బాసరలో భక్తుల సందడి.. వైభవంగా వసంత పంచమి వేడుకలు

బాసరలో భక్తుల సందడి.. వైభవంగా వసంత పంచమి వేడుకలు
x
Highlights

సమస్త లోకాలకు జ్ఞానాన్ని ప్రసాదించేది చదువుల తల్లి సరస్వతి. ఈ దేవిని కొలిస్తే సిద్ధి బుద్ధి సంతరించుకుంటాయి.

సమస్త లోకాలకు జ్ఞానాన్ని ప్రసాదించేది చదువుల తల్లి సరస్వతి. ఈ దేవిని కొలిస్తే సిద్ధి బుద్ధి సంతరించుకుంటాయి. ఇలాంటి తల్లి పుట్టిన రోజును వేడుకలను వసంత పంచమిగా పిలుస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంద్భంగా దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఆలయాని వచ్చి అమ్మవారి దర్శణం చేసుకుంటారు. అంతే కాదు ఈ రోజున పిల్లలకు సరస్వతి మందిరంలో అక్షరాభ్యాసం చేయిస్తే వారు ఎంతో ఉన్నత స్ధాయికి ఎదుగుతారని అక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. దీంతో ఎంతో మంది భక్తులు ఆలయంలో తమ పిల్లల చేత అక్షరాభ్యాసం చేపిస్తారు.

ఇకపోతే వసంత పంచమి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి వివిధ కైంకర్యాలను జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పండితులు అర్ధరాత్రి ఒంటిగంటకు అమ్మవారికి అభిషేకం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, సుప్రభాతం, హారతి నిర్వహించారు. అనంతరం భక్తుల ఆలయ ప్రవేశానికి అనుమతించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రత్యేక అక్షరాభ్యాసాలు ప్రారంభించారు. సాధారణ టికెట్‌తో, రూ. వెయ్యి టికెట్‌తో వేర్వేరు మండపాల చొప్పున మొత్తం నాలుగు మండపాల్లో పండితులు చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు.

ఉదయం 9 గంటలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సర్పించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రికి, అక్కడున్న భక్తులుకు తీర్థ ప్రసాదాలను అందించారు.

ఇక ఈ వేడుకలో భాగంగానే ఉదయం 11 గంటల నుంచి ఆలయంలో చండీ మహా విద్యా హోమం, పూర్ణాహుతి, ఆశీర్వచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేసారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులు, పిల్లలకు అధికారులు పాలు, నీళ్లు పంపిణీ చేస్తున్నారు. పెద్దసంఖ్యలో భక్తుల రాకతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి.

బాసర సరస్వతి ఆలయ స్థల పురాణం..

బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణాలు చెపుతున్నాయి. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తరువాత వేదవ్యాసుడు మనశ్శాంతి కోసం తన కుమారుడు శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడట. ఆ సమయంలోనే వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట. దీంతో వ్యాస మహర్షి నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తీసుకొచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించారని. ఈ ప్రాంతంలో వ్యాసుడు కొంత కాలం నివసించినందుకే ఈ ప్రదేశాన్నివ్యాసపురి, వ్యాసర అన పిలుస్తారని చెపుతుంటారు. తరువాత ఈ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రజల ఎక్కువగా నివసించడం వల్ల వ్యాసరని వారు బాసరగా సంభోదించేవారని దాంతో ఈ గ్రామం 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకున్నది చెపుతారు. ఇక్కడ వ్యాసమహర్షి నిర్మించిన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తిన్నా ఎంతో విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని అక్కడికి వెళ్లే భక్తులు గాఢంగా విశ్వసిస్తారు.

ఇక పోతే ఆది కవి వాల్మికి ఈ ప్రాంతంలో సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం రాసాడని బ్రహ్మాండ పురాణం తెలుపుతుంది. ఈ గుడికి సమీపంలోనే వాల్మికి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు.

శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం...

శరచ్చంద్ర వక్త్రాం లసత్పద్మ హస్తాం - సరోజ నేత్రాం స్ఫురద్రత్న మౌళీం!

ఘనాకార వేణీ౦ నిరాకార వృత్తిం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!

ధరా భార పోషాం సురానీక వంద్యాం మృణాళీ లసద్బాహు కేయూర యుక్తాం!

త్రిలోకైక సాక్షీ ముదార స్తనాధ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!

దురాసార సంసార తీర్ధాంఘ్రి పోతాం క్వణత్ స్వర్ణ మాణిక్య హారాభి రామాం!

శరచ్చంద్రికా ధౌత వాసోలసంతీం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!

విరించీ విష్ణ్వింద్ర యోగీంద్ర పూజ్యాం ప్రసన్నాం విపన్నార్తినాశాం శరణ్యాం!

త్రిలోకాధి నాథాధి నాథాం త్రిశూన్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!

అనంతా మగమ్యా మనాద్యా మభావ్యా మభేద్యా మదాహ్యా మలేప్యా మరూపాం!

అశోష్యా మసంగా మదేహా మవాచ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!

మనో వాగతీతా మనామ్నీ మఖండా మభిన్నాత్మికా మద్వయాం స్వ ప్రకాశాం!

చిదానంద కందాం పరంజ్యోతి రూపాం భజే శారదాం వాసరా పీఠ వాసాం!!

సదానంద రూపాం శుభాయోగ రూపా~మశేషాత్మికాం నిర్గుణాం నిర్వికారాం!

మహా వాక్య వేద్యాం విచార ప్రసంగాం భజే శారదా౦ వాసరా పీఠ వాసాం!!

ఇమం స్తవం పఠేద్వస్తు త్రికాలం భక్తి సంయుతః!

శారదా సౌమ్య మాప్నోతి గృహేస్థిత్వాజ్ఞ సంభవం!!



Show Full Article
Print Article
More On
Next Story
More Stories