మేడారం మహాజాతరకు వేళాయే!

మేడారం మహాజాతరకు వేళాయే!
x
మహా జాతరకు వేళాయె
Highlights

తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజనుల పండగైన మేడారం సమ్మక్క - సారక్క మహాజాతర ప్రారంభానికి సర్వం సిద్ధం అయింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర...

తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజనుల పండగైన మేడారం సమ్మక్క - సారక్క మహాజాతర ప్రారంభానికి సర్వం సిద్ధం అయింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతర నాలుగు రోజుల పాటు కొనసాగి 8వ తేదీన దేవతల వనప్రవేశంతో ముగుస్తుంది. జాతర ప్రారంభం కావడానికి పది రోజుల ముందు నుంచే ఇక్కడకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 40 లక్షల మంది వన దేవతలను దర్శించుకున్నారని అంచనా వేస్తున్నారు. ఇక జాతర జరిగే ఈ నాలుగు రోజుల్లో 60 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని భావిస్తున్నారు. మేడారం జాతర కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుపుతున్నారు. ఇక టూరిజం సంస్థ ఈ మహాజాతర కోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్ సర్వీసులను నిర్వహిస్తోంది.

రేపటినుంచి మొదలయ్యే జాతర ఇలా సాగుతుంది..

ఇప్పటికే మంగళవారం కన్నెపల్లె నుంచి పూజారులు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కూర్చోబెట్టె కార్యక్రమం కోలాహలంగా ప్రారంభమైంది. ఇక మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం నుంచి సమ్మక్క భర్త పగిడిద్ద రాజును తీసుకొని పూజారులు మేడారానికి పాదయాత్రగా పయనమయ్యారు. వీరు అటవీ ప్రాంతం గుండా సుమారు 66 కిలోమీటర్లు కాలినడకన మేడారం చేరుకుంటారు.

జాతర మొదటి రోజు..

రేపు అంటే బుధవారం అసలు మహాజాతర ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగా కన్నేపల్లి నుంచి సారలమ్మ తీసుకుని వస్తారు. జంపన్న వాగును దాటిన సారలమ్మ గద్దెలపై సాయంత్రం 8 గంటలకు ప్రతిష్టితమవుతారు. ఇక ఏటూరు నాగారం నుంచి గోవిందరాజులును తీసుకువచ్చి కూర్చోపెడతారు. దీంతో జాతర ఆరంభం అవుతుంది. అయితే, తొలి నుంచి సారలమ్మను కాక వంశస్తులే తీసుకొస్తుండగా ఈసారి వెనక వంశం వారు సమ్మక్క భర్త పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా పునగండ్ల నుంచి తీసుకొస్తున్నారు. మరోవైపు సారలమ్మ భర్త పగిడిద్దరాజును ములుగు జిల్లా కొండయి గ్రామం నుంచి ధగట్ల వంశం వారు తీసుకొస్తున్నారు.

రెండోరోజు ఇలా..

చిలకలగట్టుపై సమ్మక్కకు మొదటి పూజను సిద్దబోయిన వంశంవారు గురువారం చేస్తారు. కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను చిలకలగట్టు నుంచి కొక్కెర వంశం వారు తీసుకొస్తారు. సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్య, సహాయకులు మాల్యాల ముత్తయ్యల సారధ్యంలో సమ్మక్క అమ్మవారిని గద్దెలకు తీసుకొస్తారు. ఈ వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొని, జేజేలు పలుకుతూ హారతులు ఇస్తారు. ఈ సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు.

మూడోరోజు కార్యక్రమాలు ఇవే..

ఇక 7న భక్తులకు సమ్మక్క, సారక్క అమ్మవార్లు, పగిడిద్దరాజు, పగిడిద్దరాజులు గద్దెలపై ఉండి భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇదేరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వనదేవతలను దర్శించుకునేందుకు విచ్చేయనున్నారు.

నాలుగోరోజు దేవతల వనప్రవేశం..

జాతర ముగింపు సందర్భంగా నాలుగోరోజైన శనివారం 8వ తేదీన దేవతల వన ప్రవేశం ఘనంగా నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories