తెలంగాణలో విష జ్వరాల పంజా .... తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు

తెలంగాణలో  విష జ్వరాల పంజా .... తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు
x
Highlights

సీజన్‌ వచ్చేసింది. డేంజర్‌ బేల్స్‌ మోగుతున్నాయి. కదల్లేని నిస్సత్తువ. కీళ్ల నొప్పులు...దండయాత్ర చేస్తున్న వైరల్‌ ఫీవర్స్‌తో అల్లాడుతున్నారు...

సీజన్‌ వచ్చేసింది. డేంజర్‌ బేల్స్‌ మోగుతున్నాయి. కదల్లేని నిస్సత్తువ. కీళ్ల నొప్పులు...దండయాత్ర చేస్తున్న వైరల్‌ ఫీవర్స్‌తో అల్లాడుతున్నారు తెలంగాణప్రజలు. పల్లె నుంచి పట్నం దాకా వాడవాడలా విజృంభిస్తున్నాయి. అదన్నారు.... ఇదన్నారు. ఏమన్నా.. ఎంతన్నా.. సీన్‌ మాత్రం ఇసుమంతైనా మారలేదు. రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. తెలంగాణలో విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. పల్లె నుంచి పట్నం దాకా వాడవాడలా దడపుట్టిస్తున్నాయి. వైరల్ ఫీవర్ తో జనం గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులన్న తేడా లేకుండా ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. రెండున్నర వారాల నుంచి ఇవే మాటలు వినిపిస్తున్న పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

ఇప్పటి వరకు ఫీవర్‌ ఆస్పత్రుల్లో రోజుకు వందల సంఖ్యల్లో కేసులు నమోదవడం అందోళనకు గురిచేస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా జలుబు, దగ్గు, కీళ్లనొప్పులు, హై ఫీవర్‌తో అల్లాడుతున్నారు. గ్రామాలు, బస్తీలు, మురికి వాడల్లో డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యస్థంగా మారడంతో... ఎక్కడికక్కడే మురుగునీరు నిలిచిపోవడంతో దోమలకు ఆవాలుగా మారాయి. దీంతో ప్రభుత్వం, ప్రైవేట్‌ ఆస్పత్రులు వైరల్‌ఫీవర్స్‌ రోగులతో కిటకిటలాడుతున్నాయి.ఫీవర్‌ కేసులు రికార్డ్‌ స్థాయిలో నమోదు అవుతుండటంతో మంత్రులు సమీక్షలు నిర్వహించారు.... ఆస్పత్రులను విజిట్‌ చేశారు. సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కానీ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.

మరోవైపు ఇదే ఛాన్స్‌ అనుకుని ప్రైవేటు ఆస్పత్రులు రోగుల మీద పడి దోచుకుంటున్నారు. ఏ చిన్న జ్వరం వచ్చినా.. అది డెంగ్యూ కావొచ్చంటూ ఖరీదైన పరీక్షలు చేశామంటూ క్యాష్‌ చేసుకుంటున్నారు. ప్లేట్‌లెట్స్‌ తక్కువయ్యాయని.. రోజుల తరబడి ఆస్పత్రుల్లోనే ఇన్‌ పెషెంట్‌గా ఉంచుకుంటామని భయపెడుతున్నారు. కేవలం పరీక్షలకే పర్స్‌ ఖాళీ అవ్వడంతో చాలామంది పెషెంట్లు గత్యంతరం లేక ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడుతున్నారు.

ఇక ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. సరిపడా బెడ్స్‌ లేక.. ఒకే మంచంపై ఒకరికి మించి చికిత్స చేయడం కామన్‌ అయిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరగంల్, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో ఇలా ఓ జిల్లాలో చూసిన ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సరిపడ్డ వైద్యులు లేక మందులు లేక నరకం అనుభవిస్తున్నారు. ఇంకోవైపు చాపకిందనీరులా సీజనల్‌ వ్యాధులు దాడి చేయడంతో ఆయా జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రుల్లో 24 గంటల పాటు ఓపీ తెరిచి ఉంచారు. పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. నెలలోపు అదుపుచేస్తామని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇటు ఐటీ మంత్రి కేటీఆర్‌ సైతం.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటికైనా వైద్యశాఖ నిద్రమత్తు వీడి వ్యాధుల పట్ల ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాలని.. వైరల్ ఫీవర్స్ ను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఙప్తి చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories