Top
logo

ముగిసిన Telangana Municipal Elections.. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతం

ముగిసిన Telangana Municipal Elections.. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతం
Highlights

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు...

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల్లోగా క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం అవకాశం కల్పించారు. మొత్తం 120 మున్సిపాల్టీలతో పాటు 9 కార్పొరేషన్‌ లో ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్‌ 67.45 శాతం నమోదైంది. ఓట్లు లెక్కింపు ఈ శనివారం జరగనుంది.

ఇటు ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం పోలింగ్‌ ప్రారంభం సమయంలో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు జరగ్గా తర్వాత పలు జిల్లాల్లో ప్రధాన పార్టీల నేతలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరికొన్నిచోట్ల దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులను స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేశారు. హైదరాబాద్‌ పెద్ద అంబర్‌పేట్‌లో ఓటర్ల జాబితాలో తన పేరు లేకున్నా ఓటేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు చితక్కొట్టారు. టీఆర్ఎస్ నాయకుడు నాగార్జున తరపున ఓటేసేందుకు వచ్చినట్లు తెలిపాడు.

మరోవైపు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్‌ ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇలాయస్ కోపంతో ఇమ్రాన్‌ ముక్కును కొరకడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధి 3వ వార్డులోని కళానగర్ లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గద్వాల మున్సిపాలిటీ 15వ వార్డులోని పోలింగ్ బూత్ లో కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో 3 వార్డులోని పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ - ఆలిండియా ఫార్వాడ్ బ్లాక్ అభ్యర్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఘర్షణలు ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది.

తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించి ఎన్నికల్లో సత్తా చాటేందుకు కడదాక ప్రయత్నాలు చేశాయి. ఇక అభ్యర్థుల భవిష్యత్తు ఈ శనివారం తెలియనుంది.

Web TitleTelangana municipal elections polling end

లైవ్ టీవి


Share it
Top