జగదీష్‌ రెడ్డిని వీడని పాత గుబులేంటి?

జగదీష్‌ రెడ్డిని వీడని పాత గుబులేంటి?
x
Highlights

ఆయన‌ ఉమ్మడి నల్గొండ జిల్లా‌ రాజకీయాలను శాసిస్తున్న నేత గత ప్రభుత్వంలోను‌ ప్రస్తుత ప్రభుత్వంలోను, ఆయనే సీఎంకు అనుంగు మంత్రి పార్టీ కార్యక్రమం అయినా‌...

ఆయన‌ ఉమ్మడి నల్గొండ జిల్లా‌ రాజకీయాలను శాసిస్తున్న నేత గత ప్రభుత్వంలోను‌ ప్రస్తుత ప్రభుత్వంలోను, ఆయనే సీఎంకు అనుంగు మంత్రి పార్టీ కార్యక్రమం అయినా‌ పాలనాపరమైన అంశాలైనా, ఆయన ఓకే అంటేనే ముందుకెళతాయి ఏ ఎన్నికలు వచ్చినా అభ్యర్ధుల ఎంపిక సైతం అధినేతతో చర్చించి ఫైనల్ చేసేది ఆ లీడరే కాంగ్రెస్ పట్టున్న ఆ జిల్లాలో సీనియర్ నేతలను‌ ఓడించడంలోను సక్సెస్ అయ్యారు. కానీ ఎంపీ ఎన్నికలలో మాత్రం ఆ వ్యూహం రివర్సయ్యింది. ఇప్పుడు అదే దిగులు ఆయనను వెంటాడుతోంది. ఇంతకీ‌‌ ఆ జిల్లా ఏది? ఆ మంత్రి గారు ఎవరు?

గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లా ‌నుంచి మంత్రిగా కొనసాగుతున్న నేత. టిఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్‌కు అత్యంత దగ్గరగా ఉండే నాయకుడు. ఉద్యమ కాలం నుంచి అధినేత వెంట నడిచిన నేతల్లో ఒకరు జగదీష్ రెడ్డి. అంతేకాదు తెలంగాణ వచ్చాక టిఆర్ఎస్ ప్రభుత్వంలోను, అధినేతతోనూ జగదీష్ రెడ్డి ప్రయాణం.

జగదీష్ రెడ్డి ఏది మాట్లాడినా, మాట్లాడకపోయినా సిఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే, జగదీష్ రెడ్డి నోటి వెంట వస్తుందని అంటారు. గత ప్రభుత్వంలో జిల్లాలో పన్నెండు స్థానాల్లో టిఆర్ఎస్ ఆరు గెలవగా, జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. ఇక‌ పాలనా పరంగా ముందుకు సాగిన జగదీష్ రెడ్డి, పార్టీ పరంగాను ముందుకు‌ నడిపించారు.

రెండోసారి ఎన్నికల్లో తన అనుకున్నవారికే టికెట్‌లు ఇప్పించుకున్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి లాంటి నేతలను ఓడించడంతో సిఎం కేసీఆర్ దగ్గర మరిన్ని మార్కులు తెచ్చుకున్నారు జగదీష్‌ రెడ్డి. ఇదే గుర్తింపు ‌జగదీశ్ రెడ్డికి విద్యాశాఖ వచ్చేలా‌ చేసిందని, గత ప్రభుత్వంలో విద్యాశాఖ నుంచి విద్యుత్ శాఖ మారడంతో ఆరోపణలు వచ్చాయి. మళ్లీ అవే ఆరోపణలు వచ్చిన శాఖనే కేసీఆర్, తిరిగి కట్టబెట్టడంతో జగదీష్ రెడ్డి గ్రాఫ్ పెరిగేలా‌ చేసిందని అంటారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో అధికారులు మారాలన్నా, ఉండాలన్న జగదీష్ రెడ్డి మార్క్ ఉండాల్సిందే అన్న టాక్ ఉంది. గత ప్రభుత్వంలో సూర్యాపేట కలెక్టర్‌గా ఏరికొరి తెచ్చుకున్న సురేంద్ర మోహన్, అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసారని‌, ఎన్నికల్లో పలు కేసులు కావడానికి వ్యవహరించారన్న చర్చ ఉంది.‌ దీంతో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి‌ వచ్చీ రావడంతోనే సూర్యాపేట కలెక్టర్ ‌సురేంద్ర మోహన్‌ను మార్చడం, వెంటనే మరో కలక్టర్‌ను నియమించడం, సురేంద్ర మోహన్‌కి పోస్టింగ్ ఇవ్వకుండా విఆర్‌లో ఉంచడం చకచకా జరగిపోయాయి. ఇదంతా కూడా జగదీష్ రెడ్డి దగ్గరుండి అధినేతతో చర్చించి జరిపారని అధికార వర్గాల్లో సైతం చర్చ ఉంది.

పాలనాపరంగా, పార్టీ పరంగా తనకు ఎదురు వచ్చి నిల్చే పరిస్థితి జిల్లాలో లేదనేది‌ ప్రచారం. టిఆర్ఎస్ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి దాకా, నల్గొండలో ఏకచక్రాధిపత్యం జగదీష్ రెడ్డి‌దే అంటారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండలో, నేతల వర్గ రాజకీయాలకు తోడు ‌జగదీష్ రెడ్డి పొలిటికల్‌ వ్యూహాలు టిఆర్ఎస్ అభివృద్ధికి మరింత‌ కృషి చేశాయంటారు రాజకీయ విశ్లేషకులు.

