Top
logo

హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం

హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షంప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగరంతో పాటు మరి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి....

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగరంతో పాటు మరి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. నగరంలోని ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్‌ మధ్య, ఖైరతాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సంతోష్‌నగర్‌, మలక్‌పేట, అఫ్జల్‌గంజ్‌, మోహిదీపట్నం, లక్డికాపూల్‌, కోఠి, నారాయణగూడ, అంబర్‌పేట, రాంనగర్‌, సోమాజిగూడ, పంజాగుట్ట, ఈసీఐఎల్‌, నాచారం, ఇబ్రహీంపట్నం, బంజారాహిల్స్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలిలో కూడా పెద్ద వర్షం పడింది.

ఇటు ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ మధ్య, నాగోల్‌, బీఎన్‌ రెడ్డి నగర్, మీర్‌పేట, హస్తినాపురంలో దాదాపు గంట పాటు భారీ వర్షం కురిసింది.ఈ రోజు కురిసిన వర్షంతో నిన్నటి వరకు ఎండలకు హడలి పోయిన నగరవాసులు కాస్త ఉపశమనం లభించినట్లయింది.

అంతే కాక ఇటు మంచిర్యాల, కొమురం భీమ్ జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాల్లోని వరి తడిసి ముద్దయ్యింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే.

ఆగ్నేయ అరేబియా సముద్రం దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో రాగల 48 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తరువాత ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయానిస్తుందని తెలిపారు.

తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అన్నారు.

రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది.

ఇక మరో వైపు ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవులు వరకు దక్షిణ కర్ణాటక, కేరళ , తెలంగాణ, రాయలసీమ, మీదుగా దాదాపు కిలో మీటరు ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో దీని ప్రభావంతో అక్కడక్కడ వడగాడ్పులు అలాగే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

Web Titleweather updates: Heavy rains lash parts of Hyderabad Telangana
Next Story