తహశీల్దార్ విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు.. పెద్దఎత్తున పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులు

తహశీల్దార్ విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు.. పెద్దఎత్తున పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులు
x
Highlights

దుండగుడి చేతిలో సజీవదహనమైన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ విజయారెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు, రెవెన్యూ ఉద్యోగుల కన్నీటి వీడ్కోలు పలికారు....

దుండగుడి చేతిలో సజీవదహనమైన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ విజయారెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు, రెవెన్యూ ఉద్యోగుల కన్నీటి వీడ్కోలు పలికారు. కొత్తపేటలోని విజయారెడ్డి నివాసం నుంచి నాగోలు శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో విజయారెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపగా విజయారెడ్డి చితికి భర్త సుభాష్‌రెడ్డి నిప్పంటించారు.

విజయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. దారిపొడవునా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడిని ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. అయితే, విజయారెడ్డి అంతిమయాత్ర, అంత్యక్రియల సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఒకానొక సమయంలో రెవెన్యూ ఉద్యోగులు-పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ దగ్గరుండి విజయారెడ్డి అంతిమయాత్ర, అంతిమ సంస్కారాలను పర్యవేక్షించారు.

ఇక, తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యపై రెవెన్యూ యంత్రాంగం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. రెవెన్యూ ఉద్యోగులపై దాడులను అరికట్టాలంటూ నల్గబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. దాంతో కలెక్టరేట్లు, ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. అయితే, రెవెన్యూ ఉద్యోగులకు భద్రత ఎక్కడికక్కడ భద్రత కల్పించాలంటూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories