నేటి నుంచి పాఠశాలల పున: ప్రారంభం

నేటి నుంచి పాఠశాలల పున: ప్రారంభం
x
Highlights

♦విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు ♦షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపాలని నిర్ణయం ♦అన్ని బస్‌పాస్‌లు చెల్లుబాటు ♦అధికారులతో పలుమార్లు సమీక్షించిన మంత్రి పువ్వాడ

దసరా సెలవుల అనంతరం తెలంగాణవ్యాప్తంగా పాఠశాలలుఇవాళ్టి (21.10.2019) నుంచి పున: ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. బస్సుల్లో పాస్‌లన్నీ చెల్లుబాటు అవుతాయని, బస్‌పాస్‌లున్న విద్యార్థులు టికెట్ తీసుకోరాదని, టికెట్ తీసుకోవాలని బలవంతం చేస్తే ఫిర్యాదుచేయాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. విద్యార్థుల కోసమే బస్సులు వెళ్లే ప్రాంతాల్లో కచ్చితంగా బస్సులు నడిపించాలని నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్టు అంచనా. వీరిలో కనీసం 20 లక్షల మంది ప్రతి రోజూ ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాష్ట్రంలో సుమారు 58 లక్షల మంది విద్యార్థులున్నారు. హైస్కూల్‌ స్థాయిలోసుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడి ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా బాలికలు బస్సులపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులపై ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపించనుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పవనిపిస్తోంది.

23 రోజుల దసరా సెలవుల తర్వాత విద్యా సంస్థలు ఇవాళ తిరిగి తెరుచుకున్నాయి. ప్రజారవాణాపై ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో పలుమార్లు సమీక్షించారు. విద్యాసంస్థల బస్సులు ప్రజా రవాణాకు తిరిగే అవకాశాలు లేకపోవడంతో ప్రైవేట్ బస్సులు, సెవెన్ సీటర్ ఆటోలు, ఇతర వాహనాల సంఖ్యను పెంచాలని మంత్రి పువ్వాడ అధికారులకు ఆదేశాలిచ్చారు. మరోవైపు స్కూళ్ల రీ ఓపెన్ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ, రవాణా అధికారులు, డిపో మేనేజర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories