ఏజెన్సీలో ముదురుతోన్న కానిస్టేబుళ్ల నియామకం వివాదం..విడుదలైన మెరిట్ లిస్ట్‌ను..

ఏజెన్సీలో ముదురుతోన్న కానిస్టేబుళ్ల నియామకం వివాదం..విడుదలైన మెరిట్ లిస్ట్‌ను..
x
Highlights

ఏజెన్సీలో కానిస్టేబుల్ నియామకం వివాదం ముదురుతోంది. తమకు ఉద్యోగాలు దక్కకుండా కానిస్టేబుల్ నియామకాలు జరుగుతున్నాయని గిరిజన యువకులు ఆందోళన వ్యక్తం...

ఏజెన్సీలో కానిస్టేబుల్ నియామకం వివాదం ముదురుతోంది. తమకు ఉద్యోగాలు దక్కకుండా కానిస్టేబుల్ నియామకాలు జరుగుతున్నాయని గిరిజన యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మెరిట్ లిస్ట్‌ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీలో ముదురుతున్న నాన్ లోకల్ కోటా వివాదంపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలపై వివాదం తీవ్రమైంది. అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌పై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో లోకల్ నిబంధనలు పట్టించుకోకుండా పోలీస్ ఉన్నతాధికారులు అభ్యర్థుల మెరిట్ లిస్ట్ విడుదల చేయడంపై గిరిజన యువకులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విడుదలైన జాబితాలో ఏజెన్సీయేతరు అధికంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల రాత పరీక్షలో మంచి మార్కులు సాధించినా ఉద్యోగాలు దక్కడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఏజెన్సీలో పోలీస్ ఉద్యోగాల నియామకానికి 1984లో అప్పటి ప్రభుత్వం 109 జీవోను జారీ చేసింది. దీని ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు 75శాతం, మైదాన ప్రాంతంలో ఉండే వారికి 25శాతం నియామకాలు జరగాల్సి ఉంది. దీంతో అప్పటి నుంచి పోలీసు ఉద్యోగాల నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను పోలీసు అధికారులు అమలు చేశారు. తాజాగా విడుదలైన మెరిట్ లిస్ట్‌ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందంటున్నారు. 75 శాతానికి బదులు 40 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారని ఆదివాసీ నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

109 జీవో ప్రకారం తాజాగా విడుదలైన అభ్యర్థుల జాబితాలో గిరిజనులకు 136 ఉద్యోగాలు దక్కాల్సి ఉండగా 36 మాత్రమే దక్కుతున్నాయని గిరిజన యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు అత్యుత్సాహం వల్లే ఇలాంటి తప్పిదాలు జరిగాయని, వెంటనే 109 జీవో ప్రకారం నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీనిపై ఎంపీ సోయం బాపూరావు ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ విషయంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను ఏజెన్సీ ప్రాంతంలో రద్దు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. లేకుంటే తాము కోర్టు వెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు. మరి ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories