ఆ మూడు ఎమ్మెల్సీ పదవులపై నేతల గురి.. తెరపైకి కొత్తకొత్త పేర్లు?

ఆ మూడు ఎమ్మెల్సీ పదవులపై నేతల గురి.. తెరపైకి కొత్తకొత్త పేర్లు?
x
ఆ మూడు ఎమ్మెల్సీ పదవులపై నేతల గురి
Highlights

తెలంగాణలో వరుస ఎన్నికలు పూర్తవ్వడంతో ఎమ్మెల్సీ పదవుల అంశం తెరపైకి వచ్చింది. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో, అవి ఎవరికి దక్కుతాయనే...

తెలంగాణలో వరుస ఎన్నికలు పూర్తవ్వడంతో ఎమ్మెల్సీ పదవుల అంశం తెరపైకి వచ్చింది. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో, అవి ఎవరికి దక్కుతాయనే చర్చ అధికార టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరుగుతోంది. ఎవరికి పదవి ఊడుతుందో, ఎవరికి పదవీయోగం వుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీల పదవులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ప్రముఖులు, ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు అవకాశం రాని నేతలు, పార్టీ సీనియర్లు పెద్దల సభకు వెల్లేందుకు తహతహలాడుతున్నారు.

మొత్తం మూడు స్థానాలకు ఈ దఫా ఎన్నికలు జరుగనున్నాయి. శాసన మండలిలో ఇప్పటికే నిజామాబాద్‌ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఒకటి ఖాళీగా ఉంది. అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి, తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022 జనవరి 4 వరకు ఉంది. దీంతో భర్తీకి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ స్థానంలో అదే ప్రాంతానికి చెందినవారికే అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోంది.

నిజామామాద్ కోటాలో తొలుత మాజీ స్పీకర్ కె.ఆర్‌.సురేష్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ, స్థానిక సంస్థల కోటాలో, అదీ తక్కువ కాలంలో రిటైర్‌ కావాల్సిన పదవి కాబట్టి, తీసుకోవటానికి వారు సుముఖంగా లేరని తెలిసింది. ఎమ్మెల్సీ కంటే, ఏప్రిల్‌లో ఖాలీ అవుతున్న రాజ్యసభ స్థానం దక్కించుకునేందుకే వారిరువురు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ స్థానానికి అరికెల నర్సారెడ్డి, ఈగ గంగా రెడ్డి, ముజీబుద్దీన్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది ఆగస్టులోగా గవర్నర్‌ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రిటైరయ్యే ఎమ్మెల్సీల జాబితాలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సబావత్‌ రాములు నాయక్‌, కర్నె ప్రభాకర్‌ పేర్లున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన కారణంగా ఎదుర్కొన్న అనర్హత వేటును కోర్టులో సవాల్‌ చేసిన రాములు నాయక్‌ స్థానం, మార్చి 2న ఖాళీ కానుంది. నాయిని 2020 జూన్‌ 19న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కర్నె ప్రభాకర్‌ ఆగస్టు 17న రిటైర్‌ కావాలి. దీంతో ఈ స్థానాల భర్తీ కోసం టీఆర్‌ఎస్‌ నేతలు చాలా మంది ఎదురుచూస్తున్నారు. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అధినాయకత్వం చాలా మందికి ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చింది. ఉమ్మడి జిల్లాల వారీగా, జిల్లాకు ఇద్దరు ముగ్గురు చొప్పున రేసులో ఉన్నారు.

కర్నె ప్రభాకర్‌ను గతేడాది సెప్టెంబరులోనే శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా నియమించడంతో, ఆయన ఎమ్మెల్సీ పదవి రెన్యువల్‌ లాంఛనమేననే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. మరోవైపు సీఎం ఓయస్డీ దేశపతి శ్రీనివాస్‌కు మరో సీటు ఖాయమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచీ దేశపతి, ఆయనకు సన్నిహితంగా ఉన్నారు. ప్రభుత్వ టీచర్‌గా ఉన్నప్పటికీ, డిప్యూటేషన్‌పై ఓయస్డీగా పనిచేశారు. టీచర్ల డిప్యూటేషన్లను సుప్రీం కోర్టు రద్దు చేయడంతో ఉపాధ్యాయ పదివికి రాజీనామా చేసి, కేసీఆర్ ఓయస్డీగా పనిచేస్తున్నారు. అందుకే దేశపతికి ఈ దఫా ఎమ్మెల్సీ పదవి ఖారారైదని టీఆర్ఎస్‌ భవన్‌లో చర్చ జరుగుతోంది.

ఇక మిగిలిన మరో సీటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా అవకాశం దక్కని నాయిని, కొంతకాలంగా చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు రెన్యువల్ అసాధ్యమంటున్నారు. దీంతో ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మధుసూధనాచారి, ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు సీఎం సన్నిహితుల్లో మరొకరికి అవకాశం ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. టిఎన్టీఓ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌ కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్‌ రెడ్డి సహా అనేకమంది పేర్లు ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తున్నాయి. దీంతో సీఎం ఎవరికి అవకాశం కల్పిస్తారనే ఉత్కంఠ, అందరిలో నెలకొంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories