పసుపు రైతులను దెబ్బతీసిన కరోనా వైరస్.. ఆందోళనలో పసుపు రైతులు !

పసుపు రైతులను దెబ్బతీసిన కరోనా వైరస్.. ఆందోళనలో పసుపు రైతులు !
x
పసుపు రైతులను దెబ్బతీసిన కరోనా వైరస్.. ఆందోళనలో పసుపు రైతులు !
Highlights

పసుపు రైతుల ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లుతోంది. కరోనా వైరస్ ప్రభావం పసుపు ఎగుమతుల పడింది. ఫలితంగా డిమాండ్ తగ్గి పసుపు ధరలు రోజురోజుకు పతనం...

పసుపు రైతుల ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లుతోంది. కరోనా వైరస్ ప్రభావం పసుపు ఎగుమతుల పడింది. ఫలితంగా డిమాండ్ తగ్గి పసుపు ధరలు రోజురోజుకు పతనం అవుతున్నాయి. అసలే ధరల్లేక పీకల్లోతు కష్టాల్లో ఉన్న పసుపు రైతులకు కరోనా వైరస్ ఎఫెక్ట్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా సాకుతో వ్యాపారులు కూటమి కట్టి ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపణలు చేస్తుండగా ఎగుమతులు తగ్గడం, పాత నిల్వలు పేరుకుపోవడం వల్లే ధరలు పడిపోయాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

పసుపు ఇందూరు రైతుల లక్ష్మిపంట. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 40వేల ఎకరాలలో ఈ పంట సాగవుతోంది. పెట్టుబడి వ్యయం రెండింతలు పెరిగినా 9నెలల పాటు పంటను కంటికి రెప్పలా కాపాడుకుని ఇప్పుడిప్పుడే అమ్మకానికి మార్కెట్ తరలిస్తున్నారు రైతులు. పసుపు సీజన్ ప్రారంభం కాగా కర్షకులకు లభించే ధర పూర్తిగా పతనం అవుతోంది. ఎకరాకు లక్ష నుంచి లక్షా 20వేల ఖర్చు చేస్తున్నా దిగుబడులు లేక నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్ లో క్వింటాల్ పసుపు ధర 4 వేల నుంచి 5వేల వరకు పలుకుతోంది. అసలే ధరల్లేక దిగాలు చెందుతున్న పసుపు రైతన్నలకు ప్రాణాంతకమైన కరోనా రూపంలో మరో ప్రమాదం వచ్చి పడింది. నిజామాబాద్ పసుపును వ్యాపారులు అత్యధికంగా ఇరాన్ దేశానికి ఎగుమతి చేస్తాది. ఇరాన్ తో పాటు ఐరోపా చైనాకు పసుపును ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు పసుపు ఎగుమతి నిలిచిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటు ఇరాన్ లో పరిస్దితులు బాగాలేకపోడంతో అక్కడికి సైతం ఎగుమతులు లేవని చెబుతున్నారు. కరోసా సాకుతో పసుపు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

నిజామాబాద్ మార్కెట్ పసుపు క్రయవిక్రయాలకు ప్రసిద్ది చెందింది. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్ తరవాత ఆ స్దాయిలో కొనుగోళ్లు -అమ్మకాలు నిజామాబాద్ మార్కెట్ యార్డులో జరుగుతాయి. సీజన్ ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా రైతులకు మాత్రం ధరల షాక్ తగులుతూనే ఉంది. రోజురోజుకు ధరలు పతనమై అన్నదాత కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 50వేల క్వింటాళ్ల పసుపు మార్కెట్ కు వచ్చింది. ఈనెల 25 నుంచి పసుపు రాక మరింత పెరగనుంది. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీల్లో సుమారు 3లక్షల క్వింటాళ్ల పసుపు నిల్వలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, వ్యాపారులు కరోనా సాకుతో రైతులను నిలుపుదోపిడి చేస్తున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు పసుపు ధర గత ఏడాదితో పొలిస్తే క్వింటాకు వేయి నుంచి 2వేలు తగ్గిపోయింది. ప్రస్తుతం క్వింటాకు 4వేల నుంచి 5వేలకు మించి ధర పలకడం లేదు. ధరల పతనానికి ఎగుమతులు తగ్గిపోవడం, పాత నిల్వలు పేరుకుపోవడం కారణంగా చెబుతున్నారు వ్యాపారులు. విదేశాలకు పసుపు పంట ఎగుమతి తగ్గిందని కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు ఎగుమతులు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులపై కరోనా ప్రభావం ఉందని అటు అధికారులు ఒప్పుకుంటున్నారు. అసలే ధరల్లేక ఇబ్బందుల్లో ఉన్న పసుపు రైతులను ఈ కరోనా వైరస్ మరింత దెబ్బతీసింది. విదేశాలకు పసుపు ఎగుమతులు తగ్గిపోవడంతోపాటు ధరలు మరింత దిగజారిపోయాయి. దీంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories