కేటీఆర్ గారూ... ! ఆదుకోండి... ప్లీజ్!!

కేటీఆర్ గారూ... ! ఆదుకోండి... ప్లీజ్!!
x
Highlights

ఆమె ఐదేళ్ళ వయసులో అమ్మని కోల్పోయింది. మరికొన్నాళ్ళకు వస్త్ర ప్రపంచ సంక్షోభం నాన్న, నానమ్మ, తాత, సోదరిలను మింగేసింది. ఎవరూ దిక్కులేక...ఆ తర్వాత ఆమె,...

ఆమె ఐదేళ్ళ వయసులో అమ్మని కోల్పోయింది. మరికొన్నాళ్ళకు వస్త్ర ప్రపంచ సంక్షోభం నాన్న, నానమ్మ, తాత, సోదరిలను మింగేసింది. ఎవరూ దిక్కులేక...ఆ తర్వాత ఆమె, అమ్మమ్మ చెంతకు చేరినా తన తల రాత మారలేదు. వయో భారంతో అమ్మమ్మ కాలం చేసింది. ఇప్పుడు ఎవ్వరూ దిక్కులేక దిక్కులేని బతుకు ఈడుస్తున్నది. కనీసం చదువుకుని, తన కాళ్ళ మీద తాను నిలబడడానికి చేస్తున్న ప్రయత్నాల్లో చదువుకుందామంటే చిల్లి గవ్వలేక చింతిస్తున్నది ఈ చిన్నారి.

2001 ఏప్రిల్ 2న సిరిసిల్లలో సామూహిక బలవన్మరణాలు అప్పట్లో తీవ్ర సంచలనమయ్కాయి. రాజన్న సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ కు చెందిన కొండ కిష్టయ్య మర మగ్గాలలో అసంఘటిత కార్మికునిగా పని చేస్తుండేవాడు. ఆ రోజుల్లో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. కిష్టయ్యకు కుటుంబ పోషణ భారమైంది. అప్పటికే అనారోగ్యంతో తన భార్య మరణించడం కిష్టయ్యని కుంగదీసింది. అప్పటికే రూ.50వేల అప్పు, చేతి నిండా పనిలేదు. తీర్చే దారిలేదు. దీంతో తన తండ్రి మల్లయ్యతోపాటు బిడ్డ భానుప్రియ, తల్లిలకు శీతల పానీయంలో క్రిమి సంహారక మందు తాగించాడు. దీంతో వాళ్ళంతా మృతి చెందారు. సరిగ్గా ఆ సమయంలో ఇంట్లో లేని శాంతి ప్రియ మాత్రం బతికిపోయింది.

అప్పటికే అమ్మ, కన్నవాళ్ళు, వెంట ఉన్న వాళ్ళంతా కానరాని లోకాలకు పోవడంతో శాంతి ప్రియ తన అమ్మమ్మ దరి చేరింది. అప్పటికే ఒంటరిగా ఉంటున్న అమ్మమ్మకు చేదోడువాదోడుగా ఉంటూ కాలం వెళ్ళదీసింది. డిగ్రీ వరకు చదువుకుంది. కానీ ఇటీవల అమ్మమ్మ కూడా కాలం చేయడంతో శాంతి ప్రియ ఒంటరిగా మిగిలిపోయింది.

అప్పటికే డిగ్రీ చదివినా చేయడానికి వేరే పనేదీ లేక ఇంట్లో బీడీలు చేసుకుంటూ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకుంటూ, అమ్మమ్మకు చెందిన తడికెల ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది శాంతి ప్రియ. ఇక చదువుల్లో వచ్చిన మంచి మార్కులు పై చదువులకు మాత్రం అక్కరకు రాలేదు. పీజీలో సీటు వచ్చినా చేరడానికి సరిపడా డబ్బులు లేవు. పైగా తన పొట్ట నింపుకోవడానికి డబ్బులు అవసరం ఉండటంతో ఇప్పుడు మరోసారి దిక్కులేని పక్షిలా మారింది శాంతి ప్రియ. తనకు ఎవరైనా సాయం చేస్తే పెద్ద చదువులు చదివి సొంతంగా బతుకుతానని అంటున్నది శాంతి ప్రియ.

శాంతి ప్రియ తన చదువుకు సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నది. దాతల భూరి విరాళాలో సచ్ఛంద సంస్థల సాయమో అందుతుందన్న ఆశతో ఉంది. ఎందరి చదువులకో స్వచ్ఛందంగా ముందుకు వచ్చే టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్యెల్యే కూడా అయిన కెటి ఆర్, ఈ అమ్మాయిని ఆదుకుంటారా? ఇలాంటి వాళ్ళెందరికో నేనున్నానని ముందుకు వచ్చిన కెటి ఆర్, శాంతి ప్రియ ని కూడా ఆదరించాలని అంతా కోరుకుంటున్నారు. కెటి ఆర్ గారూ! ఆదుకోండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories