'దిశ' నిందితుల మృతదేహాలు అప్పగిస్తారా..?

దిశ నిందితుల మృతదేహాలు అప్పగిస్తారా..?
x
Highlights

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని మహిళా సంఘాలు న్యాయస్థానంలో పిటిషన్‌...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని మహిళా సంఘాలు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాయి. కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో నిందితులను ఎలా ఎన్‌‌కౌంటర్‌ చేస్తారని మహిళా సంఘాలు తప్పుపట్టాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల పోస్టుమార్టం మొత్తం పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. నిందితుల పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌, వీడియో గ్రఫీని హైకోర్టుకు మహబూబ్‌నగర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ సమర్పించింది.

మరో వైపు మృతదేహాలను తమకు అప్పగించాలని నిందితుల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. నలుగురు నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే వ్యవహారంపై కూడా నేడు హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ఆదివారం నిందితుల కుటుంబ సభ్యులను ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం విచారించింది. ఎన్‌కౌంటర్‌పై ఏమైనా అనుమానాలు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. నిందితుల వ్యక్తిగత వివరాలపై కూడా ఆరా తీశారు. కోర్టు గడువు ఇచ్చినా కదా అలాంటప్పుడు ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేశారని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందాన్ని అడిగినట్లు తెలుస్తోంది. తమ బిడ్డలను కనీసం చివరి చూపు కూడా చూపలేదని వారు వాపోయారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ విచారించనుంది. వారిపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఆ రోజు ఏం జరిగింది..? ఎలాంటి పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చింది...? ఎదురుకాల్పులకు దారి తీసిన కారణాలేంటి..? అని వివరాలు సేకరించనుంది. ఇతర పోలీసు ఉన్నతాధికారులను కూడా విచారించే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీకి పోలీసులు సమగ్ర నివేదికను ఇవ్వనున్నారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ నేతృత్వంలో మొత్తం ఏడుగురు సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేసింది. వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ ఎస్‌వోటీ డీసీపీ సురేందర్‌, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌, సంగారెడ్డి డీసీఆర్‌బీ సీఐ వేణుగోపాల్‌రెడ్డి సిట్‌లో సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ బృందం చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌, దిశ అత్యాచారం, హత్యపై ఎంక్వైరీ చేయనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories