బాలింతకు కరోనా.. హాస్పిటల్ నుంచి పరార్!

బాలింతకు కరోనా.. హాస్పిటల్ నుంచి పరార్!
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలాన్ని సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా రోజుకి సుమారుగా 200 కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నగరంలో ఓ బాలింతకు కరోనా పాజిటివ్ తేలింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలాన్ని సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా రోజుకి సుమారుగా 200 కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నగరంలో ఓ బాలింతకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ బాలింతను గాంధీ హాస్పిటల్‌కు తరలించే ఏర్పాటు చేశారు. కాగా వైద్యులు ఏర్పాట్లు చేసేలోపే బాధితురాలి బంధువులు తల్లీబిడ్డను తీసుకొని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ సంఘటన కలకలం రేపుతోంది. ఈ సంబంధించి పూర్తి వివరాల్లోకివెళితే జూన్ 8 వ తేదీన పాతబస్తీలోని బేలా సూరజ్భాన్ ఆస్పత్రిలోకి హఫీజ్ బాబానగర్‌కు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం చేరింది. నిండు గర్భిణి అయిన ఆమెకి మరుసటి రోజు పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ఆమెను పరీక్షించి సిజేరియన్ చేసారు. కాగా ఆ మహిళ పండంటి బాబుకి జన్మనిచ్చింది. కాగా నాలుగు రోజుల క్రితం ఆమెకు దగ్గు, జలుబు మొదలైంది. దీంతో వైద్యులు ఆమెకు కరోనా సోకిందనే అనుమానంతో ముందుజాగ్రత్తగా ఆమెను వేరే గదికి మార్చారు. ఆ తరువాత ఆమె నుంచి శాంపిళ్లను సేకరించి టెస్టులకు పంపించారు. సోమవారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు ఆమెను గాంధీ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేయాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ మాటలు విన్న బాధితురాలి కుటుంబ సభ్యులు వైద్యులు తప్పుగా చెబుతున్నారని గొడవపడ్డారు. దీంతో చేసేదేం లేక హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే లోపే బాలింతను, శిశును తీసుకుని కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. దీంతో పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆ మహిళకు చికిత్స అందించే క్రమంలో కాంటాక్ట్ అయిన డాక్ట‌ర్లు, ఐదుగురు నర్సులు తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కరోనా పాజిటివ్ అని తేలిన బాలింతకు చికిత్స అందించిన వార్డులోనే మరో పది మంది బాలింతలు ఉన్నారని తెలుస్తోంది. వారందరి నుంచి శాంపిళ్లను సేకరించి టెస్టులకు పంపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories