రెడ్‌క్రాస్‌ సొసైటీ యాప్ ప్రారంభించిన రాష్ట్రపతి

రెడ్‌క్రాస్‌ సొసైటీ యాప్ ప్రారంభించిన రాష్ట్రపతి
x
Highlights

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు...

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ విందు కార్యక్రమానికి రాష్ట్రపతి దంపతులు హాజరైన అతిథులందరి వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌ దంపతులకు గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ రాజ్‌భవన్‌ ప్రవేశద్వారం వద్ద స్వాగతం పలికారు. విందు కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి తెలంగాణ రెడ్‌క్రాస్‌ సొసైటీ (ఐఆర్‌సీఎస్‌) మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్‌ను ఏ రాష్ట్రమైనా అడాప్ట్‌ చేసుకోవచ్చని, ఏ భాషలోనైనా వినియోగించవచ్చని గవర్నర్‌ తెలిపారు.

అనంతరం ఈ యాప్‌ కు సంబంధించిన విశేషాలను రాజ్‌భవన్‌ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ అతిధులకు వివరించారు. సొసైటీ సభ్యత్వం కోసం ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తమ వివరాలను నమోదు చేస్తే సరిపోతుందని తెలిపారు. యాప్‌ నుంచే డిజిటల్‌ సంతకం చేసిన సభ్యత్వ ధ్రువీకరణ పత్రం పొందవచ్చని,

సభ్యత్వ నమోదు కోసం రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా అత్యవసర సమయాల్లో సమీపంలో ఉన్న రక్త నిధి కేంద్రాల వివరాలు, చిరునామా, ఫోన్‌ నంబర్, గూగుల్‌ రూట్‌ మ్యాప్‌ తదితర వివరాలను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. విందు ముగిసిన అనంతరం తమిళిసై, కేసీఆర్‌లు రాష్ట్రపతి కోవింద్‌ దంపతులకు రాజ్‌భవన్‌ నుంచి వీడ్కోలు పలికారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories