తెలంగాణకు తీరని నష్టం : కృష్ణా బోర్డుకు రజత్‌కుమార్‌ ఫిర్యాదు

తెలంగాణకు తీరని నష్టం : కృష్ణా బోర్డుకు రజత్‌కుమార్‌ ఫిర్యాదు
x
Highlights

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో దుమారం రేపింది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీశైలం నుంచి నీటి తరలింపులకు...

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో దుమారం రేపింది. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీశైలం నుంచి నీటి తరలింపులకు జీవో విడుదల చేయగా ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతోంది తెలంగాణ సర్కార్‌. దీనిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.

కృష్ణా జలాల పంపకాలపై నదీ యాజమాన్య బోర్డు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కృష్ణా బేసిన్‌లో లభ్యమయ్యే మిగులు జలాలను తెలుగు రాష్ట్రాలు ఎలా వినియోగించుకోవాలన్న దానిపై చర్చించింది. ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్న బోర్డు ఈ నెలాఖరు లోగా 30 ఏండ్ల కృష్ణా వరద జలాలకు సంబంధించిన సమాచారం కోరింది. జూన్‌ మొదటివారంలో మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది. మిగులు జలాల పంపిణీని ట్రిబ్యునల్ తేల్చాల్సి ఉన్నా ఆలస్యమవుతుండటంతో శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తామంది సీడబ్యుసీ.

బోర్డు మీటింగ్‌లో తెలంగాణ తరపున వాదనలు వినిపించారు ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌. పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచితే తెలంగాణ నష్టపోతుందని బోర్డుకు వివరించినట్లు తెలిపారు. బోర్డు చైర్మన్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కృష్ణా నదిలో 2017-18 నాటి పరిస్థితులు మళ్ళీ వస్తే త్రాగునీటికి కూడా కష్టాలు పడాల్సి వస్తుందన్నారు రజత్‌కుమార్. మిగులు జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లెక్కలు తేల్చాలని లేదంటే ఇరురాష్ట్రాలు ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇక ఏపీ ప్రభుత్వం విభజన చట్టానికి వ్యతిరేకంగా జీవో విడుదల చేసిందంటూ కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ. బోర్డు చైర్మన్‌ను కలిసి కొత్త ప్రాజెక్ట్‌లను ఆపాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా కొత్త ప్రాజెక్ట్‌ అని తేల్చి చెప్పింది. అయితే ఇరు రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం అందాకే కృష్ణా బోర్డు మిగులు జలాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories