సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ.. 3 డిమాండ్లతో..

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ.. 3 డిమాండ్లతో..
x
Highlights

కరోనా వైరస్‌ వల్ల తెలంగాణలో ఆరుగురు చనిపోవడం ఎంతగానో కలవరపెట్టిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ...

కరోనా వైరస్‌ వల్ల తెలంగాణలో ఆరుగురు చనిపోవడం ఎంతగానో కలవరపెట్టిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖలో పలు విషయాలను రేవంత్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ముందు రేవంత్ మూడు డిమాండ్లు ఉంచారు.

రేవంత్‌రెడ్డి రాసిన లేఖ యదాతథం

విషయం: లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకున్న పలు నిర్ణయాల గురించి…

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈ వ్యాది వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే మనం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. గత పది రోజులుగా లాక్ డౌన్ ప్రకటించి జన సంచారాన్ని అష్ఠదిగ్భందనం చేశాం. ఈ వ్యాది సోకి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం కలవరాన్ని కలిగిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా సంయమనంతో, ముందు చూపుతో, ఆచితూచి నిర్ణయాలు చేయాలి. ప్రభుత్వాధినేతగా మీరు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రజాభీష్టం మేరకు లేనప్పటికీ సమయ-సందర్భం దృష్ట్యా వాటిని ఎత్తి చూపకుండా బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా సంయమనం పాటిస్తున్నాం. అయినా, ప్రజల ఆలోచనలు, అవసరాలకు భిన్నంగా… అధికార పరిధి దాటి మీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల గురించి ఇక్కడ ప్రస్తావించదలచుకున్నాను. ఓ వైపు దేశంలో, రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి నేపథ్యంలో నిబంధనలకు భిన్నంగా తీసుకున్న పలు నిర్ణయాలు మీ దృష్టిలో ఉండవచ్చు లేకపోనూ వచ్చు. అలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాల విషయంలో పున:సమీక్ష చేస్తారన్న ఆకాంక్షతో వాటిని మీ దృష్టికి తెస్తున్నాను.

• ఫార్మాసిటీ భూసేకరణ – ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసులు

రంగారెడ్డి జిల్లా, యాచరం మండలం- మేడిపల్లి, నానక్ నగర్ గ్రామాల పరిధిలో ఫార్మాసిటీ భూ సేకరణకు ప్రజాభిప్రాయం కోరుతూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 3న ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించబోతున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. దేశంలో ఏప్రిల్ 14 వరకు అధికారిక లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు గుంపులుగా ఒక దగ్గర చేరడాన్ని ప్రభుత్వమే నిషేధించింది. అదే ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో సమావేశాలు, సభలు నిర్వహించడం మతిలేని ఆలోచన అవుతుంది. దీనిపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం మీ దృష్టికి తెస్తున్నాను.

• కాళేశ్వరం కోసం టెండర్లు… ఇది సమయమా!?

కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ నీటి పంపింగ్ కు సంబంధించి ఎనిమిది ప్రాకేజీలుగా రూ. 22,290 కోట్ల విలువ గల పనులకు టెండర్లు సిద్ధం చేశారు. ఇందులో రూ.11,710 కోట్ల విలువ గల పనులకు సోమవారం టెండర్లు పిలిచారు. మరో రూ.10,580 కోట్ల విలువగల పనులకు ఈరోజో, రేపో టెండర్లు పిలవబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కరోనా కారణంగా ప్రభుత్వమే లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలు సిబ్బందికి సెలవులు ప్రకటించాయి. తీరా ఇప్పుడు మీరు టెండర్లు పిలిస్తే క్షేత్ర స్థాయికి సాంకేతిక సిబ్బందిని పంపి, అంచనాలు సిద్ధం చేసుకుని టెండర్లలో పాల్గొనే వెసులుబాటు వారికి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో టెండర్లు పిలవడం చూస్తుంటే… పోటీని నివారించి, కొన్ని కాంట్రాక్టు సంస్థలకు మేలు చేయడం కోసం చేసిన చర్యగా కనిపిస్తోంది. తక్షణం సదరు టెండర్లను వాయిదా వేయాలి. లేనిపక్షంలో మీకు దురుద్ధేశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

• ఉద్యోగుల జీతభత్యాలకు కోత…

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాల చెల్లింపు గురించి వారం రోజుల క్రితం మీరు ఏం మాట్లాడారో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. నెలలో చివరి పది రోజులు లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఆయా సంస్థలు పూర్తి జీతాలు చెల్లించాల్సిందేనని మీరు ఆదేశించారు. ఈ ఆదేశాలు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా వర్తిస్తాయని చెప్పారు. తీరా ఇప్పుడు మాటమార్చి… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలలో దారుణమైన కోత విధించారు. ఈ నిర్ణయం విషయంలో మీరు కొంచ విచక్షణ పాటించి ఉండాల్సింది. ప్రజాప్రతినిధులు, అఖిలభారత సర్వీసు అధికారులు, ఇతర ప్రభుత్వ ఉన్నతోద్యోగుల జీతాల కోత విషయంలో మీ నిర్ణయంతో మేము ఏకీభవిస్తాం. కానీ, నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు జీతాల కోత విషయంలో మీ నిర్ణయం సరైనది కాదు. వీరంతా నెలజీతాలపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఉన్నతోద్యోగులు, చిరుద్యోగులను ఒకే గాటనకట్టి చూడటం తెలివైన ఆలోచన అనిపించుకోదు. ప్రస్తుతం వైద్య, పారామెడికల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. వాస్తవానికి తమిళనాడు తరహాలో వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. దానికి భిన్నంగా వారి జీతాలకు కూడా కోత విధించడం వారి నిబద్ధతను తక్కువ చేసినట్టవుతుంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జీతాల చెల్లింపులో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాలు అన్వేషించాలి. కొంత మేర జీతాలు ఇప్పుడు చెల్లించి, మిగతా మొత్తాలు వాయిదా వేయవచ్చు. అంతేతప్ప… చిరుద్యోగుల జీతాలపై కోత విధించడం సరికాదు. రాష్ట్రంలో జనజీవనం స్థంభించింది. ఆర్థిక లావాదేవీలు మందగించాయి. అంత మాత్రాన ప్రభుత్వం పన్నులు, ఛార్జీలు, సుంకాల విషయంలో ప్రజలకు మినహాయింపులు ఇవ్వలేదు కదా! ఈ రోజు కాకపోతే రేపైనా ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. కనుక… ప్రభుత్వం పన్నులు, ఛార్జీల వసూళ్ల క్రమానికి తగ్గట్టుగా సదరు వైద్య, చిరు ఉద్యోగులకు జీతాలభత్యాలు కూడా పూర్తిగా చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను.

పై మూడు నిర్ణయాలను పున:సమీక్షించి, జనామోదమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.







Show Full Article
Print Article
More On
Next Story
More Stories