పీహెచ్‌సీల్లో సరిపడా మందులుండాలి..మంత్రి ఈటల రాజేందర్

పీహెచ్‌సీల్లో సరిపడా మందులుండాలి..మంత్రి ఈటల రాజేందర్
x
Etela Rajender (File Photo)
Highlights

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వైద్య సిబ్బంది, ప్రభుత్వ ప్రైవేట్‌ ఆసుపత్రులు, ప్రజలు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వైద్య సిబ్బంది, ప్రభుత్వ ప్రైవేట్‌ ఆసుపత్రులు, ప్రజలు తీసు కోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సోకి కోలుకున్న వారికి, అలాగే కరోనా సోకిన వారికి ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క ప్రయివేటు, ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సదుపాయం ఖచ్చితంగా ఉండేలా చూడాలని ఆస్పత్రి వర్గాలను ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని, ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మందులు అందుబాటులో ఉన్నాయా లేవా అన్న విషయాలపై ఆరా తీసారు.

తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలకు లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో చాలా మంది ప్రజలు పనుల నిమిత్తం బయటికి వస్తున్నారని, ఈ సమయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎవరికైనా దగ్గు, జ్వరం లక్షణాలుంటే వెంటనే వారు వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇంట్లో ఉండే వృద్దులు, చిన్న పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బయటకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పని సరి భౌతికదూరం పాటించాలని, మాస్క్‌ ధరించాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు.

మంత్రి ఈటెల గతంలో చెప్పినట్టుగానే బయటి నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని అన్ని ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలందేలా ఏర్పాట్లు చూడాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. గ్రామాల్లో జ్వర పరీక్షలపై మంత్రి ఆరా తీశారు. కరోనా లక్షణాలున్న వారిని, నాన్‌ కరోనా రోగులను విడివిడిగా చూడాలని కోరారు.ఇతర దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలు, ఇతరులు అలాగే కరోనా కట్టడికి ముందుండి పనిచేస్తున్న వైద్య, మున్సిపల్, పోలీసు సిబ్బందికి వ్యాధి లక్షణాలుంటే పరీక్షలు చేయించా లని ఐసీఎంఆర్‌ మార్గనిర్దేశకాలు విడుదల చేసిందని తెలిపారు.

గాంధీ ఆసుపత్రిలో రోగుల చికిత్సపై కూడా మంత్రి సమీక్షించారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావుతో ఫోన్‌లో మాట్లాడారు. ఇక పోతే తెలంగాణలో మొన్న ఒక్కరోజే 42 కేసులు నమోదు కాగా, నిన్న కూడా 42 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 34 కేసులు GHMC పరిధిలోనివి. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1634కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 585 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి 1011 మంది డిశ్చార్జ్ అయ్యారు. అందులో ఇవాళ ఒక్కరోజే 9 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనాతో పోరాడి ఇప్పటివరకు 38 మంది చనిపోయారు. అటు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మే31 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories