అక్కరకొచ్చిన ఆనాటి చట్టం... తెలంగాణ చూపిన దారిలో అన్ని రాష్ట్రాలు..

అక్కరకొచ్చిన ఆనాటి చట్టం... తెలంగాణ చూపిన దారిలో అన్ని రాష్ట్రాలు..
x
Highlights

ఈ రోజు మనం మాట్లాడుకుందాం దేశవ్యాప్తంగా ఉద్యోగుల జీతాల్లో భారీ కోతల గురించి వాయిదాల్లో ఇవ్వడం గురించి. ఈ వాయిదా విధానం మొదలైంది తెలంగాణ నుంచే. ఎన్నో...

ఈ రోజు మనం మాట్లాడుకుందాం దేశవ్యాప్తంగా ఉద్యోగుల జీతాల్లో భారీ కోతల గురించి వాయిదాల్లో ఇవ్వడం గురించి. ఈ వాయిదా విధానం మొదలైంది తెలంగాణ నుంచే. ఎన్నో విషయాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ జీతాల వాయిదా విషయంలో కూడా మార్గదర్శనం చేసినట్లుగా ఉంది. నిజమే తెలంగాణ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ షాక్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పి 24 గంటలు కూడా కాకముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా హింట్ ఇచ్చారు ఇవ్వాల్సిన జీతాన్ని ఈ నెలలోనే సగం సగంగా రెండు వాయిదాల్లో ఇస్తామని. మరో వైపున మహారాష్ట్ర కూడా ఇదే బాట పట్టింది. అయితే అదే సమయంలో రేపటి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రదర్శించిన ముందుచూపును కూడా తోసిపుచ్చలేం.


ది ఎపిడమిక్ యాక్ట్ 1897 ఎప్పుడో సుమారు 125 ఏళ్ళ క్రితం నాటి బ్రిటిష్ ప్రభుత్వం చట్టం అది. మహమ్మారి వ్యాధుల నియంత్రణ కోసం చేసిన చట్టం. ఆ చట్టమే ఇప్పుడు తమను ఇంత అసౌకర్యానికి గురి చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఊహించి ఉండరు. నిజానికి అలాంటి వెసలుబాట్లు మరెన్నో ఉన్నాయని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు కూడా ఊహించిఉండవు. ఇప్పుడు అదే చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రకాలుగా అక్కరకొచ్చింది. మరో వైపున వివిధ రాష్ట్రాల్లో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ఆశను సగం తుంచింది. ఇక ముందేం జరుగుతుందో అన్న ఆందోళనకు తెర తీసింది.

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లుగా అయింది. మంగలం అంటే ఏమిటో పట్టణాలలో ఉండే వారికి తెలియదు. కానీ గ్రామాలలో ఉండేవారికి తెలుసు. సాధారణంగా పాత కుండను తీసుకుని దానికి పక్కన చేయి పట్టేంత రంధ్రం చేస్తారు. ఆ రంధ్రంతో కుండ ఇంకా బలహీనమౌతుంది. దాన్నే మంగలం అని అంటారు. దాంట్లో ఎండు మిరపకాయలు, పేలాలు లాంటివి వేయించుతారు. ఇలా మంగలం దాదాపుగా అత్యంత బలహీనమైన వస్తువు అవుతుంది. అత్యంత శక్తివంతమైన ఉరుము పిడుగు రూపంలో మంగలం మీద పడితే కుండ పగిలిపోతుంది. నిజానికి ఆ పిడుగు మరెక్కడైనా పడవచ్చు. అలా కాకుండా పెద్దగా శక్తివంతం కాని దానిపై పడితే అది పడే ఆవేదనే ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు. ప్రస్తుతం దేశంలో పలువురు ఉద్యోగుల పరిస్థితి ఇలానే ఉంది. జీతం వస్తుందా ? రాదా ? ఎంత వస్తుంది ? ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు ఒకవైపు. కరోనా వైరస్ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలా అనే బెంగ మరో వైపు. ప్రభుత్వం నుంచి రావాల్సిన మరెన్నో వరాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో కరోనా వైరస్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తరుణంలో ప్రభుత్వరంగంలో మొదటగా సోమవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఒక బాంబు పేల్చింది. మొదట కోత విధిస్తున్నట్లుగా చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత దాన్ని వాయిదా గా మార్చింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో భవిష్యత్ అవసరాల కోసం జీతాల నుంచి కొంత మొత్తాన్ని రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండబోతున్నదో అర్థం చేసుకునేందుకు జీతాల కోతను, వాయిదాను ఒక సూచికగా తీసుకోవాలి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఈ విషయంలో తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుందేమో. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కూడా ఇదే బాట పట్టాయి. ఒక్కసారిగా స్థూలజీతంలో 50 శాతం దాకా జీతం కోతను, వాయిదాలను ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇది త్యాగాలు చేయాల్సిన సమయం అంటున్న యాజమాన్యాలకు ఎదురుచెప్పలేని స్థితి. అలా అని సర్దుకుపోలేని పరిస్థితి. మొత్తం మీద ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులు మాత్రం జీతంలో కోతలపై, వాయిదాల విధానాలపై ఆందోళన చెందుతున్నారు. ఇండిగో, స్పైస్ జెట్, గో ఎయిర్ లాంటి సంస్థలు తమ ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 30 శాతం దాకా కోతను ప్రకటించాయి. అపోలో టైర్స్ లాంటి కొన్ని టైర్ల కంపెనీలు ఉన్నత స్థాయి ఉద్యోగుల జీతభత్యాల్లో 25 శాతం దాకా కోత విధించాయి. మరెన్నో సంస్థలు అదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

