తెలంగాణలో మద్యనిషేధం సాధ్యమా?

తెలంగాణలో మద్యనిషేధం సాధ్యమా?
x
Highlights

బీజేపీ నాయకురాలు డీకే అరుణ నిరసన దీక్షతో అందరి దృష్టి ఒక్కసారిగా మద్యనిషేధంపై పడింది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ను...

బీజేపీ నాయకురాలు డీకే అరుణ నిరసన దీక్షతో అందరి దృష్టి ఒక్కసారిగా మద్యనిషేధంపై పడింది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ను బ్యాన్ చేస్తామంటున్నారు. ఆ మేరకు అక్కడ మద్యం దుకాణాల సంఖ్య తగ్గించారు. మద్యం రేట్లు కూడా పెంచేశారు. నిషేధం దిశలో మరి కొన్ని చర్యలు కూడా చేపట్టారు. మరి తెలంగాణలో మద్య నిషేధం సాధ్యమేనా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మద్యం ఓ పెద్ద ఆదాయ వనరుగా ఉంది. అదే సమయంలో తెలంగాణలో మద్యనిషేధం అమలు చేయాలంటూ బీజేపీ ఉద్యమిస్తోంది. తాజాగా ఇదే విషయమై ఆ పార్టీ నాయకురాలు డీకే అరుణ నిరసన దీక్ష కూడా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారపక్షం తెలంగాణలో విపక్షం కోరుకుంటున్నట్లుగా మద్యనిషేధం సాధ్యమవుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.

మానవ జాతికి మద్యం కొత్తేమీ కాదు. అదే సమయంలో మద్యనిషేధం కూడా పాతదే. అమెరికాలో 1920లోనే మద్యాన్ని నిషేధించారు. పదమూడేళ్ళ పాటు ఆ నిషేధాన్ని అమలు చేశారు. ఆ తరువాత నిషేధాన్ని ఎత్తివేశారు. 1955లో మరోసారి మద్యాన్ని నిషేధించారు. 1975లో ఆ నిషేధాన్ని తొలగించారు. భారతదేశంలోనూ మద్యపాన నిషేధం కొత్తేమీ కాదు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా మద్యంపై కూడా యుద్ధం జరిగింది. 1935లోనే మద్రాస్, బొంబాయి, యునైటెడ్ రాష్ట్రాల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయోగాత్మకంగా మద్యం నిషేధించాయి. ఓ పదేళ్ళ కాలంలోనే మద్య నిషేధాన్ని ఎత్తివేశారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఇదే కథ రిపీట్ అయింది. 1977లో మొరార్జీ దేశాయ్ సారథ్యంలో జనతా ప్రభుత్వం మద్యాన్ని నిషేధించాలని భావించింది. జనతా పార్టీ అధికారంలో ఉన్న చోట ఈ నిషేధం అమలైంది. కాకపోతే ఈ ప్రయోగం కూడా విఫలమైంది. కేరళ, తమిళనాడు పాక్షిక నిషేధ చట్టాలు తెచ్చాయి. లక్షద్వీప్, గుజరాత్, బిహార్, నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాలు సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తున్నాయి. గుజరాత్ విషయానికి వస్తే అక్కడ మద్యం అక్రమ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. బిహార్ లో మాత్రం మద్యనిషేధం కట్టుదిట్టంగా అమలు చేయడంతో అక్కడి కుటుంబాలు కొన్ని వేల కోట్ల రూపాయల మేరకు ఆదా చేసుకోగలిగినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. అంతేగాకుండా నేరాల రేటు కూడా తగ్గుతోంది. హర్యానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సైతం మద్యనిషేధం ప్రకటించినా అమలు చేయలేక ఉపసంహరించుకున్నాయి.

మద్య నిషేధాన్ని ప్రభుత్వాలు ఉపసంహరించుకునేందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం. ఇక రెండోది మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకునేందుకు ఇష్టపడకపోవడం. దేశంలో నేటికీ గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో మద్యనిషేధం అమలవుతోంది. మరెన్నో రాష్ట్రాలు మాత్రం మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఓ ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో మద్యం కీలకపాత్ర వహించడం కొత్తేమీ కాదు. 1935 ప్రాంతంలోనే మద్రాస్ రాష్ట్ర ఆదాయంలో 33 శాతం మద్యం ద్వారా వచ్చేది. నేడు పలు రాష్ట్రాలకు ఇతర ఆదాయ వనరులు పెరిగినా మద్యం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం ఆకర్షణీయ స్థాయిలోనే ఉంటోంది. అందుకే అవి మద్యనిషేధం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మద్యం ద్వారా లభిస్తున్న ఆదాయం గణనీయంగానే ఉంటోంది. నవంబర్ 1 నుంచి తెలంగాణలో మద్యం కొత్త పాలసీ అమల్లోకి వచ్చింది. మద్యం దుకాణాల దరఖాస్తుల రూపంలోనే 920 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మద్యం ధరలను పెంచిన నేపథ్యంలో అదనపు ఆదాయం కూడా రానుంది. 2016 -17 ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి 5, 580 కోట్ల మేరకు ఆదాయం వస్తే, ఆ మరుసటి సంవత్సరం అది 9, 241 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ ఏడాది ఆదాయం మరింత పెరగనుంది. దేశంలో ఆర్థిక మాంద్యం పెరిగిపోయింది. మరో వైపున కేంద్రం నుంచి అందే సాయంలో కోత పడుతోంది. ఇతరత్రా సొంత ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం పై వచ్చే ఆదాయాన్ని వదులుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇష్టపడకపోవచ్చు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ గనుక మద్యం పై నిషేధం విధిస్తే తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

తెలంగాణలో మద్య నిషేధ అంశం కొన్నేళ్ళ తరువాత ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. దిశ సంఘటన కూడా ఇందుకు దోహదం చేసింది. మహిళలపై అత్యాచారాలు పెరగడంలో మద్యం కీలకపాత్ర వహిస్తున్నదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఒక్కసారిగా మద్యనిషేధ అస్త్రాన్ని ప్రభుత్వంపై సంధించింది. ఈ విషయంలో గతంలోనూ బీజేపీ గళమెత్తినా ఒక ఉద్యమ రూపంలో మాత్రం ముందుకెళ్ళలేకపోయింది. ఈ దఫా మాత్రం అలాంటి ప్రయత్నం జరుగుతున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలో మద్యపానం వల్ల అనేక అఘాయిత్యాలు జరిగిపోతున్నాయని బీజేపీ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. జరగకూడని ఘోరాలకు ఎన్నో కుటుంబాలు సజీవ సాక్ష్యాలుగా మిగిలి పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం ఆరోపించారు. తాగిన మైకంలో యువకులు అకృత్యాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. మద్యం అందుబాటులో లేక పోతే యువత చెడుమార్గం పట్టదని చెప్పుకొస్తున్నారు.

బీజేపీ ఒక్కటే కాదు నేడు అనేక మహిళా సంఘాలు సైతం మద్యనిషేధం కోసం డిమాండ్ చేస్తున్నాయి. కాకపోతే వీరి డిమాండ్ ను సీఎం కేసీఆర్ ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి. తాజాగా బీజేపీ చేపట్టిన పోరాటంలో రాజకీయ కోణం కూడా ఉండడంతో ఈ అంశం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories