Top
logo

టీఆర్ఎస్‌ పై 'రాములమ్మ' ఫైర్!

టీఆర్ఎస్‌ పై రాములమ్మ ఫైర్!
X
Highlights

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్‌పర్సన్, విజయశాంతి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీపై ఫేస్‌బుక్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్‌పర్సన్, విజయశాంతి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీపై ఫేస్‌బుక్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జనం అంతా విష జ్వరాలతో అల్లాడుతుంటే అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం గులాబీ జెండాకు బాస్ ఎవరు? అని ఓ వర్గం. కెసిఆర్ తప్ప గులాబీ జెండా కు బాస్ ఎవరు లేరని మరో వర్గం వాదించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. అందరి కంటే తనకు రాజకీయాల్లోనూ పాలనాపరంగా ముందుచూపు ఉందని ప్రకటించుకునే కెసిఆర్.. విష జ్వరాలతో ప్రజలు పడే బాధల విషయంలో మాత్రం ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో జనానికి అంతుబట్టడం లేదని అన్నారు. ఆరోగ్య సమస్యలను కారణంగా చూపించి... తనను బలిపశువును చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు సన్నిహితులతో వాపోయినట్లు వార్తలు వచ్చాయన్నారు. దీంతో డెంగ్యూ జ్వరాలు స్వైన్ ఫ్లూ వంటి జ్వరాలతో జనం ఆస్పత్రులలో బారులు తీరుతున్నప్పటికీ.. ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం దీనిని పెద్ద సీరియస్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని పరిస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య లోపం వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నాయనే వాదన కూడా ఉంది. ఈ రోజు ఈటల రాజేందర్ గారు జిహెచ్ఎంసిలో సమావేశం నిర్వహించి... ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనుక కారణం కూడా లేకపోలేదని అన్నారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుసన్నల్లోనే ఇప్పటికీ జిహెచ్ఎంసితో పాటు మున్సిపల్ వ్యవస్థ నడుస్తోంది అన్నది జగమెరిగిన సత్యం అని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వివాదంలో తనను ఇరికించాలని అనుకుంటే పరోక్షంగా ఈ సమస్యను కేటీఆర్ మెడకు చుట్టాలని ఈటల రాజేందర్ గారు భావిస్తున్నట్లు టిఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారని అన్నారు. ఓవైపు ఇంత బీభత్సం జరుగుతున్నా.... హరీష్ రావు సీఎం కావాలంటూ టీఆర్ఎస్ నేత విష్ణు జోగులాంబ గుడిలో 1016 కొబ్బరికాయలు కొట్టడంపైనా ఆమె తీవ్రంగా స్పందించారు.మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాత్రం సందట్లో సడేమియా అన్న చందంగా... తన అనుచరులతో వెయ్యి కొబ్బరి కాయలు కొట్టించి... తాను ముఖ్యమంత్రి అవ్వాలని మొక్కులు చెల్లిస్తూ... చాపకింద నీరులాగా పావులు కదుపుతున్న విషయం స్పష్టమైందని అన్నారు. విజయశాంతి చేసిన ఈ కామెంట్స్ కి అధికార పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Next Story