సమ్మెకు సై అన్న జేఏసీ నాయకులకు సర్కారు సరికొత్త షాక్‌..సాయంత్రంలోపు..

సమ్మెకు సై అన్న జేఏసీ నాయకులకు సర్కారు సరికొత్త షాక్‌..సాయంత్రంలోపు..
x
Highlights

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సమ్మెకు సై అన్న జేఏసీ నాయకులకు సర్కారు సరికొత్త షాక్‌ ఇచ్చింది. ఈ సాయంత్రం 6 గంటలలోగా డిపోల్లో...

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సమ్మెకు సై అన్న జేఏసీ నాయకులకు సర్కారు సరికొత్త షాక్‌ ఇచ్చింది. ఈ సాయంత్రం 6 గంటలలోగా డిపోల్లో రిపోర్ట్ చేయాలని ఉద్యోగులకు డెడ్‌లైన్‌ విధించింది. లేకపోతే ఉద్యోగాలను స్వచ్ఛందంగా వదిలిపెట్టినవారిగా గుర్తిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఆర్టీసీ కార్మిక యూనియన్లు మాత్రం సర్కారు బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పాయి. సమ్మె జరిపితీరుతామని.. ప్రకటించాయి.

ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న సీఎం కేసీఆర్‌ హుటాహుటిన ఆర్టీసీ సమ్మెపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీతో పాటు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఇతర మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమ్మెపై జేఏసీ నేతలతో జరిపిన చర్చల సారాంశాన్ని కమిటీ సభ్యులు సీఎం ముందుంచారు. సమ్మెపై సీరియస్ అయిన సీఎం సమ్మెపై కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేశారు.

కేసీఆర్‌తో జరిపిన చర్చల సారాంశాన్ని వివరించిన మంత్రి పువ్వాడ అజయ్ ఇవాళ సాయంత్రం 6 గంటల్లోగా ఉద్యోగులు వారి వారి డిపోల్లో రిపోర్ట్‌ చేయాలని స్పష్టం చేశారు. అలా చేయని వారిని స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తిస్తామని తేల్చిచెప్పారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఇకపై ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని చర్చల కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీని రద్దు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీలో సమ్మెపై నిషేధం ఉందని అయినా చర్చలు జరుగుతున్న సమయంలో సమ్మెకు వెళ్లడం చట్ట విరుద్దం అని అన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రభుత్వం ఎప్పుడూ హామీ ఇవ్వలేదని మంత్రి అజయ్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటికే సంస్థ నష్టాల్లో ఉందని యూనియన్లు మాత్రం ఉద్దేశపూర్వకంగా సమ్మెకు వెళ్లడం సబబు కాదన్నారు. అసలే పండగ సీజన్‌లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సమ్మె చేయడం బాధ్యతారాహిత్యం అని అన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికులందరికీ 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని కాంట్రాక్ట్‌ కార్మికులను కూడా రెగ్యులరైజ్ చేశామని చెప్పారు. అమాయక కార్మికులు యూనియన్ల ఉచ్చులో పడొద్దని సూచించారు.

అయితే ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని సమ్మె విషయంలో వెనక్కు తగ్గేదే లేదని కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. శుక్రవారం అర్ధరాత్రి హెచ్ఎంటీవీతో మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ కన్వినర్ అశ్వథ్థామరెడ్డి విధులకు ఏ ఒక్క కార్మికుడు హాజరుకావడం లేదని తెలిపారు. అటు కార్మిక సంఘాలు ఇటు ప్రభుత్వం పట్టుదలతో ఉండటంతో పండగ సమయంలో ప్రజలకు కష్టాల ప్రయాణం మొదలైనట్లైంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories