Honda City Facelift : సరికొత్త అవతారంలో హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. టాప్ 5 ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అంతే

Honda City Facelift : భారతదేశంలో 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ రూ.12 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయింది. కొత్త డిజైన్, 10.1 ఇంచ్ స్క్రీన్, అప్‌గ్రేడెడ్ ఫీచర్ల పూర్తి సమాచారం తెలుసుకుందాం.

CR Reddy
Published on: 24 May 2026 10:03 AM IST
Honda City Facelift
X

Honda City Facelift

Honda City Facelift : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ సెడాన్ కార్లలో హోండా సిటీ ఎప్పుడూ ముందే ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ మోడల్.. మిడ్‌సైజ్ సెడాన్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి సరికొత్త అప్‌గ్రేడ్స్‌తో మన ముందుకు వచ్చింది. 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌ను కంపెనీ భారత మార్కెట్లోకి ఘనంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.12,00,000 గా నిర్ణయించారు. ఈ ఐకానిక్ కారుకు కంపెనీ అందిస్తున్న రెండవ మిడ్-సైకిల్ అప్‌డేట్ ఇది. పాత మోడల్‌తో పోలిస్తే డిజైన్, టెక్నాలజీ,సేఫ్టీ పరంగా ఇందులో విప్లవాత్మక మార్పులు చేశారు.

కళ్లు చెదిరే ఎక్స్‌టీరియర్ లుక్స్

కొత్త 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కారులో అందరినీ ఆకట్టుకునే ప్రధాన మార్పు దాని ఎక్స్‌టీరియర్. కారు ముందు భాగంలో కనెక్ట్ చేయబడిన సరికొత్త ఎల్‌ఈడీ డీఆర్ఎల్ (DRL) లైట్ బార్‌తో కూడిన బై-ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లను అమర్చారు. దీనివల్ల కారుకు ఎంతో మోడ్రన్ అండ్ స్పోర్టీ లుక్ వచ్చింది. ఫ్రంట్ గ్రిల్ విషయానికి వస్తే, బ్లాక్ మ్యాట్రిక్స్ మెష్ డిజైన్‌తో పాటు హోండా లోగోను మరింత ఆకర్షణీయమైన రీతిలో మార్చారు. బంపర్‌ను ఎయిర్ కర్టెన్లతో రీడిజైన్ చేయడం వల్ల కారు మరింత ఎయిరోడైనమిక్‌గా మారింది. వెనుక వైపు Z-షేప్ ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, స్టైలిష్ ట్రంక్ లిప్ స్పాయిలర్ కారు అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. పాత మోడల్ కంటే ఈ సరికొత్త సిటీ కారు 11 మిల్లీమీటర్లు ఎక్కువ పొడవును (మొత్తం 4,594 మిమీ) కలిగి ఉంది. అయితే వీల్స్ విషయంలో మాత్రం పాత 16-ఇంచ్ అలాయ్ వీల్స్‌నే కొనసాగించారు.

బ్లాక్ లవర్స్ కోసం కొత్త కలర్

కార్ల కలర్స్ విషయంలో కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా హోండా ఈసారి ఏకంగా ఆరు సరికొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రేడియంట్ రెడ్ మెటాలిక్, అబ్సిడియన్ బ్లూ పర్ల్, మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, ప్లాటినం వైట్ పర్ల్ కలర్స్‌తో పాటు, ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో క్రిస్టల్ బ్లాక్ పర్ల్ అనే సరికొత్త రాయల్ బ్లాక్ కలర్‌ను తీసుకొచ్చారు. ఇక కారు లోపలి భాగానికి వస్తే.. ఐవరీ, బ్లాక్ కలర్ కలయికతో కూడిన సరికొత్త డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్‌ను అందించారు. డార్క్ ఐరన్ 3D ప్యాటర్న్ ఫినిషింగ్, లగ్జరీ రియర్ లాంజ్ సీటింగ్, మూడ్ మార్చేసే అంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి సదుపాయాలు ప్రయాణాన్ని ఎంతో హాయిగా మారుస్తాయి.

బిగ్ సైజ్ టచ్‌స్క్రీన్.. కూలింగ్ సీట్లు

టెక్నాలజీ పరంగా ఈ కారులో భారీ మార్పు చోటుచేసుకుంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో సరికొత్త 10.1-ఇంచుల భారీ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఈ కారులో లభించే మరో బెస్ట్ ఫీచర్ ఏమిటంటే.. అప్‌గ్రేడెడ్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు. మునుపటి కంటే ఈ సీట్ల కూలింగ్ ఎఫిషియన్సీని ఏకంగా 40 శాతం పెంచినట్లు కంపెనీ గర్వంగా చెప్తోంది. దీనివల్ల వేసవి కాలంలో కూడా ప్రయాణికులకు సూపర్ కూల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. ఇవే కాకుండా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కారు దిగి వెళ్లగానే ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే వాక్-అవే ఆటో-లాక్ ఫంక్షన్, రిమోట్ ద్వారా ఏసీని ఆన్ చేసుకునే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇందులో ఉన్నాయి.

లెవెల్ 2 ADAS సేఫ్టీ..

భద్రత విషయంలో హోండా ఎప్పుడూ రాజీ పడదు. ఈ కారులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ (VSA), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ప్రమాదాలను ముందుగానే గుర్తించి అలర్ట్ చేసే అత్యాధునిక లెవెల్ 2 అడాస్ టెక్నాలజీ అందించారు. ధరల విషయానికి వస్తే.. స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ల ప్రారంభ ధర రూ.12 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది, ఇందులో ఎలాంటి మార్పు లేదు. అయితే, మైలేజ్ పరంగా టాప్‌లో ఉండే e:HEV స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ధరను మాత్రం కంపెనీ దాదాపు రూ.1,00,000 వరకు పెంచింది. దీంతో హోండా సిటీ హైబ్రిడ్ మోడల్ ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ.21 లక్షలకు చేరింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story