మంత్రి-మాజీ మంత్రి మధ్య చిచ్చుకు మొక్క ఎలా కారణమైంది?

మంత్రి-మాజీ మంత్రి మధ్య చిచ్చుకు మొక్క ఎలా కారణమైంది?
x
Highlights

మొక్కే కదా అని పీకేస్తే....పీక తెగ్గొస్తా అంటాడు ఇంద్రసేనా రెడ్డి. ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఒక ఇంద్రుడు ఉన్నాడు. ఆయన కూడా దాదాపు ఇదే అర్థమొచ్చేలా, మొక్కలపై ఒక వార్నింగ్ ఇచ్చాడు.

మొక్కే కదా అని పీకేస్తే....పీక తెగ్గొస్తా అంటాడు ఇంద్రసేనా రెడ్డి. ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఒక ఇంద్రుడు ఉన్నాడు. ఆయన కూడా దాదాపు ఇదే అర్థమొచ్చేలా, మొక్కలపై ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంతే. మాజీ మంత్రి ఫీలయిపోయాడు. తన్నుకొస్తున్న ఆవేదనను అనుచరుల దగ్గర వెళ్లగక్కేశాడు. కావాలనే, మొక్క గురించి, పదేపదే నొక్కినొక్కి ఎందుకు చెబుతున్నాడంటూ ప్రతిఒక్కరి దగ్గర గోడు చెప్పుకున్నాడు. ఈ మొక్క వెనక పక్కా ప్లానింగ్‌ ఉందని నొక్కి వక్కాణిస్తున్నాడు. ఇంతకీ ఆదిలాబాద్‌ జిల్లాలో ఆ ఇంద్రసేనారెడ్డి ఎవరు మొక్క గురించి ఎందుకంత ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు అందుకు మాజీ మంత్రి ఎందుకు ఫీలయ్యారు వీళ్లిద్దరి మధ్య మొక్క పెట్టిన తంటా ఏంటి?

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి. అయితే పార్టీలో ఐక్యత పెంపొందించాల్సిన మంత్రి, విభేదాలను పెంచుతున్నారని పార్టీలో కొందరు బాహాటంగా విమర్శలు చేయడం, ఆదిలాబాద్‌ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పెన్ గంగా భవన్ నీటిపారుదల శాఖ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగురామన్న హాజరయ్యారు. అయితే కార్యక్రమం తర్వాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలే, జిల్లాలో మంట రేపుతున్నాయి.

ఇంతకీ మంత్రి ఏం మాట్లాడారంటే, హరితహారంలో గతంలో నాటిన మొక్కలు యాభైశాతం మిగిలాయని, కాని ఇప్పుడు ఎనభై శాతం నాటిన మొక్కలు పెరగాలన్నారు. లేదంటే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత హరితహారంపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్గాలు ఆశ్చర్యపోయాయట. ఈ కామెంట్లను ఎవరికి తోచిన రీతిలో వారు ఆపాదిస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు.

అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గతంలో అటవీ శాఖ మంత్రిగా జోగురామన్న పనిచేశారు. రామన్న మంత్రిగా పనిచేసిన సమయంలో, మొక్కల పెంపకం సరిగా జరగలేదని పరోక్షంగా దెప్పిపొడిచారన్న చర్చ వాడివేడిగా సాగుతోంది. మాజీ మంత్రి జోగురామన్నను ఉద్దేశించే, ఇంద్రకరణ్ రెడ్డి అలా మాట్లాడారని, వారి అనుచరులు మండిపడుతున్నారట. జోగురామన్నపై నెగెటివ్ ముద్ర వేయించేందుకే ఇంద్రకరణ్ రెడ్డి కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సొంత పార్టీ మాజీ మంత్రిపై ఆయన నియోజకవర్గంలోనే, మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ వర్గాలను హీటెక్కిస్తోంది.

అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలను అనవసరంగా వివాదం చేస్తున్నారని, అందరిలోనూ స్ఫూర్తి నింపడానికి, ఉత్సాహం నింపడానికే అలాంటి కామెంట్లు చేశారని, మంత్రి అనుచరులు మాట్లాడుతున్నారు. మరోవైపు ఈమధ్య కాలంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఆ విస్తరణలో జోగుకు చోటు లభిస్తుందన్న ప్రచారముంది. అలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వ్యూహంలో భాగమేనని జోగురామన్న వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరొక పవర్ సెంటర్‌గా మారుతారని మంత్రి ఆందోళన చెందుతున్నారని, జోగు అనుచరులు మాట్లాడుకుంటున్నారు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

మంత్రి, మాజీ మంత్రి మధ్య విభేదాల గురించి మరింత ఆసక్తికర చర్చ జరుగుతోంది ఆదిలాబాద్‌‌లో. నిర్మల్ నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఆధిపత్యాన్ని గండికొడుతూ కాంగ్రెస్ ఒక జడ్పీటీసీ స్థానాన్ని సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే మంత్రి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ మూడోస్థానానికి పరిమితమైంది. అదే ఆదిలాబాద్‌లో జడ్పీటీసీ ఎన్నికల్లో నాలుగులో నాలుగు స్థానాల్లో గులాబీ అభ్యర్థులు విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పరువు నిలుపుకునేలా ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది టీఆర్ఎస్. దాంతో గులాబీ అధినేత వద్ద జోగురామన్న పలుకుబడి పెరిగిందన్న ప్రచారముంది. ఆ పలుకుబడిని దెబ్బ తీయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని జోగు రామన్న వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి మంత్రి వ్యాఖ్యలు టిఆర్‌ఎస్‌లో దుమారం రేపుతున్నాయి. బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. పార్టీ పెద్దలు స్పందించి విభేదాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరడానికి సిద్దమవుతున్నారట కార్యకర్తలు. చూడాలి, కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, మంత్రి వర్సెస్ మాజీ మంత్రిగా కొనసాగుతున్న ఈ కోల్డ్‌వార్‌, ఎలాంటి మలుపు తిరుగుతుందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories