Iran US War 100 Days: ఇరాన్ అమెరికా వార్ః 100 రోజుల్లో ఏం జరిగింది?
ఇరాన్-అమెరికా యుద్ధం 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇరుపక్షాలు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న నష్టాలు, హోర్ముజ్ జలసంధి ప్రభావం, అణు వివాదం, మధ్యప్రాచ్య రాజకీయాల్లో చోటుచేసుకున్న అంశాల గురించి తెలుసుకుందాం.
Iran US War 100 Days: మధ్యప్రాచ్యంలో దాడులు ప్రారంభమై 100 రోజులు పూర్తయింది. ఇరాన్‌లో అధికార మార్పిడే ధ్యేయంగా ఇజ్రాయిల్, అమెరికా దేశాలు ఇరాన్‌పై దాడులు చేశాయి. యుద్ధం మొదట్లో భీకరంగా జరిగినా ఆ తరువాత వచ్చిన ఒత్తిళ్లు, ఇరాన్ నుంచి ఎదురైన సవాళ్లు, అమెరికా ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా బలహీనపడింది. దీంతో యుద్ధానికి విరామం ప్రకటించారు. ఈ వంద రోజుల్లో అటు అమెరికా ఇజ్రాయిల్, ఇటు ఇరాన్ దేశాలు భారీగా నష్టపోయాయి. కానీ, ఎవరి లక్ష్యాలను వారు పూర్తిగా నెరవేర్చుకోలేకపోయారు. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేసిందనడంలో సందేహం లేదు.
ఇరాన్‌కు జరిగిన భారీ నష్టం
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ సైనిక పరంగా తీవ్రంగా దెబ్బతింది. సుమారు 3400 మందికి పైగా ఇరాన్ పౌరులు, అగ్రశ్రేణి రాజకీయ, సైనిక నాయకులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సైతం ఈ దాడుల్లో మరణించాడు. ప్రస్తుతం ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇక యుద్ధం మొదలైన రెండు వారాల్లోనే ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల సామర్థ్యం దారుణంగా పడిపోయింది. క్షిపణులను ప్రయోగించే లాంచర్లను అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ధ్వంసం చేయడమే దీనికి కారణం.
అమెరికా వ్యూహాన్ని దెబ్బకొట్టిన ‘హోర్ముజ్’ అస్త్రం
ఇరాన్ సైనికంగా బలహీనపడినా, వ్యూహాత్మకంగా అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా ఉన్న 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' జలమార్గాన్ని ఇరాన్ మూసివేసింది. అమెరికా నౌకాదళం దిగ్బంధం విధించినప్పటికీ, ఈ జలమార్గాన్ని పూర్తిగా తెరవలేకపోయింది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మార్గాన్ని సురక్షితం చేయడానికి అమెరికా సహాయం కోరగా.. నాటో, ఐరోపా దేశాలు దౌత్యపరంగా అమెరికాకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. ఇరాన్ ప్రభుత్వం కూలిపోకపోవడమే తమకు దక్కిన అతిపెద్ద విజయంగా టెహ్రాన్ భావిస్తోంది. రష్యా, చైనాల మద్దతుతో ఇరాన్ ఇప్పటికీ లొంగిపోకుండా మొండిగా నిలబడింది. వెనుజులాలో మాదిరిగా ఇరాన్‌లో కూడా ప్రభుత్వాన్ని కూలగొట్టి తమకు అనుకూలమైన వారిని ప్రభుత్వంలో ఉంచాలని చూసిన అమెరికాకు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.
వంద రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం వలన ఇరాన్ ఆర్థికంగా, సైనికపరంగా చితికిపోయింది. అటు అమెరికా కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది. రోజుల తరబడి భారీ షిప్పులు సముద్రంలో లంగరువేయడంతో సైన్యానికి అవసరమై సదుపాయలు కల్పించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది. సైనిక బడ్జెట్‌ను పెంచాలని పదేపదే అమెరికా కాంగ్రెస్‌ను అధ్యక్షుడు ట్రంప్ కోరాడు అంటే అర్థం చేసుకోవచ్చు. యుద్ధం వలన అమెరికా సాధించింది శూన్యం. భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్టేనని నిపుణులు చెబుతున్నారు. రాబోయే వంద రోజుల్లో ఇరాన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఎలాంటి ఆయుధాలతో రెడీ అవుతుందో చూడాలి. రాబోయే 100 రోజులు కూడా మధ్యప్రాచ్చానికి మరింత కీలకమని నిపుణులు చెబుతున్నారు.