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గెలుపోటముల‌ బాధ్యత జగదీష్ రెడ్డిదే అంటారు. తేరా చిన్నపరెడ్డి లాంటి ఆర్ధిక స్థితిమంతుడైన నేతను, స్థానిక సంస్థల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోవడంతో, జగదీష్ రెడ్డికి‌ కొంత ఇబ్బందిగా‌ మారింది. మళ్లీ అదేస్థానం‌ ఖాళీ కావడంతో‌ తేరా చిన్నపరెడ్డినే తమ‌ అభ్యర్థిగా‌ నిలబెట్టి , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీని ఓడించడంలో సక్సెస్ అయ్యారని టాక్. అయితే ఎంపీ ఎన్నికల్లో ఓటమి, జగదీష్‌ రెడ్డి గ్రాఫ్‌ను కొంత దించిందన్న టాక్‌ మొదలైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్‌ అయినా, ఎంపీ‌ ఎలక్షన్స్‌ జగదీష్‌ రెడ్డికి, కేసీఆర్‌ దగ్గర మార్కులు తగ్గించాయన్న చర్చ జరుగుతోంది. నల్గొండలో రెండు సీట్లు కూడా చేజారడంతో‌ జగదీష్ రెడ్డి కొంత డల్‌ అయ్యారని తెలుస్తోంది. భువనగిరి సిట్టింగ్ సీటు స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం, నల్గొండలో ఆర్ధికంగా బలమైన అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహ్మా రెడ్డిని, ఉత్తమ్‌పై పోటికి నిలిపినా, టిఆర్ఎస్ ఓడిపోయింది. ‌‌గత ఎంపీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంత ఖర్చు పెట్టినా, వేమిరెడ్డి ఓడిపోయారు. రెండు ఎంపీ సీట్లు గెలిచి, కేసీఆర్‌కు కానుక ఇవ్వాలని తపించిన జగదీష్‌ రెడ్డి, చివరికి ఆ రెండింటిలోనూ పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు తలపట్టుకున్నారన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టాలన్న ప్రయత్నం కూడా బెడిసికొట్టిందన్న భావన కూడా వ్యక్తమవుతోంది.

ఇక‌ జగదీష్ రెడ్డికి‌, దాదాపు ఉమ్మడి జిల్లా‌ అంతా కలిసొచ్చినట్లే కనిపించినా ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలతో కొంత గ్యాప్ ఉందంటారు.‌ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు‌ అన్ని‌ విషయాల్లోనూ ‌కలిసిరారన్నది టాక్. వీరికి‌ రాజకీయంగా ‌కొంత చెక్ పెట్టేందుకు మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి కుటుంబాన్ని జగదీష్ రెడ్డి ప్రమోట్ చేస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే భువనగిరి నియోజకవర్గానికి చెందిన ఎలిమినేటి సందీప్ రెడ్డిని‌ ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం నుంచి పోటీ చేయించి జిల్లాపరిషత్ చైర్మన్ చేసారని దీనివల్ల సందీప్ రెడ్డి, యాదాద్రి జిల్లాలో పూర్తిస్థాయిలో ఉన్న ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ముందుకు పోతే, ‌ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వెంట నడిచే అవకాశం ఉందని, అందుకే టిడిపి హయాంలో చక్రం తిప్పిన ఎలిమినేటి కుటుంబాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వంలో‌ యాదాద్రి జిల్లాలో కీరోల్‌గా మలచడంలో జగదీష్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెబుతారు సన్నిహితులు.

ఇక గుత్తా సుఖేందర్ రెడ్డిని సైతం రాజకీయంగా ఏకాకిని చేయడంలో జగదీష్‌ రెడ్డి సక్సెస్ అయ్యారన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు మంత్రి చెప్పిందే వేదంగా గుత్తా మసలుకుంటున్నారని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇక యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాపరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌ ఎన్నికల్లోనూ జగదీష్ రెడ్డి నిర్ణయమే ఫైనల్. రాజకీయాల నుంచి ఉన్నతాధికారుల వరకు‌ ఏదైనా జగదీష్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే అంటారు.

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టిఆర్ఎస్‌కు రెండు‌, మూడు గ్రూపులు ఉన్నాయని అంటారు. కానీ‌ నల్గొండలో ‌మాత్రం ఉన్నది జగదీష్ రెడ్డి గ్రూపు‌ మాత్రమేనన్నది లోకల్‌ టాక్. ఆ గ్రూపుకు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారంటే చాలు, రాజకీయంగా చెక్ పడాల్సిందే. ఉద్యమం నుంచి నేటి వరకు‌ టిఆర్ఎస్‌కు మంచి జరిగినా చెడు జరిగినా మొత్తం బరువు బాధ్యతలు మోస్తున్న జగదీష్ రెడ్డినే భరించాల్సి వస్తుందని అంటారు.

మొత్తంగా గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒక్కరే ఉమ్మడి నల్గొండ రాజకీయాలను శాసిస్తున్నారు. గత టిడిపి, కాంగ్రెస్‌లో రెండు వర్గాల పాలనా ఉండేది‌. ఇపుడు వర్గమే లేకుండా వర్గపోరుకు అవకాశమే లేకుండా, పార్టీ పరంగా పాలనాపరంగా అందివచ్చిన అవకాశంతో జగదీష్ రెడ్డి‌ ముందుకు సాగుతున్నారని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, జిల్లా పరంగా పట్టున్నా, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిపోవడం మాత్రం, జగదీష్‌ రెడ్డిని కుంగదీస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories