ఆర్టీసీ ఉద్యోగులకు సగం జీతమే..

ఆర్టీసీ ఉద్యోగులకు సగం జీతమే..
x
TSRTC
Highlights

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో రెండు మూడు వారాలుగా ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ఆదాయం అంతా ఆగిపోయింది. కాగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థ లాక్ డౌన్ కారణంగా మరింత నష్ట పోయింది. ఫలితంగా ఉద్యోగులకు జీతాల చెల్లింపు కష్టతరమైపోతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఉద్యోగులకు మార్చి నెల జీతం సగమే అందనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం బడ్జెట్ సరిపడా లేనందున ఈ నెల సగం జీతమే చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది.

మార్చి నెలలో మొదటి రెండు వారాలు బస్సులు నడవడంతో అప్పటి టికెట్‌ వసూళ్లలో కొంత మొత్తం అందుబాటులో ఉన్నందున వాటినే ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వనున్నారని ప్రకటించింది. కాగా ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి వేతనం కట్టి ఇవ్వాలని కార్మిక సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే మిగిలిన సగం వేతనం చెల్లించేందుకు అధికారులు నానా పాట్లు పడుతున్నారు. వాటిని సమకూర్చేందుకు అధికారులు తిప్పలు పడుతున్నారు.

ఏదో ఒక రూపంగా జీతాలు సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం ఆర్టీసీ సంస్థకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని వైద్య సిబ్బంది, పోలీసు శాఖలు మినహా మిగతా అన్ని శాఖల ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక పోతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, రాష్ర్ట మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు.

ఇక ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత ఉంటుంది. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు. ఇక అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత ఉంటుంది. నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత ఉండగా,మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories