Top
logo

కాంగ్రెస్‌కు బీజేపీ తాతలా మారింది: సీఎం కేసీఆర్

కాంగ్రెస్‌కు బీజేపీ తాతలా మారింది: సీఎం కేసీఆర్KCR Speech in Assembly
Highlights

ఇటీవలి కాలంలో తెలంగాణలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ బడ్జెట్ పై ప్రతిపక్ష పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ పై వ్యతిరేక విమర్శలు చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో తెలంగాణలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ బడ్జెట్ పై ప్రతిపక్ష పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ పై వ్యతిరేక విమర్శలు చేస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఈ రోజు నిర్వహించిన శాసనసభ సమావేశంలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ సభలో ఆయన బడ్జెట్ గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే అని ఎద్దేవా చేసారు. బీజేపీ నాయకులు అందరూ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు.

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి లేక లేక రాలేదని, రాష్ట్రం కోసం ఎంతగానో పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. ఆ తరువాత నూతన రాష్ట్రంలో మొదటిసారి పోటీ చేసి, గర్వంగా అధికారంలోకి వచ్చామని సీఎం తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీలు అసమర్ధ పార్టీలుగా నిలిచాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. బీజేపీ లేక లేక పీఠం దక్కించుకుందని, ఆ అవకాశాన్ని బీజేపీ తీవ్రంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. అంతకు ముందు ఎన్డీఏకు ప్రభుత్వం అధికారంలో ఉందని, ఆ పార్టీపై విసుగొచ్చి ప్రజలు బీజేపీని గెలిపించారని తెలిపారు.

దేశంలో జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత కేంద్రం ఏ ఏడాది కూడా రాష్ర్టానికి రూ. 10 వేల కోట్లు ఇవ్వలేదని ఆయన అన్నారు. గడిచిన కాలంలో సీఎస్టీ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం, జీఎస్టీ పేరుతో బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాలకు నిధులను ఎగ్గొడుతున్నాయని స్పష్టం చేసారు. వసూలు చేసిన పన్నుల్లో రాష్ర్టాలకు వాటా ఇవ్వడం కేంద్ర దయాదాక్షిణ్యాలు కాదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే మంచి స్థాయిలో ఉందని, దేశానికి అన్నం పెట్టే రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులనే కేంద్రం తెలంగాణకు ఇచ్చిందని ఆయన స్పష్టం చేసారు. కాంగ్రెస్‌కు బీజేపీ తాతలా మారింది. బీజేపీ నేతలు నీచపు బుద్ధి మానుకోవాలి అని సీఎం హెచ్చరించారు.

Web TitleTelangana Cm KCR Fires on BJP and Congress Parties in Assembly Session about Their politics
Next Story