Etela Rajender Warns Private Labs: ప్రైవేట్‌ ల్యాబ్‌లకు మంత్రి ఈటల హెచ్చరిక

Etela Rajender Warns Private Labs: ప్రైవేట్‌ ల్యాబ్‌లకు మంత్రి ఈటల హెచ్చరిక
x
Etela Rajender (File Photo)
Highlights

Etela Rajender: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే పరీక్షలు చేయలేని పరిస్థితి నెలకొంది.

Etela Rajender: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే పరీక్షలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం ప్రయివేట్ ల్యాబ్‌ల్లో కరోనా టెస్టులు చేయించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ల్యాబ్‌ల్లో మాత్రమే కరోనా టెస్టులు చేసుకోవచ్చని తెలిపింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 17 ప్రయివేట్ ల్యాబ్‌లు కరోనా టెస్టులు చేయడానికి అనుమతి పొందాయి. ఇక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రయివేటు ల్యాబులన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందేనని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు.

కరోనా నిర్ధారిత పరీక్షలు చేస్తున్న ప్రభుత్వం ల్యాబ్‌లలో ఏవిధంగా ఐతే నిరంతర పరిశీలన జరుతుందో అదే విధంగా ప్రైవేట్‌ ల్యాబ్‌లలో కూడా నిరంతరం పరీక్షలపైనా పరిశీలన కొనసాగుతుందని చెప్పారు. శనివారం బీఆర్కే భవన్‌లో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ కొన్ని ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో మోసం జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా నియంత్రణ, టిమ్స్‌లో వసతులు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీరు మార్చుకోని ల్యాబ్‌లపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కొన్ని ల్యాబ్‌ల్లో 70% పాజిటివ్‌ రావడంపై విస్మయం వ్యక్తంచేశారు.

కొన్ని ప్రైవేట్‌ ల్యాబ్‌లు లాభాపేక్ష కోసం దురాశతో తప్పుడు ఫలితాలు విడుదలచేస్తుండటంపై ఆయన మండిపడ్డారు. తప్పుడు సమాచారం అందిస్తున్న ల్యాబ్‌లకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వ ల్యాబ్‌ల సామర్థ్యాన్ని రోజుకు 6,600 పరీక్షలకు పెంచేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రయివేటు ల్యాబ్ లు ఇస్తున్న తప్పుడు సమాచారాలను నిర్ధారించడానికి నియమించిన నిపుణుల కమిటీ పరీక్షా విధానంలో లోపాలు, ఇతర అంశాలను పరిశీలించి రెండుమూడు రోజుల్లో నివేదిక అందజేస్తుందని తెలిపారు. ఇక ప్రస్తుతం వానాకాలం మొదలు కావడంతో చాలా మంది ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం బారిన పడడం సాధారణమేని మంత్రి తెలిపారు. అందరినీ వణికిస్తున్న కరోనా లక్షణాలు ఇవే కావడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రతి గ్రామంలోనూ అధికారులు ఇంటింటికి వెల్లి సర్వేచేసి బాధితులను గుర్తిస్తున్నామన్నారు.

ఇక కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన సరికొత్త ఆస్పత్రి హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆ ఆస్పత్రిలో బాధితులకు వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తయిందని మంత్రి ఈటల పేర్కొన్నారు. ఇప్పటికే 499 పోస్టులకుగానూ మొత్తం 13 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిని వడబోసి 499 మందిని ఎంపికచేశామని చెప్పారు. వీరంతా సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిపుణుల కమిటీ సభ్యులు కరుణాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేశ్‌రెడ్డి, కరోనా నోడల్‌ ఆఫీసర్‌ శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories