్ యాక్షన్ ప్లాన్!
కరీంనగర్ : జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ) సమావేశంలో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ గృహాల నిర్మాణంతో పాటు జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు కూడా ఇసుక కొరత తలెత్తకుండా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక సరఫరా ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మైనింగ్ శాఖ సమగ్ర ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా జిల్లాకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించి సమర్పించాలని సూచించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువులు, కాలువల్లో పూడిక తొలగింపు (డీసిల్టేషన్) పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.
సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఇసుక నిర్వహణ, సరఫరా, పూడిక తొలగింపు తదితర ఐదు కీలక అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, సీపీఓ రాందత్తారెడ్డి, మైనింగ్ శాఖ ఏడి వెంకటరెడ్డి, డీపీఓ జగదీశ్వర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.




