Top
logo

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు రూటే వేరు

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు రూటే వేరు
Highlights

తెలంగాణ రాజకీయాల్లో ఆయన నిద్రపోరు. అధికార పార్టీని నిద్రపోనివ్వారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ నేతలు...

తెలంగాణ రాజకీయాల్లో ఆయన నిద్రపోరు. అధికార పార్టీని నిద్రపోనివ్వారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ నేతలు కలిసిరాకపోయిన ఒంటరి పోరాటం చేస్తారు. మాటలతోనే కాకుండా చేతలతోనూ ప్రభుత్వానికి ఇబ్బంది పెడతారు.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత్ రావు రూటే వేరు. 80 ఏళ్లకు దగ్గర పడుతున్న వీహెచ్ పార్టీ నిర్ణయాలు తనకు నచ్చకపోతే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. యువ నేతలా అధికార టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఒంటరి పోరాటం చేస్తారు. ఇంటర్ ఫలితాల గందరగోళంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి వీహెచ్ ఓదార్చారు. మృతుడి తల్లిదండ్రులు ఏడుపు చూడలేక వీహెచ్ కూడా కన్నీరు పెట్టుకున్నారు.

హాజీపూర్ లో బాలికల హత్యల కేసులో బాధిత కుటుంబాలకు వీహెచ్ బాసటగా నిలిచారు. హాజీపూర్ లోనే పుట్టిన రోజు జరుపుకొని నేను ఉన్నాను అంటూ అండగా నిలిచారు. టీఆర్ ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇటీవల హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో కలకలం రేపిన అంబేద్కర్ విగ్రహాం తొలగింపును వీహెచ్ జీర్ణం చేసుకోవడం లేదు. ఈ విషయాన్ని దళిత సంఘాలు మరచిపోయిన ఈ కాంగ్రెస్ సీనియర్ నేత మరచిపోవడం లేదు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం పెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం అర్థరాత్రి పోలీసులకు తెలియకుండా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వీహెచ్ పంజాగుట్ట సర్కిల్ వద్దకు వచ్చారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష‌్టిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాటలు జరిగాయి.

పట్టు వదలకుండా అంబేద్కర్ విగ్రహాన్ని వీహెచ్ ప్రతిష్టించేందుకు ప్రయత్నిస్తుండడంతో ఆయన్ను పోలీసులు ఈడ్చుకుపోయారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా వీహెచ్ రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. బొల్లారం పోలీసు స్టేషన్ కు తరలించి వీహెచ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అంబేడ్కర్ విగ్రహం కోసం జైలుకైనా వెళ్లుతానని వీహెచ్ చెబుతున్నారు. టీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ నేతలు సైలెంట్ గా ఉంటే, వీహెచ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల్లో పోరాట స్ఫూర్తి నింపుతున్నారు.

Next Story


లైవ్ టీవి