కరోనా నేపథ్యంలో నిలిచిన భక్తుల దర్శనాలు

కరోనా నేపథ్యంలో నిలిచిన భక్తుల దర్శనాలు
x
Highlights

కరోనా కష్టాలు.. దేవుళ్లనూ వదలడం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడ్డ ఆలయాలకు కనీస ఆదాయం కూడా కరువైంది.

కరోనా కష్టాలు.. దేవుళ్లనూ వదలడం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడ్డ ఆలయాలకు కనీస ఆదాయం కూడా కరువైంది. భక్తుల దర్శనాలు నిలిపేయడంతో.. హుండీలు నిండే అవకాశమే లేకుండా పోయింది. అర్చకులు, ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పూజలు, అర్చనలు, హరతులు.. ఆలయం అంటేనే అదో కళ. కానీ కరోనా కారణంగా.. దేవాలయాల్లో అవన్నీ కనిపించకుండా పోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా భక్తుల సందడి లేకపోవడంతో.. ఆలయం లోపలే పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాల ఆదాయాలపై తీవ్ర ప్రభావం పడింది.

ఇప్పటికే అరకోర ఆదాయంతో అభివృద్ధికి నోచుకోని భద్రాద్రి ఆలయం.. కరోనా కారణంగా తీవ్రనష్టాలను చవిచూసింది. గత ఆర్థిక సంవత్సరంలో 40 కోట్ల 30 లక్షలు ఆదాయం రాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా ఆరున్నర కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది. ఈ యేడు 33 కోట్ల 89 లక్షలు మాత్రమే సమకూరింది. దీంతో అర్చకులు, ఉద్యోగులకు జీతాలు చెల్లింపులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదని ఆలయ ఈవో చెబుతున్నారు.

దేవస్థానం చరిత్రలోనే తొలిసారిగా శ్రీరామనవమి ఉత్సవాలు.. భక్తులు లేకుండానే నిర్వహించాల్సి వచ్చింది. బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో.. లాక్‌డౌన్‌ విధించారు. ఆలయాన్ని మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రాక పూర్తిగా నిలిచిపోయింది. సీతారాముల కళ్యాణం కూడా ఆలయంలోపల ప్రాకారం మండపంలో నిర్వహించాల్సి వచ్చింది. దీంతో పైసా ఆదాయం లేకపోవడంతో.. ఆర్థిక కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా కథ అలా ఉంటే.. గతేడాది సెప్టెంబర్‌లో పాపికొండల సమీపంలో లాంచీ మునిగిపోవడం.. ఆ తర్వాత ప్రభుత్వం పడవ ప్రయాణాలను నిలిపేయడంతో.. భద్రాద్రికి భక్తులు రావడం తగ్గిపోయింది. అప్పటి నుంచే భద్రాద్రి ఆదాయం క్రమంగా తగ్గిపోవడంతో పాటు.. కరోనా వల్ల దానికి మరింత గండిపడింది.

ఇటు నవమి వేడుకల సమయంలో వ్యాపారం కూడా భారీగానే జరిగేది. అయితే లాక్‌డౌన్‌.. వ్యాపారులకు తీరని నష్టాలను మిగిల్చింది. ఏటా సీజన్‌లో లక్షల్లో వ్యాపారం జరిగదేని.. ప్రస్తుత పరిస్థితుల్లో షాపులు కూడా ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలే అభివృద్ధికి నోచుకోని భద్రాద్రి ఆలయం.. కరోనా మహమ్మారి కారణంగా మరో ఏడాది పాటు ఆర్థిక కష్టాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు.. ఆలయ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భక్తులకు దర్శనాలకు అనుమతి లేదని.. ప్రభుత్వం అనుమతిస్తే.. లాక్‌డౌన్‌ నియంత్రణ చర్యలు పాటిస్తూ అనుమతిస్తామని.. వివరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories