పర్యాటకులను కనువిందు చేసేందుకు సిద్ధమయిన టైగర్‌ రిజర్వ్ ఫారెస్ట్‌

Tiger Reserve Forest ready to entertain tourists
x

Representational Image

Highlights

ప్రకృతి పేమికులను, పర్యాటకులను కనువిందు చేసేందుకు కవ్వాల్ టైగర్‌ రిజర్వ్ ఫారెస్ట్‌ సిద్ధమయ్యింది. కొవిడ్ కారణంగా నిలిచిపోయి... దాదాపు ఏడాది తర్వాత...

ప్రకృతి పేమికులను, పర్యాటకులను కనువిందు చేసేందుకు కవ్వాల్ టైగర్‌ రిజర్వ్ ఫారెస్ట్‌ సిద్ధమయ్యింది. కొవిడ్ కారణంగా నిలిచిపోయి... దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ప్రారంభంకానుంది. కరోనా తర్వాత మళ్లీ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. కొత్తగా మరిన్ని టూరిజం స్పాట్లను ఏర్పాటు చేస్తున్నారు. అదనపు హంగులతో పర్యాటకులను మైమరిపించే విధంగా కొత్తదనంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

గుట్టల మీదుగా జాలువారే సెలయేళ్లు... పిల్ల కాలువల ప్రవాహాలు, వంకలు తిరిగి పారే వాగులు. చెంగు చెంగున దూకే లేడి పిల్లలు. మచ్చల జింకలు, భయపెట్టించే పులులు, చిరుతలు, .. వృక్షాలు... ఇలా ప్రకృతి అందాలన్నీ ఒకేచోట చూసి ఆస్వాదించాలనుకుంటున్నారా..? ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నారా అయితే చలో జంగల్ సఫారీ.

మంచిర్యాల జిల్లా పరిధిలోని కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్ లో జంగల్ సఫారీకి అటవీశాఖ, పర్యాటకశాఖ సిద్ధం చేస్తున్నాయి. పర్యాటకశాఖ సహకారంతో అటవీశాఖ అధికారులు త్వరలో సఫారీ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇది దేశంలోనే జంగల్ సఫారీ ఉన్న రెండో ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల నాలుగు జిల్లాల పరిధిలోకి వచ్చే అడవులను కలుపుతూ 1,120 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 893 చదరపు కిలోమీటర్ల మేర బఫర్ జోన్ విస్తరించి ఉంది. కొండలు, టేకు, వెదురు, అడవులు, నదులు, పిల్ల కాలువల ప్రవాహాలతో కవ్వాల్ ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తోంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పై ప్రత్యేకంగా చొరవచూపి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి మాధవరావు. టూరిజంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందన్నారు.

పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందాలంటే శ్రద్ద పెట్టాలంటున్నారు స్థానిక ఉపాధ్యాయుడు సుధాకర్‌. కరోనా నేపథ్యంలో పర్యాటకుల తాకిడి తగ్గిందని... టూరిజాన్ని డెవలప్‌ చేయాలని కోరుకుంటున్నాన్నారు.

ఇక కవ్వాల్ ను సందర్శించాలనుకునే పర్యాటకులు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. మంచిర్యాల, జన్నారం మార్గంలో రిజర్వ్ ఫారెస్ట్ కు చేరుకోవడానికి వరంగల్ లేదా హైదరాబాద్ నుంచి రైలు ద్వారా మంచిర్యాల వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లవచ్చు. రోడ్డు మార్గంలో వచ్చే వారు హైదరాబాద్ నుంచి నిర్మల్ చేరుకోవాలి. అక్కడి నుంచి నిర్మల్, మంచిర్యాల రోడ్డు మార్గం గుండా ఇక్కడికి చేరుకోవచ్చు. జన్నారం నుంచి ఆదిలాబాద్ వరకు దారి పొడువునా ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు.

ఇక వన్యప్రాణులను చూసేందుకు పర్యాటక శాఖ ప్రత్యేకంగా దొంగపల్లి, అల్లినగర్ సమీపంలో రెండు వాచ్ టవర్లను నిర్మించింది. వీటి పైకి ఎక్కి అభయారణ్య అందాలు, వన్య ప్రాణులను చూడొచ్చు. జన్నారం శివారులో ఉన్న జింకల పునరావాసకేంద్రంలో జింకలు,దుప్పులు కనువిందు చేస్తాయి. సహజత్వం ఉట్టిపడేలా నిలిపిన ఫైబర్ బొమ్మలు మనసును దోచేస్తాయి. ఈయాత్రలో ట్యాంకులు, బర్డింగ్ స్పాట్లు ఉంటాయి. దాదాపు 30 కిలోమీటర్ల ప్రయాణం వినోదాత్మకంగా సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories