Vikarabad: తెల్లవారుజామునే పోలీసుల మెరుపు తనిఖీలు.. గరీబ్ నగర్ సీజ్!

Vikarabad: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు గరీబ్ నగర్ ప్రాంతంలో పోలీసులు తెల్లవారుజామున భారీ 'కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం' నిర్వహించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 24 May 2026 8:16 PM IST
Vikarabad
X

Vikarabad: తెల్లవారుజామునే పోలీసుల మెరుపు తనిఖీలు.. గరీబ్ నగర్ సీజ్!

Vikarabad: వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్, గారి ఆదేశాల మేరకు, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య పర్యవేక్షణలో, వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గరీబ్ నగర్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున భారీగా 'కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం' నిర్వహించారు. ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా, ఈ తనిఖీలు తెల్లవారుజామున 5:00 గంటల నుండి ఉదయం 7:00 గంటల వరకు దాదాపు రెండు గంటల పాటు కొనసాగాయి. ఈ విస్తృత తనిఖీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి పోలీస్ శాఖ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసింది.

ఇందులో భాగంగా 9 కట్-ఆఫ్ పార్టీలు, 5 సెర్చ్ పార్టీలు, 5 లిఫ్టింగ్ పార్టీలతో పాటు, హోల్డింగ్ పాయింట్ వద్ద బలమైన బందోబస్తు ఏర్పాట్లను మోహరించారు. ఈ ఆపరేషన్‌లో 3 గురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు (CIs), 11 మంది సబ్-ఇన్‌స్పెక్టర్లు (SIs) మరియు 100 మందికి పైగా పోలీస్ సిబ్బంది చురుగ్గా పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా, గరీబ్ నగర్ ప్రాంతంలో సరైన పత్రాలు లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న 55 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

వాహన యజమానులు తమ వాహనాలకు సంబంధించిన అసలు పత్రాలను సమర్పించి, తదుపరి చట్టపరమైన ప్రక్రియల తర్వాతే వాహనాలను అప్పగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే, ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పెద్ద ఎత్తున మద్యం సీసాలు, నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను పర్యవేక్షించడంలో భాగంగా, అదే ప్రాంతంలో నివసిస్తున్న ఐదుగురు రౌడీషీటర్లను గుర్తించి హోల్డింగ్ పాయింట్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి, వారి ఆధార్ కార్డులను పరిశీలించి, పాపిలాన్ డివైజ్ (Papillon Device) ద్వారా వారి వేలిముద్రలను సేకరించారు.

ఈ సందర్భంగా వికారాబాద్ డీఎస్పీ అంజయ్య మాట్లాడుతూ

ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజల్లో భయాందోళనలు సృష్టించినా సహించేది లేదని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని, కాలనీల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించినా వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని వికారాబాద్ డీఎస్పీ అంజయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజల రక్షణ, భద్రత కొరకు ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story