Uppal: రాత్రిపూట దోపిడీ.. ఉప్పల్‌లో పోలీసులకు దొరికిన ముఠా!
Uppal: ఉప్పల్‌లో దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్.
Uppal: రాత్రిపూట దోపిడీ.. ఉప్పల్‌లో పోలీసులకు దొరికిన ముఠా!
ఉప్పల్: రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులతో పాటు ఒక బాలుడిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4,000 నగదు, ఒక యాక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 7వ తేదీ అర్ధరాత్రి (8వ తేదీ తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో) రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీకి చెందిన పండ్ల వ్యాపారి సోమనార్ చంద్రశేఖర్ తన స్నేహితులు శివకాంత్, హనుమంత్ లతో కలిసి పెట్రోల్ కోసం వెళ్తుండగా మోడ్రన్ బేకరీ సమీపంలో ఐదుగురు వ్యక్తులు అడ్డగించారు.
అనంతరం రాళ్లు, చెప్పులతో దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసి శివకాంత్ వద్ద ఉన్న రూ.4,000 నగదును లాక్కొని పరారయ్యారు. ఈ దాడిలో చంద్రశేఖర్ తలకు గాయమైంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, రామంతాపూర్ డీ-మార్ట్ సమీపంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో గుడిగుంటి శ్రేయస్ (23), ఆంథోనీ జోనాథన్ (23), పంచుభాయ్ భీమ్‌రాజ్ (22), వల్లాల మనిదీప్ (24)తో పాటు ఒక బాలుడు ఉన్నారు.
విచారణలో నిందితులు రాత్రి వేళల్లో రోడ్లపై సంచరిస్తూ ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి నగదు, విలువైన వస్తువులు దోచుకునేవారని వెల్లడైంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి దోచుకున్న రూ.4,000 నగదు, నేరానికి ఉపయోగించిన యాక్టివా ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించారు. కేసులో ఉన్న బాలుడిని చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా (CCL)గా గుర్తించి సీసీఎల్ హోంకు తరలించారు. ఈ కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసు బృందాన్ని మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ అధికారులు అభినందించారు.