జీవో ఎంఎస్ నెం. 27, డేటెడ్ థర్టీయెత్ మార్చి 2020 ఇది దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైన జీవోగా మిగిలిపోనుంది. తెలంగాణలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం నుంచి సాయం పొందుతున్నసంస్థల ఉద్యోగులకూ జీతంలో దాదాపు సగభాగం దాకా వాయిదా పడింది. అందరికీ ఒకేలాగాకుండా ఒక్కో స్థాయి వారికి ఒక్కోలా జీతభత్యాల్లో వాయిదాను ప్రకటించారు. ఈ కోత గురించి డిఫర్మెంట్ అంటూ ప్రస్తావించారు. అదే సమయంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపారు. సాధారణంగా డిఫర్మెంట్ అంటే వాయిదా అని అర్థం. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. సరైన సమయంలో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఉద్యోగులు కొంతమేరకు ఊరట చెందారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జీతంలో వాయిదా అందరికీ ఒకేలా లేదు. సీఎంతో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు చివరకు ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల స్థూల జీతంతో 75 శాతం వాయిదా విధించారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగులకు ఈ వాయిదా స్థూల జీతంలో 60శాతం దాకా ఉంది. ఇతర ఉద్యోగులకు 50 శాతం దాకా స్థూల జీతంలో వాయిదా ఉంటుంది. నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం ఈ వాయిదాను 10 శాతానికే పరిమితం చేశారు. రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ లో వాయిదా వారి స్థాయిని బట్టి 10 శాతం నుంచి 50 శాతం దాకా ఉంటుంది. ఇక తెలంగాణ కు పొరుగునే ఉన్న మహారాష్ట్ర కూడా ఇదే బాట పట్టింది. ఈ మేరకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల్లో 60 శాతం వాయిదా విధించారు. A గ్రేడ్, B గ్రేడ్ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం వాయిదా వేశారు. సి గ్రేడ్ ఉద్యోగులకు జీతంలో 25శాతం వాయిదా పెట్టారు. D గ్రేడ్ ఉద్యోగులను మాత్రం ఈ వాయిదా నుంచి మినహాయించారు. జీతాల వాయిదాపై ఉద్యోగుల వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా పలు యూనియన్లు మాత్రం ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో సైతం ఉద్యోగుల జీతాల్లో వాయిదా చోటు చేసుకోనుంది. అక్కడ ఉద్యోగులకు రెండు విడతల్లో జీతం అందనుంది. రాష్ట్ర ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. కరోనా మహమ్మారి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ నెల సగం జీతం, నిధులు సర్దుబాటు అయ్యాక మిగితా సగం చెల్లిస్తామన్న సీఎం ప్రతిపాదనకు అంగీకరించినట్లు సూర్యనారాయణ చెప్పారు.

కరోనా మహమ్మారి ఆరోగ్యపరంగానే గాకుండా ఆర్థికపరంగా కూడా విదేశాల్లో ఎన్నడో ప్రమాదఘంటికలు మోగించింది. దేశంలో ప్రభుత్వపరంగా మరీ ముఖ్యంగా జీతభత్యాల విషయంలో మాత్రం తెలంగాణ లోనే తొలి ప్రమాద ఘంటిక మోగింది. అయితే ఈ ప్రమాద ఘంటిక ను రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపుగా కూడా చెప్పవచ్చు. అదే సమయంలో ప్రైవేటు రంగంలో పరిస్థితి పై మాత్రం ఆందోళనలు అధికమవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం తెలివైన చర్య తీసుకుంది అనడంలో సందేహం లేదు. మన ఇంట్లో డబ్బుల పెట్టె ఉందనుకుందాం. దాన్ని ఒక్కసారిగా ఎప్పుడూ ఖాళీ చేయం. అత్యవసరాల కోసం కొంత మొత్తం దాచుకుంటాం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేసింది కూడా అదే. అవసరమైతే కష్టాలు ఎదుర్కొనేందుకు, త్యాగాలు చేసేందుకు ప్రజలు సిద్ధం కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల అన్నారు. అదే సమయంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలను, వాటికయ్యే భారీ మొత్తాలను కూడా ఆయన వివరించారు. కరోనా రోగులకు వైద్యం, పేదలకు, వలస కూలీల సంక్షేమానికి భారీ మొత్తాలను కేటాయించడంతో ఎదురవుతున్న ఆర్థిక సమస్యలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాల గురించి ప్రస్తావించినప్పుడు ఏదో మాటవరుసకు అలా అన్నారు అనే అంతా భావించారు. అంతే తప్ప ఇలాంటి కఠిన నిర్ణయానికి అదో సంకేతమని అంతగా ఊహించలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఒక రోజు జీతం విరాళంగా ఇచ్చారు. ఇక ఇప్పడు చేతికి వచ్చేది 14 రోజుల జీతమే. రిజర్వు బ్యాంకు భరోసా మేరకు మూడు నెలల పాటు ఈఎంఐ కట్టకపోయినా ఇతర ఖర్చులు అనేకం ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంగతి పక్కన బెడితే పెన్షనర్లు కూడా ఈ కోతకు గురయ్యారు. వాళ్ళకు వచ్చేది సగం జీతమే. అందులోనూ ఇప్పుడు వాయిదా చోటు చేసుకుంటోంది. సాధారణంగా పెన్షనర్లకు వయస్సు రీత్యా రకరకాల ఆరోగ్యసమస్యలు ఉంటాయి. మందుల కోసం, ఆపరేషన్ల కోసం కొంత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అదే విధంగా తమ బాగోగులు చూసుకునే వారికి కొంత మొత్తం ఇవ్వవలసి ఉంటుంది. ఇతర బాధ్యతలు గనుక ఉంటే వాటిని నెరవేర్చుకోవాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా పెన్షన్ లో కొంత మొత్తం వాయిదా అంటే అది వారికి ఊహించని షాక్ గానే ఉంటుంది. వారు తమ జీవనశైలిని మార్చుకోవలసి వస్తుంది. మరో వైపున కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది నుంచి మాత్రం కొంత అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ఉంది. జీతాల వాయిదా నుంచి వారిని మినహాయిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి కూడా సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల పట్ల ఉదారవైఖరి కనబరిచారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులపై సైతం ప్రేమాభిమానాలు కురిపించారు. అందుకు గాను దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. మొత్తం మీద సీఎం కేసీఆర్ ప్రజలను ఆదుకునే వివిధ కార్యక్రమాలకు భారీ మొత్తాలను కేటాయించారు. అదే ఇప్పుడు ఉద్యోగుల జీతాల్లో వాయిదాకు దారి తీసింది. ఈ వాయిదా తాత్కాలికమే. కాకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ బాటనే వివిధ రాష్ట్రాల సీఎంలు ఎంచుకుంటున్నారు. అక్కడితోనే అది ఆగిపోదు. ప్రభుత్వాలే అలా చేస్తుంటే తాము కూడా అలా ఎందుకు చేయకూడదు అని ప్రైవేటు రంగం భావించే అవకాశం ఉంది. నిజానికి కేంద్రప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగుల పట్ల బాగా కనికరం ప్రదర్శించింది. కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగుల జీతాల్లో కోత విధించవద్దని, వారిని ఉద్యోగాల నుంచి తొలగించవద్దని సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రైవేటు రంగం కూడా జీతం కోత లేదంటే జీతం వాయిదా అస్త్రాన్ని తమ ఉద్యోగులపై ప్రయోగించే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే ప్రజలు ఆర్థికంగా మరింతగా చిక్కుల్లో పడుతారు. ఒక ఉద్యోగికి జీతం వస్తే దాంట్లోంచి మరెందరికో చెల్లింపులు ఉంటాయి. అదొక చెయిన్ లాంటిది. ఆ చెయిన్ బ్రేక్ అయితే ఇబ్బంది పడేది అట్టడుగు వర్గాల ప్రజలే. ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరికొన్ని కూడా ఉన్నాయి. ప్రభుత్వమే జీతాల్లో వాయిదా విధిస్తే ప్రైవేటు సంస్థలు ఊరుకుంటాయా ? అసలే కరోనా నేపథ్యంలో రోజువారీ క్యాష్ ఫ్లో తగ్గిపోయింది. ప్రభుత్వమే తన సిబ్బందికి 50 శాతం చెల్లిస్తే ప్రైవేటు సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకునేందుకే భయమేస్తోంది.

తెలంగాణ సంపన్న రాష్ట్రం అయితే జీతాల్లో వాయిదాలెందుకని ప్రశ్నించే వారూ ఉన్నారు. ఒక్క పది రోజుల ప్రభావంతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైపోయిందా అని అడిగేవారూ ఉన్నారు. ఖజానాకు వస్తున్న ఆదాయమెంత? ఏయే పథకాలకు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు ? స్థోమతకు మించి హామీలిచ్చింది ఎందుకు ? అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. వాటిపై చర్చకు ఇది సందర్భం కాదు. ప్రైవేటు సంస్థల తరహాలోనే ప్రభుత్వాలకూ రోజువారీ ఆదాయాలు క్రమం తప్పక వస్తుండాలి. వాటిపై అంచనాలతోనే అవి బడ్జెట్ లు రూపొందించుకుంటాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రాయల్టీ లాంటి ఆదాయాలు నిలిచిపోయాయి. మరో వైపున కరోనా బాధితుల సంక్షేమ ఖర్చులు అధికమైపోయాయి. ఈ నేపథ్యంలో చూస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య సరైందిగానే కనిపిస్తోంది. ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయా, లేవా అనే విషయాన్ని పక్కనబెడితే భవిష్యత్తుకు దాచిపెడుతూ, అందరికీ ఎంతో కొంత మొత్తం చేతిలో ఉండే విధానాన్ని కేసీఆర్ ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. కాకపోతే, ఉద్యోగుల సందేహాలు మరో విధంగా కూడా ఉన్నాయి. రెండు విడతల డీఏ బకాయిలు, పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, మధ్యంతర భృతి ప్రకటించకపోవడం లాంటి అంశాలను వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. రేపటి నాడు బేరసారాలకు జీతాల అంశాన్ని ప్రభుత్వం లేవనెత్తవచ్చని భయపడుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో తన ముందుచూపును చాటుకున్నారు. పెద్ద మనస్సునూ ప్రదర్శించారు. అడగనిదే వరాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జీతాల్లో విధించిన వాయిదా కరోనా ఎఫెక్ట్ అనడంలో సందేహం లేదు. దాన్ని చూస్తుంటే తెలంగాణ కోసం చేసిన త్యాగాలు మరోసారి కళ్ల ముందు మెదులుతున్నాయి. ఈ కష్టం స్వల్పకాలికమే కావాలని కోరుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ముఖాల్లో తిరిగి నవ్వులు విరబూయాలని ఆశిద్దాం. మనమంతా ఇంట్లోనే ఉంటూ ఎంత త్వరగా కరోనాను తరిమేస్తే అంత త్వరగా మంచిరోజులు వస్తాయనడంలో మాత్రం సందేహం లేదు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories