అమ్మకానికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు

అమ్మకానికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు
x
Highlights

తెలంగాణ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకం ఆలస్యంగా వెలుగు చూసింది. కొందరు అధికారులు సిబ్బందితో చేతులు కలిపి ఒక్కో ఉద్యోగానికి 50 వేల నుంచి...

తెలంగాణ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకం ఆలస్యంగా వెలుగు చూసింది. కొందరు అధికారులు సిబ్బందితో చేతులు కలిపి ఒక్కో ఉద్యోగానికి 50 వేల నుంచి లక్ష వరకు ధర నిర్ణయించారు. ఇప్పటికే 270 మంది ఔట్‌ సోర్సింగ్‌లో ఉండగా, అవసరానికి మించి ఉద్యోగులను నియమిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ అక్రమాలపై విద్యార్థి సంఘాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి.

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు వివాదస్పదంగా మారాయి. వర్సిటీకి చెందిన ఓ కీలక అధికారి సిబ్బందితో చేయి కలిపి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టారు. అవసరం లేకున్నా అటెండర్లు, సెక్యూరిటీ గార్డులను ఇబ్బడి ముబ్బడిగా భర్తీ చేశారు. ఒక్కో ఉద్యోగానికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక్కడ ఉద్యోగాల భర్తీ కోసం ఇది వరకే పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ ప్రమోషన్లలోను భారీగా వసూళ్లకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 30 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయడం పట్ల పలు విద్యార్ధి సంఘాలు ఇంచార్జీ వీసీ అనిల్ కుమార్ తో పాటు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వీసీ సాంబయ్య పదవీ విరమణ అనంతరం ఈ నియామకాలు జరగడం కొసమెరుపు.

కొందరు దళారులు యూనివర్సిటీని అడ్డాగా చేసుకుని అమాయకుల నుంచి ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నట్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీలో భూములు కొల్పోయిన బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్నా వారిలో ఇప్పటికీ కొందరు అధికారులు చుట్టు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఇంకొందరు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందారు. ఇలా అనేక అక్రమాలకు తెలంగాణ యూనివర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఐతే యూనివర్సిటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాలపై అంశాన్ని ఇంచార్జీ వీసీ, సీనియర్ ఐఏఎస్ అనిల్ కుమార్ దృష్టికి హెచ్‌ఎంటీవీ తీసుకెళ్లింది. అక్రమ నియామకాలు జరిగితే రద్దు చేస్తామని, సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్‌ఎంటీవీకి తెలిపారు.

అవసరానికి మించి సిబ్బందిని నియమించి యూనివర్సిటీ ఆర్ధిక ఇబ్బందుల్లో మునిగిపోతుంది. కొందరు అధికారులు జేబులు నింపుకునేందుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు బంగారు బాతుగుడ్లుగా మారాయి. ఇప్పటికైనా ఈ అక్రమ దందాకు చెక్ పెట్టాలని విద్యార్ధులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories