సమ్మె విరమణ యోచనపై ఆర్టీసీ కార్మికుల వ్యతిరేకత

సమ్మె విరమణ యోచనపై ఆర్టీసీ కార్మికుల వ్యతిరేకత
x
Highlights

ఆర్టీసీ సమ్మె 46 రోజులుగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలియచేస్తున్నారు. చాలీ చాలని వేతనాలతో,...

ఆర్టీసీ సమ్మె 46 రోజులుగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలియచేస్తున్నారు. చాలీ చాలని వేతనాలతో, సమయానికి చేతికందని సంపాదనతో సామాన్య ఆర్టీసీ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. తమకు సమయానికి జీతాలు చెల్లించాలని, జీతాలు పెంచాలన్న ప్రధాన డిమాండ్లతో నెలున్నర రోజుల పాటు సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో పలు కుటుంబాలు వీధినపడ్డాయి.

ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. జేఏసీ నేతలు సోమవారం సాయంత్రం నిరాహారదీక్షను విరమించారు. ఇవాళ నిర్వహించాల్సిన సడక్‌బంద్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం దిగిరావడం లేదు. యాజమాన్యం నిధులు లేవని చేతులెత్తేస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై సంఘాలు సమాలోచనలు చేస్తున్నాయి. సమ్మెపై లేబర్‌ కోర్టుకు వెళ్లాలా, వద్దా అనే అంశంపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కార్మికశాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో జేఏసీ నేతల్లో అంతర్మథనం మొదలైంది.

సమ్మెపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సంఘాలు ఇవాళ సమావేశమయ్యాయి. ఈ సమావేశంలోనే సమ్మె కొనసాగించాలా..? విరమించాలా అనే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి. ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మె విరమణ యోచనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు సమ్మె చేసి, ఇప్పుడు సమ్మె విరమిస్తే అటు ప్రభుత్వం నుండి, ఇటు ఆర్టీసీ యాజమాన్యం నుండి ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. ఈ వివిధ జిల్లాల నుంచి వచ్చిన 97 డిపోల కార్మికులతో ఆర్టీసీ జేఏసీ అభిప్రాయం సేకరించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్బంధం విధించినా చలో ట్యాంక్‌ బండ్‌, సరూర్‌నగర్‌ సభ విజయవంతం చేశామని, భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించి సమ్మెపై ముందుకు వెళ్లాలని మెజార్టీ కార్మికులు అభిప్రాయపడుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories