ఫలించిన 'హెచ్ఎంటీవీ' ప్రయత్నం.. చిన్నారి దుర్గా భవానికి ఇల్లు కట్టించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఫలించిన హెచ్ఎంటీవీ ప్రయత్నం.. చిన్నారి దుర్గా భవానికి ఇల్లు కట్టించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
x
Highlights

హెచ్‌ఎంటీవీ చొరవతో ఓ పాపకు కష్టాలు గట్టెక్కాయి. నాయనమ్మను బతికించుకోవడానికి ఎనిమిదేళ్ల పాప పడుతున్న కష్టాలను గుర్తించిన హెచ్‌ఎంటీవీ..పాపం పసిపాప...

హెచ్‌ఎంటీవీ చొరవతో ఓ పాపకు కష్టాలు గట్టెక్కాయి. నాయనమ్మను బతికించుకోవడానికి ఎనిమిదేళ్ల పాప పడుతున్న కష్టాలను గుర్తించిన హెచ్‌ఎంటీవీ..పాపం పసిపాప పేరుతో కథనాలు ప్రసారం చేసింది. వీటిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాప పరిస్థితిపై ఆరా తీశారు. పాపను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన జగ్గారెడ్డి..కొత్త ఇల్లు కట్టించి ఇవ్వడంతోపాటు పాప నాయనమ్మకు మెరుగైన వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలు జగ్గారెడ్డి నెరవేర్చడంతో కొత్త ఇంటిలోకి ప్రవేశించబోతోంది.

ఈ పాప పేరు దుర్గాభవానీ. వయస్సు 8ఏళ్లు. సదాశివపేట పట్టణంలోని సిద్దాపూర్ కాలనీలో ఓ శిథిలావస్థకు చేరిన పూరి గుడిసెలో నాయనమ్మతో జీవనం సాగిస్తోంది. 80ఏళ్ల వృద్ధాప్యంతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మను బతికించుకోవడానికి ఆ పాప పడుతున్న కష్టాలను హెచ్‌ఎంటీవీ గుర్తించింది. పలు కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలు చూసి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుటుంబంతో సహా పాప ఉంటున్న కాలనీకి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. దుర్గాభవానీని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు కొత్త ఇల్లు కట్టిస్తానని, పాప నాయనమ్మకు మెరుగైన వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. అదే రోజు పాప నాయనమ్మను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రిలో చేర్పించగా ఆ మరుసటి రోజే ఇంటి నిర్మాణం చేపట్టారు జగ్గారెడ్డి.

వారం, పది రోజుల్లో దుర్గాభవానీ ఇంటి నిర్మాణం పూర్తి కాబోతోంది. కాంపౌండ్ నిర్మాణం, టైల్స్ వేయడం లాంటి చిన్న, చిన్న పనులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. దీంతో తన కొత్త ఇల్లు పూర్తవుతుందని దుర్గాభవానీ ఆనందం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇంతకాలం పాప కష్టాలను కళ్లారా చూసిన కాలనీవాసులు ఇంటి నిర్మాణం జరగడం పట్ల సంతోషపడుతున్నారు. హెచ్‌ఎంటీవీ చొరవతో పాప కష్టాలు తీరాయని అభినందిస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

10రోజుల్లో దుర్గాభవానీ ఇల్లు పూర్తయ్యే అవకాశం ఉండటంతో గృహప్రవేశం కార్యక్రమాన్ని గ్రాండ్‌గా చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. కాలనీవాసులందరికీ భోజనాలు పెట్టడంతోపాటు ఒక పవర్‌ఫుల్ వ్యక్తిని కార్యక్రమానికి ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాప కష్టాలు తీర్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories