యాదృచ్ఛికం....ఎంతో ఆశ్చర్యం.. దశదినకర్మ రోజునే ఎన్ కౌంటర్

యాదృచ్ఛికం....ఎంతో ఆశ్చర్యం.. దశదినకర్మ రోజునే ఎన్ కౌంటర్
x
Highlights

కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినా ఆశ్చర్యం కలిగించేవిగానే ఉంటాయి. దిశ ను దారుణంగా హతమార్చిన హంతకుల విషయంలోనూ అలానే జరిగింది. సరిగ్గా దిశ మరణించిన...

కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినా ఆశ్చర్యం కలిగించేవిగానే ఉంటాయి. దిశ ను దారుణంగా హతమార్చిన హంతకుల విషయంలోనూ అలానే జరిగింది. సరిగ్గా దిశ మరణించిన పదో రోజునాడే ఆమె దశదిన కర్మ జరుగుతున్న రోజునే ఆమె హంతకులు ఎన్ కౌంటర్ లో చనిపోయారు. దిశ ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆమె హంతకులను వెంటనే చంపివేయాలన్న డిమాండ్ కూడా వచ్చింది. దాన్ని నిజం చేసే విధంగా అన్నట్లుగా దశదినకర్మ జరిగే లోపునే బహుశా ఆమె ఆత్మకు శాంతి చేకూర్చేలా ఆ నలుగురు హంతకులు ఎన్ కౌంటర్ అయిపోయారు. అది కూడా సరిగ్గా వారు ఆమెను దహనం చేసిన చోటనే. ఈ యాధృచ్ఛిక అంశాలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

దిశ దారుణ హత్యకు గురై అప్పుడే పది రోజులు గడిచిపోయాయి. ఆమె దశదినకర్మకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో పొద్దున్నే ఓ వార్త యావత్ దేశాన్ని కుదిపివేసింది. దిశను దారుణంగా హత్య చేసిన నలుగురూ పోలీసుల ఎన్ కౌంటర్ లో ఖతమైపోయారు. ఆ వార్త దిశ కుటుంబసభ్యులకూ ఎంతో ఆనందం కలిగించింది. తమకు కలిగినటువంటి బాధ మరే ఆడపిల్ల కుటుంబానికి కలగవద్దని వారు కోరుకున్నారు. అంతేకాదు తమకు ఇంతటి వేదన మిగిల్చిన ఆ నలుగురికీ ఉరిశిక్ష పడాలని కూడా కోరుకున్నారు. వారి కోరిక నెరవేరింది. ఓ బలమైన సందేశం ప్రజల్లోకి వెళ్ళింది. దిశపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చిన నలుగురూ ఎన్ కౌంటర్ లో మరణించారు.

దిశ హత్య కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించిన తరువాత ప్రజల్లో మరెన్నో అనుమానాలు కలిగాయి. ఏడేళ్ళయినా కూడా నిర్భయ కేసులో దోషులకు శిక్ష అమలు కాలేదు ఇక దిశలో కేసులో ఎన్నేళ్ళకు వారికి శిక్షపడుతుందో అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమైంది. కస్టడీలోకి తీసుకున్న నిందితులను తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసమని ఘటనాస్థలికి తీసుకెళ్ళారు. అక్కడ నిందితులు పోలీస్ లపై రాళ్ళు రువ్వారని, ఆయుధాలు లాక్కొని పోలీసులపై దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారుల కథనం. ప్రాణ రక్షణకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ నలుగురు నిందితులు హతమైపోయారు. తనను ఎక్కడైతే కాల్చారో అక్కడే ఆ నలుగురు హతం కావడంతో దిశ ఆత్మ ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్న వ్యాఖ్యలూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తక్షణ న్యాయం జరగాలంటూ డిమాండ్ చేసిన కోట్లాదిమంది ప్రజల కోరిక నెరవేరింది. తక్షణ న్యాయం మాత్రమే కాదు ఎక్కడైతే ఆ నలుగురు నేరానికి పాల్పడ్డారో అదే చోట వారికి శిక్ష కూడా పడినట్లయింది. అది కూడా దిశ దశదిన కర్మ రోజునే. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని అంతా ప్రార్థించారు. ఆ ప్రార్థనలకు ఫలితం ఎన్ కౌంటర్ రూపంలో లభించినట్లుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories