Top
logo

దొంగలు రూట్ మార్చారు.. ముసుగులు వేసుకొని దోపిడీ చేసే..

దొంగలు రూట్ మార్చారు.. ముసుగులు వేసుకొని దోపిడీ చేసే..
X
Highlights

దొంగతనాల తీరు మారింది. దొంగలు రూట్ మార్చారు. ముసుగులు వేసుకొని ఇంట్లో చొరబడి దోపిడీ చేసే రోజులు పోయాయి.

దొంగతనాల తీరు మారింది. దొంగలు రూట్ మార్చారు. ముసుగులు వేసుకొని ఇంట్లో చొరబడి దోపిడీ చేసే రోజులు పోయాయి. కాలు కదపకుండా కావాల్సినంత దోచుకుంటున్నారు. కత్తులతో వాళ్లకు పనిలేదు. తళాలు పగులకొట్టాల్సిన అవసరం లేదు. ఏంచక్కా ఇంట్లో కూర్చునే దర్జాగా డబ్బులు దండుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆన్ లైన్ మోసాలు అడ్డు అదుపు లేకుండా జరిగాయి. ఒక్కో క్రైం వెనుక ఉన్న కథ చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. సోషల్ మీడియా యుజర్స్ అకౌంట్లను లూటీ చేసి పడేశారు. లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ నేరగాళ్లు ఏం చేశారో మీరే చూడండి.

ఆన్ లైన్ మోసాలు ఎన్నో విన్నాం.. పేపర్లో చదివాం... టీవీల్లో చూశాం.. కానీ కరీనగర్ జిల్లాలో ఆన్ లైన్ మోసగాళ్లు డిఫ్రెంట్ గా ట్రై చేసి బుక్కయ్యారు. కరీంనగర్ జిల్లాలో అదో కీలకమైన డిపార్ట్ మెంట్.. అందులో ఉన్న ఓ అధికారికి ఫేస్ బుక్ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ నే కొందరు దుండగులు ఆయుధంగా వాడుకున్నారు. అధికారి హోదాతో ఉన్న ఆ ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఆ అధికారి అకౌంట్ ను ఏ మాత్రం టచ్ చేయలేదు. కానీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవారిని టార్గెట్ చేశారు. వారందరికీ హాయ్ అంటూ మెసేజ్ పెట్టారు హ్యాకర్స్. అధికారి అకౌంట్ నుంచి మెసేజ్ రావడంతో అందరు రిప్లే ఇచ్చారు. అర్జెంట్ గా డబ్బులు కావాలి త్వరలో తిరిగి ఇస్తానంటూ నమ్మబలికాడు హ్యాకర్.. కీలకమైన అధికారి డబ్బులు అడగడమేంటని కొందరికి అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు, ఆ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పెద్దమొత్తంలో డబ్బులు దోచుకునే ప్రయత్నానికి బ్రేక్ పడింది.

ఇదేకాక ఇటీవల జమ్మికుంటలోని ఓ టిఫెన్ సెంటర్ యజమానిని ఆన్ లైన్ మోసగాడు బురిడికొట్టించి డబ్బులు దోచుకున్నాడు. యాబై ప్లేట్ల పూరి పార్సల్ కట్టండి అంటూ ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ ఇచ్చాడు. డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తానంటూ అకౌంట్ నంబర్ తెలుసుకున్నాడు. అతన్ని నమ్మిన హోటల్ యజమాని తన బ్యాంకు డిటైల్స్ చెప్పేశాడు. ఓ ఓటీపీ వచ్చింది చెబితే మీ అకౌంట్లో డబ్బులు పడతాయని తెలిపాడు. ఇంకేముంది కాల్ కట్ చేయగానే అకౌంట్ నుంచి రూ. 36వేలు ట్రాన్స్ ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న హోటల్ యజమాని నెత్తినోరు మొత్తుకున్నా ప్రయోజనం శూన్యం.

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైం టీం సైబర్ నేరగాళ్లని పట్టుకొని ఆరా తీస్తున్నది. ఈ కేటుగాళ్లు బ్యాంక్ లకి సంబంధించిన కస్టమర్ సర్వీస్ ప్రొవైడింగ్ సెంటర్ లలో ఉద్యోగాలంటూ నిరుద్యోగులను ఆకర్షించారు. రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజుల పేరిట లక్షలు దండుకున్నారు. అలా మోసం చేసిన కేటుగాళ్లలో కొందరిని పోలీసులు పట్టుకొని ఆరా తీస్తే.. కీలకమైన అంశాలు బయటపడ్డాయి.

అసలు ఆన్ లైన్ లో మోసాలు ఎలా చేస్తారు. సోషల్ మీడియాలో ఎవరిని టార్గెట్ చేస్తారు. ఎలా బోల్తా కొట్టిస్తారు.. పలనా వ్యక్తి అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అని ఏవిధంగా పసిగడతారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సాధారణ ప్రజలను వేధిస్తుంటాయి. ఒక్కరే ఇదంతా చేస్తుంటారా.. లేదంటే వీళ్లకు ఏమైనా నెట్ వర్క్ ఉందా .. సైబర్ క్రైం పోలీసుల ఎత్తులకు హ్యాకర్స్ పైఎత్తులు ఎలా వేయగలుగుతున్నారని సోషల్ మీడియా యూజర్స్ కి అంతుచిక్కడం లేదు. అందుకే ప్రతిసారి ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు కేటుగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు.

ముక్కు ముఖం తెలియదు. కానీ మన ఆర్థిక స్థితిగతులను సులభంగా అంచనా వేస్తారు. మన అకౌంట్లో ఎంత మేర డబ్బులు ఉన్నాయని పసిగడుతారు. పక్కా ప్లాన్ వేస్తారు. ఆన్ లైన్ లో మనం కొట్టే లైక్ ను మన పెట్టే పోస్ట్ ను పరిశీలిస్తారు. అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఆన్ లైన్ చాటింగ్ ద్వారానో, ఫోన్ కాల్ ద్వారానో మాటలు కలుపుతారు. చివరకు మన అకౌంట్ నుంచి డబ్బులు మాయం చేసి, ఉడాయిస్తారు. సోషల్ మీడియాలో సాధారణ యూజర్స్ ఎవరైనా తమ ఇష్టాఇష్టాలను బట్టి వీడియోలు, ఫోటోల కోసం సెర్చ్ చేస్తుంటారు. లేదంటే అలాంటి వాటిని పోస్ట్ చేస్తారు. లైక్ కొడతారు. ఈ అభిరుచులనే కేటుగాళ్లు ఆయుధంగా మలుచుకొని రంగంలోకి దిగుతారు.

ఇలాంటి మోసాలే కాదు.. లాక్ డౌన్ సమయంలో ఇండ్లల్లో చాలా మంది ఆడవాళ్లు శారీ చాలెంజ్, డ్రెస్ చాలెంజ్, స్వీట్ చాలెంజ్ అంటూ టిక్ టాక్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇలాంటి వారితోపాటు వారి బంధువులు, స్నేహితులను కూడా హ్యాకర్స్ టార్గెట్ చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు తెలంగాణలో ఎన్నో వెలుగు చూసిన సందర్భాలున్నాయి. అయితే వీటిల్లో 90 శాతం కేసులు పోలీస్ స్టేషన్ వరకు రాలేదు. కొందరు కేటుగాళ్లు ప్రభుత్వ పథకాలను ఆసరా చేసుకొని అమాయకులను తమ వలలో వేసుకుంటున్నారు. జన్ ధన్, ముద్రా లోన్స్ ఇస్తామంటూ అకౌంట్ నంబర్లు తెలుసుకొని డబ్బులు స్వాహా చేస్తున్నారు.

అయితే ఇలాంటి ఆన్ లైన్ మోసాలన్నీ ఏ ఒక్కరో చేస్తున్నది కాదు. దీని వెనక పెద్ద నెట్ వర్కే ఉంది అంటున్నారు నిపుణులు. ఉద్యోగులను పెట్టుకొని కమిషన్లు ఇస్తూ మరీ ఆన్ లైన్ మోసాలు చేయిస్తున్నారు. అయితే ఈ కేసులన్నింటికీ రెండు ప్రాంతాలు సెంటర్ పాయింట్లుగా తేలినట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్ లోని జాంతార అనే గ్రామం. రాజస్థాన్ లోని భరత్ పూర్ ప్రాంతం సైబర్ కేసులకి ప్రధాన కేంద్రంగా నిలిచాయి.

ఇక్కడి నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులను నియమించి సైబర్ నేరాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటిదాకా జరిగిన కేసుల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగులు పట్టుబడ్డారు కానీ ప్రధాన నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇక పశ్చిమ బెంగాల్ లో ఉన్న జాంతారా గ్రామం సెల్ ఫోన్ సిగ్నల్స్ కి ఓ అరుదైన ప్రాంతంగా నిలిచింది. మూడు రాష్ట్రాల సరిహాద్దులు ఉన్న ప్రాంతం కావడంతో అదే గ్రామంలో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఒకసారి బీహార్, ఒకసారి పశ్చిమ బెంగాల్ లో, మరోసారి జార్ఖాడ్ లో చూపిస్తోంది. దీంతో చాలా కేసుల విచారణకి ఇదో పెద్ద సమస్యగా మారింది.

సోషల్ మీడియాలో ఏదిపడితే అది సెర్చ్ చేయకపోవడంతో పాటు వ్యక్తిగత ఫోటోలను ప్రతిసారి పోస్ట్ చేయకపోవడం మంచిదంటున్నారు పోలీసులు. అలాగే చాలా మంది యువత పోర్న్ వీడియోల కోసం సెర్చ్ చేసి కొన్ని లింక్ లని ప్రెస్ చేయడం వల్ల వారి ఫోన్, అకౌంట్ల నెంబర్లు హ్యాకర్ల చేతులోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు. బ్రౌజర్ లో చాలా మంది యూజర్ నేమ్, పాస్వర్డ్ సేవ్ చేసి పెట్టడం కూడా ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు. ఏదీ జరిగినా పోలీసులకి సమాచారం ఇస్తే కేసును చేధించి న్యాయం చేస్తామని అంటున్నారు కరీంనగర్ పోలీసులు.

Web TitleLockdown Effect: thieves changed their route to robber in Karimnagar Telangana
Next Story