200 బంతుల్లో 318 పరుగులు.. ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపిన యువ క్రికెటర్..

200 బంతుల్లో 318 పరుగులు.. ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపిన యువ క్రికెటర్..
x
Highlights

ప్రతిభకు పేదరికం అడ్డురాదు. సాధించాలన్న కసి, తపన ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు. పాలమూరులో ఓ యువకుడు ఇది నిరూపించాడు. పేదరికంలో పుట్టినా అద్భుత ప్రతిభను...

ప్రతిభకు పేదరికం అడ్డురాదు. సాధించాలన్న కసి, తపన ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చు. పాలమూరులో ఓ యువకుడు ఇది నిరూపించాడు. పేదరికంలో పుట్టినా అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు. గ్రామీణ ప్రాంతంలో పుట్టినా సత్తా చాటాడు. హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో జరిగిన మ్యాచుల్లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. రెండు రోజుల ఆటలో ట్రిపుల్ సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

క్రికెట్ మెట్రో నగరవాసులకే సొంతమన్న భావన కొందరిలో బలంగా నాటుకుపోయింది. కానీ ప్రతిభ ఉంటే గ్రామీణ క్రీడాకారులు సైతం క్రీడల్లో ఏ స్థాయికైనా వెళ్లొచ్చన్న భరోసాను హెచ్.సీ.ఏ కల్పిస్తోంది. ఆ అవకాశాలను అందుపుచ్చుకున్నాడు పాలమూరు యువకుడు గణేశ్. హెదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎ-2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్ మ్యాచ్ లో మహబూబ్‌నగర్ జిల్లా టీం ప్లేయర్ గణేశ్ పరుగుల మోత మోగించాడు. ఫోర్లు సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఒక్క రోజు ఆటలో 90 ఓవర్ల గేమ్ లో మహబూబ్ నగర్ స్కోరు 5 వికెట్లు కోల్పోయి 622 పరుగుల భారీ సాధిస్తే. అందులో గణేశ్ ఒక్కడే 200 బంతుల్లో 318 పరుగులు సాధించాడు. 42 ఫోర్లు 7 సిక్సర్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో అందరి దృష్టీ గణేశ్ పై పడింది.

గణేష్ లోని ప్రతిభను గుర్తించిన మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అతన్ని ప్రోత్సహించింది. క్రికెట్ లో మెలకువలు నేర్పింది. అండర్ -14 అండర్ -16 అండర్ -19 అండర్ -23 తోపాటు మహబూబ్ నగర్ ప్రీమియర్ లీగ్ టీటీఎల్, హెచ్.సీ.ఏ లీగ్ లలో గణేశ్ ప్రతిభ కనబరిచాడు. ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ ప్రీమియర్ లీగ్ లో గణేశ్ ఆల్ రౌండర్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సొంతం చేసుకున్నాడు. కేవలం పెద్ద నగరాల వారికే కాకుండా ఇలాంటి క్రికెటర్లకు రంజీల్లో అవకాశాలు కల్పించాలని కూడా మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్ వారు కోరుతున్నారు.

గణేశ్ తల్లిదండ్రులు చాలా నిరుపేదలు. గ్రామంలో కూలీచేసుకుని బ్రతికేవారు. కానీ తమకొడుకులోని ప్రతిభను చూసి గొప్ప క్రికెటర్‌గా అవుతాడని భావిస్తున్నారు. దీనికోసం ఉన్న ఊరును వదిలి మహబూబ్ నగర్ వచ్చి స్థిరపడ్డారు. తండ్రి కూలీగా, తల్లి టైలర్ గా పనిచేస్తున్నారు. ఇటు గణేష్‍ తల్లిదండ్రులకు సాయపడుతూ, చదువులోనూ క్రికెట్ లోను ప్రతిభ కనబరుస్తున్నాడు. గణేశ్ క్రికెట్ లో రాణిస్తుండటంతో తల్లిదండ్రుల్లో సంతోషంలో మునిగిపోయారు. మొత్తానికి ప్రతిభ ఉంటే.. ప్లేస్ తో పనిలేదని గనేశ్ నిరూపిస్తున్నారు. ఎప్పటికైనా ఇండియా జట్టుకు ఆడాలని కలలు కంటున్నాడు.. అతని కల సాకారం అవ్వాలని ఆకాంక్షిద్దాం. ఆల్ ద బెస్ట్ గణేశ్.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories