కూలీలుగా మారిన ఎంబీఏలు, ఇంజనీర్లు

కూలీలుగా మారిన ఎంబీఏలు, ఇంజనీర్లు
x
Highlights

నిన్నటిదాకా ఏసీల్లో ఉన్నోళ్లు.. ఇప్పుడు మండుటెండలో మట్టి మోస్తున్నారు. గడ్డపార చేతబట్టి తట్టమోస్తున్నారు చెమటలు కక్కుతున్నారు. ఏ ఊళ్లలో చూసిన ఇప్పుడు...

నిన్నటిదాకా ఏసీల్లో ఉన్నోళ్లు.. ఇప్పుడు మండుటెండలో మట్టి మోస్తున్నారు. గడ్డపార చేతబట్టి తట్టమోస్తున్నారు చెమటలు కక్కుతున్నారు. ఏ ఊళ్లలో చూసిన ఇప్పుడు ఇదే సీన్ కనిపిస్తోంది. జాబ్ పోగొట్టుకున్నవాళ్లు పని కోల్పోయినోళ్లు కంపెనీలు సెలవులిచ్చినోళ్లు జాబ్‌ సెర్చ్ చేస్తున్నోళ్లు.. కాంపిటేటివ్ ఎగ్జామ్స్​కు ప్రిపేర్ అవుతున్నోళ్లు ఇట్లా అందరూ ఆ పని కోసమే క్యూ కడుతున్నారు. జాబ్ కార్డు తీసుకుని పనికి పోతున్నారు. కరువు సమయంలో ఆసరాగా మారిన ఆ పనేంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

కూలీలుగా మారిన ఎంబీఏలు, ఇంజనీర్లు. కష్టకాలంలో అండగా నిలిచిన కరువు పని. ఉపాధికూలీలుగా మారిన ప్రైవేట్‌ ఉద్యోగులు, విద్యార్ధులు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏ గ్రామంలో చూసిన ఇదే సీన్‌ కనిపిస్తోంది. కరోనా వేళ కరువు పని కోసం ప్రైవేట్‌ఉద్యోగులు పోటీపడుతున్నారు. పనులు, లేక అద్దెలు కట్టలేక సొంతూళ్లకు చేరిన వారు ఉపాధికూలీలుగా మారారు. సీటిల్లో నెలకు 30 వేలు సంపాదించే ఉద్యోగులు సైతం 200 రూపాయాల కోసం గడ్డపార పట్టి తట్టమోస్తున్నారు. చిరు ఉద్యోగులతో పాటు పీజీలు, డిగ్రీలు, బీటెక్‌, ఎంబీఎలు చేసిన వారు సైతం కుటుంబం కోసం మండేఎండల్లో కష్టపడుతున్నారు.

కుటుంబపోషణ కోసం ఉపాధి కూలీలుగా మారామంటున్నారు విద్యార్ధులు, చిరుఉద్యోగులు. లాక్‌డౌన్‌ వల్ల పలు కంపెనీలు, పరిశ్రమలు మూతపడటంతో ఉపాధి కోల్పోయామని అందుకే కూలీలుగా మారామంటున్నారు. మళ్లీ మా కంపెనీ స్టార్ట్ అయ్యే వరకు ఈ పనే చేస్తామంటున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో రికార్డ్‌స్థాయిలో ఉపాధి కూలీల సంఖ్య పెరిగిందంటున్నారు సిద్ధిపేట ఆర్టీఏపీడి గోపాల్‌రావు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో కూలీల సంఖ్య పెరిగిందంటున్నారు. సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలో గత ఏడాదితో ఇదే సమయంలో 49 వేల మంది కూలీలు పనులకు హాజరైతే ఇప్పుడు లక్షన్నరకు పైగా హాజరవుతున్నారు.

కరోనా తమ కొంపముంచిందని ఆవేదన పడ్డ యువకులు అమ్మానాన్నలకు భారంగా ఉండడం ఇష్టం లేక జాబ్‌కార్డులు తీసుకుని ఉపాధి పనికి పోతున్నామంటున్నారు. చేసేందుకు మరోపని కూడా లేకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో ఈ పనికి వస్తున్నామంటున్నారు. మరోవైపు ఉపాధికూలీల సంఖ్య పెరిగినా అధికారులు సరైన సౌకర్యాలు ఏర్పాటుచేయడం లేదంటున్నారు కూలీలు. తాగేందుకు కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని ఆవేదన చెందుతున్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories