Nissan Gravite Price Hike : 4 నెలల క్రితమే లాంచ్.. అప్పుడే నిస్సాన్ 7-సీటర్ కార్ ధరలకు రెక్కలు

Nissan Gravite Price Hike : నిస్సాన్ కంపెనీ తన పాపులర్ 7-సీటర్ కార్ నిస్సాన్ గ్రావిటీ ధరలను పెంచింది. ఫిబ్రవరి 2026లో లాంచ్ అయిన ఈ మోడల్ కొత్త ధరల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

CR Reddy
Published on: 9 Jun 2026 8:31 AM IST
Nissan Gravite
X

Nissan Gravite 

Nissan Gravite Price Hike : భారత మార్కెట్లో బడ్జెట్ ధరలో లభించే సరికొత్త 7-సీటర్ ఎమ్‌పీవీ కారు నిస్సాన్ గ్రావిటీ ధరలు పెరిగాయి. ఈ కారును నిస్సాన్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 2026 లోనే చాలా ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసింది. కారు మార్కెట్లోకి వచ్చిన కేవలం నాలుగు నెలల కాలంలోనే కంపెనీ దీని ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లాంచ్ చేసిన సమయంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇచ్చిన ఇంట్రడక్టరీ ఆఫర్ ముగిసిపోవడంతోనే ఈ ధరల సవరణ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

వేరియంట్ల వారీగా పెరిగిన రేట్ల వివరాలు

నిస్సాన్ గ్రావిటీ కార్ వేరియంట్లను బట్టి ధరలను రూ.8,000 నుంచి రూ.18,000 వరకు పెంచారు. ఈ మార్పుల తర్వాత నిస్సాన్ గ్రావిటీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.73 లక్షల నుంచి టాప్ మోడల్ ధర రూ.9.08 లక్షల వరకు చేరింది. ఈ కారు బేస్ వేరియంట్ అయిన Visia MT పై రూ.8,000 పెరగడంతో దీని కొత్త ధర రూ.5.73 లక్షలుగా మారింది. ఇక అత్యధికంగా N-Connecta MT వేరియంట్‌పై రూ.18,000 పెంచారు, దీనితో దీని ధర రూ.7.38 లక్షలకు చేరుకుంది. మిగిలిన మోడళ్లపై రూ.15,000 నుంచి రూ.17,000 వరకు పెరగ్గా, టాప్ ఎండ్ మోడల్ Limited Launch Edition AMT ధర ఇప్పుడు రూ.9.08 లక్షలకు చేరింది.

లుక్, డిజైన్ పరంగా అదిరిపోయింది

ఈ నిస్సాన్ గ్రావిటీ కారును మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందించారు. అయినప్పటికీ దీని డిజైన్ మాత్రం పూర్తిగా నిస్సాన్ బ్రాండ్ శైలిని ప్రతిబింబిస్తుంది. కారు ముందు భాగంలో నిస్సాన్ సిగ్నేచర్ వి-మోషన్ గ్రిల్, ఆకట్టుకునే హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, స్టైలిష్ బంపర్, సిల్వర్ స్కిడ్-ప్లేట్ వంటివి అమర్చారు. వీటికి తోడు కారు బాడీపై ప్రత్యేకమైన “Gravite” బ్యాజింగ్ కూడా ఇచ్చారు, ఇది కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

ఫీచర్ల విషయానికొస్తే నో కాంప్రమైజ్

తక్కువ ధరలోనే లభిస్తున్నప్పటికీ ఈ 7-సీటర్ కారు కేబిన్ లోపల ఆధునిక ఫీచర్లకు కొదవ లేదు. ఇందులో పెద్ద 8 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం 7 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్, అవసరానికి తగ్గట్టుగా మార్చుకునే ఫ్లెక్సిబుల్ సీటింగ్ లేఅవుట్ ఉన్నాయి. ఇవి కాకుండా టాప్ వేరియంట్లలో వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, అంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి లగ్జరీ ఫీచర్లను కూడా అందించారు.

ఇంజన్ సామర్థ్యం, మైలేజ్ రికార్డు

నిస్సాన్ గ్రావిటీ కారులో 1.0-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను వాడారు. ఈ ఇంజన్ గరిష్టంగా 71 హార్స్‌పవర్, 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్ల సౌలభ్యం కోసం ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. మైలేజ్ పరంగా చూస్తే, మాన్యువల్ వర్షన్ లీటరుకు 19.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఏఎమ్‌టీ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 19.6 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ధరలు కాస్త పెరిగినప్పటికీ, పెద్ద కుటుంబాలకు ఇప్పటికీ ఇది దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా నిలుస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story