సీఎంల మీట్ పై ఉత్కంఠ

సీఎంల మీట్ పై ఉత్కంఠ
x
Highlights

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. సోమవారం కేసీఆర్, జగన్ ప్రగతి భవన్ లో సమావేశమవుతున్నారు. విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. సోమవారం కేసీఆర్, జగన్ ప్రగతి భవన్ లో సమావేశమవుతున్నారు. విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అధికారులు లేకుండా కేవలం ముఖ్యమంత్రుల సమావేశం మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. NRCతో పాటు మూడు రాజధానుల అంశం వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మూడున్నర నెలల గ్యాప్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ కాబోతున్నారు. జగన్ మూడుసార్లు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపైనే ప్రధానంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి కలిసి నడువాలని నిర్ణయించారు. కేంద్రానికి సంబంధించిన అంశాలపై ఉమ్మడిగా వెళ్లాలని నిర్ణయించారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధాన ఉమ్మడిగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో గోదావరిలో ఏదో ఒక చోట నుండి నీటిని కృష్ణా నదికి తరలించాలని భావించారు. దీనిపై పై అధ్యయనం చేయాలని రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

పోలవరం నుండి శ్రీశైలంకు నీటిని తరలించాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. లేదంటే దేవాదుల తుపాకులగూడెం లలో ఏదో ఒక చోట నుండి శ్రీశైలం కు నీటిని తరలించాలని భావించారు. దీనికి అయ్యే ఖర్చును రెండు రాష్ట్రాలు భరించాలని నిర్ణయించారు. కానీ దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ ప్రాంతంలో బ్యారేజి నుండి నీళ్లు తరలించడం అసాధ్యమని ఏపీలో విమర్శలు వెల్లువెత్తాయి. ఎగువ భాగంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కడితే ఏపీకి ఎలా ఉపయోగం అని ప్రశ్నలు తలెత్తాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయాలపై వైసీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీని స్థానంలో పోలవరం నుండి బనకచర్ల కు నీటిని తరలించేందుకు సొంతంగా ప్రణాళికలు చేపట్టాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కుల కు పెంచుతామని జగన్ ప్రకటించారు. ఇవన్నీ రెండు రాష్ట్రాల మధ్య కాస్త దూరం పెంచాయి. కేంద్రంతో సంబంధాలపై ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. పార్లమెంట్లో సీఏఏ చట్టానికి వైసీపీ మద్దతు తెలపగా టిఆర్ఎస్ వ్యతిరేకించింది. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ధర్మాధికారి నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. కానీ దీన్ని ఏపీ అంగీకరించడం లేదు. తెలంగాణ నుండి రిలీవ్ అయిన 613 మంది ఉద్యోగులను ఏపీ చేర్చుకోవడం లేదు. ఆర్టీసీ సమ్మె సమయంలోనూ ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు ఇబ్బంది కలిగించాయి.

అకస్మాత్తుగా జగన్, కేసీఆర్ ల సమావేశం ఎందుకోసం. ఎజెండా ఏంటనేది రెండు వర్గాలు బయటకు రానివ్వడం లేదు. అయితే కేటీఆర్ తిరుమల పర్యటన తర్వాతే ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కెసిఆర్ ఆదేశాల మేరకు తిరుమల వెళ్ళిన కేటీఆర్ జగన్ కు సన్నిహితుడైన మిథున్ రెడ్డి తో సమావేశమయ్యారని అంటున్నారు. అందులో జగన్ కేసీఆర్ సమావేశం కావాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏం చర్చించనున్నారని తెలియనీయడం లేదు. జగన్, కేసీఆర్ భేటీలో అధికారులు లేకుండానే సమావేశమవుతారని తెలిసింది. దీంతో ఈ సమావేశంలో రాజకీయ అంశాలకే ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఏపీలో మూడు రాజధానుల అంశం ప్రస్తావనకు రావచ్చని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories