Proddatur: భిక్షాటన ముసుగులో భారీ చోరీలు.. ప్రొద్దుటూరులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్!
Proddatur: ప్రొద్దుటూరులో భిక్షాటన చేస్తూ ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.
Proddatur: భిక్షాటన ముసుగులో భారీ చోరీలు.. ప్రొద్దుటూరులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్!
కడప జిల్లా: ప్రొద్దుటూరులో భిక్షాటన చేస్తున్న వ్యక్తి, అసలు రూపంలో మాత్రం అంతర్రాష్ట్ర దొంగ!మూగ, చెవిటివాడినంటూ నకిలీ ధ్రువపత్రాలతో ప్రజలను నమ్మించి... ఇళ్లలో ఎవరూ లేని సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.
రూ.14 లక్షల 50 వేల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు ల్యాప్‌టాప్, ట్యాబ్, ఐఫోన్ సహా పలు ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ చోరీ కేసు వివరాలను ఏఎస్పి.విభూ కృష్ణ వెల్లడించారు.తమిళనాడుకు చెందిన శివ మునియప్ప అనే వ్యక్తి ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉంటూ, భిక్షాటన చేస్తున్నట్లు నటించేవాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 7న ప్రొద్దుటూరు పట్టణంలోని బంగారం అంగళ్ల బజార్ ప్రాంతంలో సంచరిస్తూ, ఇళ్లలో ఎవరూ లేని సమయాలను గమనించి చోరీలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో శంకరయ్య వీధిలో నివాసముంటున్న గంగనపల్లి శివాజీరావు ఇంటిని లక్ష్యంగా చేసుకున్న నిందితుడు ఇంట్లోకి చొరబడి పూజా మందిరంలో ఉన్న బంగారంతో అల్లిన రుద్రాక్ష మాల, ఆంజనేయస్వామి డాలర్ కలిగిన బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాలు, రెండు వెండి ఉంగరాలను అపహరించి పరారయ్యాడు.
కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఆధునిక "నాట్ గ్రిడ్" టెక్నాలజీ సహాయంతో నిందితుడి కదలికలను గుర్తించారు. అనంతరం స్థానిక వాసవి సర్కిల్ వద్ద అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి 92 గ్రాముల బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి నగలతో పాటు ల్యాప్‌టాప్, శాంసంగ్ ట్యాబ్, ఐఫోన్, మరో ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం స్వాధీనం చేసుకున్న బంగారు విలువ సుమారు రూ.14 లక్షల 50 వేలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఏఎస్పి విభూ క్రిష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.




