KCR Govt. Fight Against Covid19: మా నిబద్ధతను శంకించొద్దు

KCR Govt. Fight Against Covid19: మా నిబద్ధతను శంకించొద్దు
x
Highlights

KCR Govt. Fight Against Covid19: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు.

KCR Govt. Fight Against Covid19: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ గురించి తొలినాళ్లలో జనం భయం పడ్డారని, 4 నెలల తర్వాత మన దేశంలో ఎక్కువగా మరణాలు చోటు చేసుకోలేదని మంత్రి అన్నారు. తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించాకే కరోనా వైరస్ కేసులు పెరిగాయని తెలిపారు. ఈ ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని తెలిపారు. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు 5 లక్షలు నమోదైతే వారిలో 3 శాతమే మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక మన రాష్ట్రం విషయానికొస్తే డెత్ రేట్ 1.7 శాతం మాత్రమే ఉంది. ఈ 4 నెలల కాలంలో మన రాష్ట్రంలో 247 మంది చనిపోయారు.

ప్రజలు కరోనా వైరస్ గురించి ఆందోళన చెందినప్పటికీ మరణాల సంఖ్య తక్కువగా ఉందని, ముఖ్యంగా గ్రామాల్లో చాలా తక్కువగా ఉందని అన్నారు. గ్రామాల్లో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేసినందుకు మంచి ఫలితం వచ్చిందని తెలిపారు. ఇతర నగరాల్లో ఏ విధంగానైతే కరోనా కేసులు పెరుగుతున్నాయో అదే రకంగా హైదరాబాద్‌లోనూ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఏయే ప్రాంతాల్లో కేసులు అధికమవుతున్నాయో ఆయా ప్రాంతాలపై శ్రద్ద తీసుకుని టెస్టులను అధికంగా చేయాలని కేసీఆర్ సూచించారన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించాలని తెలిపారు. జీహెచ్ఎంసీ, ఆరోగ్య సిబ్బంది సాయంతో పాత పద్ధతిలో కంటైన్మెట్ జోన్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మంగళవారం నుంచి శాంపిళ్లను సేకరించి ప్రజలకు చికిత్స అందించే ప్రక్రియను కొనసాగిస్తామని మంత్రి అన్నారు.

గవర్నమెంట్ హాస్పిటళ్లలో పట్టించుకోవడం లేదని ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయని, అందులో వాస్తవం లేదని ఆయన అన్నారు. వేరే పేషెంట్ల తరహాలో కరోనా లక్షణాలున్న వారు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి వారికి ఫోన్, ఇంటర్నెట్‌ను అందుబాటులో ఉంచారన్నారు. ఇతర సమస్యల కారణంగా చనిపోయిన వారిని హైలెట్ చేసి ప్రభుత్వ హాస్పిటళ్లలో పని చేసే వారి నైతిక స్థ్యైరాన్ని దెబ్బతీయొద్దన్నారు. వందల సంఖ్యలో ప్రభుత్వ వైద్య సిబ్బందికి, ఉద్యోగులకు కరోనా వచ్చిన నయం అవుతోందని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో, వైద్యం అందించే విషయంలో ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను, కేసీఆర్ అంకితభావాన్ని ఎవరూ ప్రశ్నించలేరన్నారు.

బాధ్యత లేని వ్యక్తులు రాసే రాతలను నమ్మొద్దని తెలిపారు. ప్రభుత్వ కమిట్‌మెంట్‌ను శంకించొద్దు. ఎన్ని వందల కోట్లు ఖర్చయినా చికిత్స అందిస్తామన్నారు. ప్రయివేట్ హాస్పిటళ్లలో 1000 బెడ్లకు మించి కరోనాకు కేటాయించలేరన్నారు. గాంధీ హాస్పిటల్ మినహా మిగతా అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ముందుగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో గాంధీ, చెస్ట్ హాస్పిటల్, కింగ్ కోఠి, టిమ్స్ లాంటి ప్రభుత్వ హాస్పిటళ్లు కోవిడ్ స్పెషాలిటీ హాస్పిటళ్లుగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్ల కంటే ప్రయివేట్ హాస్పిటళ్లలో చికిత్స గొప్పగా అందించేదేం లేదు. మా దగ్గర మందులు, బెడ్లు, ఆక్సిజన్ కొరత లేదు. ప్రయివేట్ హాస్పిటళ్లు బెడ్ల సంఖ్యను పెంచుకోలేవు. చెస్ట్ హాస్పిటల్‌లో మరణించిన వ్యక్తి అనేక హాస్పిటళ్లు తిరిగిన తర్వాత అక్కడికి వచ్చారన్నారు.

మృతి చెందిన వ్యక్తికి వెంటిలేటర్ కంటే ఆక్సిజన్ ముఖ్యమనే ఉద్దేశంతో ఆక్సిజన్ అందించామని ఆయన స్పష్టం చేసారు. అదే చెస్ట్ హాస్పిటల్‌లో హెడ్ నర్స్ చనిపోయింది. ప్రాణాలకు తెగించి కరోనా చికిత్స అందిస్తోన్న వైద్యసిబ్బందిపై ఆరోపణలు గుప్పించడం బాధాకరం. ఏది మంచిదో అదే చేస్తున్నాం అని ఆయన తెలిపారు.

గాంధీ హాస్పిటల్‌లో అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కోవిడ్ లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. డిప్యూటీ సెక్రటరీ అరుణ్ కుమార్ గాంధీలో చికిత్స పొందుతున్నారన్నారు. చాలా మంది నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారని, కాబట్టి వాళ్లు ఫ్యామిలీ డాక్టర్లు ఉన్న కార్పొరేట్ హాస్పిటళ్లలో చేరుతున్నారన్నారు. అలాంటి సమయంలో మేము వారిని గాంధీ ఆసుపత్రిలో వచ్చి చేరమని చెప్పలేం కదా అని ఈటల వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories