Renault Duster : రెనాల్ట్ మాస్టర్ స్ట్రోక్.. తక్కువ ధరలో ప్రీమియం SUV అనుభవం
Renault Duster : ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్' (Renault) భారత మార్కెట్లో తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి సరికొత్త ప్లాన్‌తో దూసుకుపోతోంది. ఈ ఏడాది..
Renault Duster
Renault Duster : ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్' (Renault) భారత మార్కెట్లో తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి సరికొత్త ప్లాన్‌తో దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో కొండ ప్రాంతాలలో పవర్‌ఫుల్ 160bhp వేరియంట్‌తో ‘డస్టర్’ (Duster) ను టెస్ట్ చేసినప్పుడు అది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, మిడ్-సైజ్ ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వాలంటే భిన్నమైన ఇంజన్ ఆప్షన్లు అవసరం. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివర్లో 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌ను తీసుకురావడానికి ముందు, రెనాల్ట్ తన బేస్ వేరియంట్ అయిన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కూడిన డస్టర్ అమ్మకాలను ప్రారంభించింది. ఈ కారు డ్రైవింగ్ అనుభూతి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
టాప్ వేరియంట్‌కు ఏమాత్రం తీసిపోని లుక్స్
సాధారణంగా బేస్ లేదా మిడ్-వేరియంట్ కార్ల లుక్స్ అంత ఆకర్షణీయంగా ఉండవు. కానీ రెనాల్ట్ ఇక్కడ స్మార్ట్ గేమ్ ఆడింది. 1.0-లీటర్ టర్బో ఇంజన్‌తో వచ్చే ఈ డస్టర్ 'టెక్నో' (Techno) వేరియంట్.. లుక్స్ పరంగా టాప్-స్పెక్ 'ఐకానిక్' (Iconic) వేరియంట్‌కు అచ్చంగా ప్రతిరూపంలా ఉంటుంది. కేవలం ఒకే ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే, టాప్ వేరియంట్‌లో 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటే, ఇందులో విభిన్నమైన డిజైన్‌తో కూడిన 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ఇవి కూడా వీల్ ఆర్చ్‌లకు చక్కగా సరిపోయి కారుకు మంచి లుక్‌ను ఇస్తాయి. మిగిలినదంతా మునపటి డస్టర్ లాగే అగ్రెసివ్ బంపర్, రూఫ్ రైల్స్, భారీ క్లాడింగ్ , వెనుక వైపు ఫుల్-విడ్త్ టెయిల్ లాంప్స్‌తో ఎస్‌యూవీ లుక్‌ను పక్కాగా అందిస్తుంది.
ఇంటీరియర్ ఫీచర్లు , దేశంలోనే సరికొత్త రికార్డ్
కారు లోపలి లేఅవుట్ కూడా టాప్ వేరియంట్ లాగే ఉంటుంది. అయితే టాప్ వేరియంట్‌లోని గ్రీన్ లెదరెట్‌కు బదులుగా ఈ టెక్నో వేరియంట్‌లో బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ సీట్లను అందించారు. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 10.1-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ , వైర్‌లెస్ చార్జర్ ఉన్నాయి.
అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ , 'పవర్డ్ టెయిల్‌గేట్' (Powered Tailgate) ఫీచర్లను కూడా అందించడం విశేషం. భారతదేశంలోనే పవర్డ్ టెయిల్‌గేట్ ఫీచర్‌తో లభిస్తున్న అత్యంత తక్కువ ధర కలిగిన కారు ఇదే కావడం గమనార్హం. అయితే, ఇందులో ఉండే 7-ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే , రివర్సింగ్ కెమెరా క్వాలిటీ (పిక్సలేటెడ్ ఫీడ్) అంతగా ఆకట్టుకోవు. వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉండి ఉంటే ఇది పర్ఫెక్ట్ ప్యాకేజ్ అయ్యేది.
1.0-లీటర్ చిన్న ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది?
కాగితం మీద చూస్తే 1.0-లీటర్, 3-సిలిండర్ టర్బో ఇంజన్ (100bhp పవర్, 166Nm టార్క్) ఈ సెగ్మెంట్‌లోని క్రెటా, సెల్టోస్ (115bhp), టాటా సియెర్రా (106bhp), టైగూన్ (115bhp) ల కంటే తక్కువ పవర్ కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, ప్రాక్టికల్‌గా రోడ్డుపైకి వస్తే సీన్ మారుతుంది.
ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. రెనాల్ట్ ఈ ఇంజన్‌కు గేర్ రేషియోలను చాలా అద్భుతంగా సెట్ చేసింది. 2,000rpm నుంచే మంచి టార్క్ అందుతుండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో సెకండ్ గేర్‌పై కూడా కారు చాలా సులభంగా దూసుకుపోతుంది. మిడ్-రేంజ్ పవర్ డెలివరీ చాలా లీనియర్‌గా ఉండి, హైవేలపై 5,000rpm వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 100 కిమీ వేగాన్ని సులభంగా అందుకుంటుంది. గేర్‌బాక్స్ షిఫ్టులు షార్ట్‌గా, క్లచ్ చాలా లైట్‌గా ఉండటం వల్ల డ్రైవింగ్ చేసే వారికి ఇది మంచి ఫన్ అందిస్తుంది. 3-సిలిండర్ ఇంజన్ అయినప్పటికీ క్యాబిన్ లోపల వైబ్రేషన్స్ కానీ, ఇంజన్ శబ్దం కానీ రాకుండా ఇన్సులేషన్ చాలా బాగా చేశారు.
రైడ్ అండ్ హ్యాండ్లింగ్: డస్టర్ అసలైన డిఎన్ఏ (DNA)
ఈ కారుకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని రైడ్ అండ్ హ్యాండ్లింగ్. 160bhp డస్టర్ లాగే ఇది కూడా మూలల (Corners) లో బాడీ రోల్ లేకుండా చాలా పటిష్టంగా రోడ్డును పట్టుకుని సాగుతుంది. దీని స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ చాలా షార్ప్‌గా ఉండి హైవేలపై మంచి కాన్ఫిడెన్స్‌ను ఇస్తుంది. సస్పెన్షన్ కొద్దిగా స్టిఫ్‌గా (గట్టిగా) ఉన్నప్పటికీ, భారతీయ రోడ్లపై ఉండే గుంతలను, స్పీడ్ బ్రేకర్లను ఇది చాలా సులభంగా తట్టుకుంటుంది. బ్యాడ్ రోడ్లను ఎదుర్కోవడంలో ఈ సెగ్మెంట్‌లో ఇదే బెస్ట్ అని చెప్పాలి.
ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.50 లక్షల వద్ద రెనాల్ట్ డస్టర్ టెక్నో 100 (Techno 100) వేరియంట్ ఒక అద్భుతమైన 'వాల్యూ ఫర్ మనీ' ఆప్షన్. మిడ్-స్పెక్ వేరియంట్ అయినప్పటికీ లుక్స్ పరంగా, ఫీచర్ల పరంగా (పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటివి) ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు అనిపించదు. 100bhp ఇంజన్ రోజువారీ అవసరాలకు , హైవే ప్రయాణాలకు చక్కగా సరిపోతుంది. రెనాల్ట్ గనుక ఇందులో ఒక ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా తీసుకువస్తే, ఇది పోటీదారుల అమ్మకాలకు గట్టి బ్రేక్ వేయడం ఖాయం.




