logo

21న ముహూర్తం...ముఖ్యఅతిథులుగా ఏపీ, మహారాష్ట్ర సీఎంలు

21న ముహూర్తం...ముఖ్యఅతిథులుగా ఏపీ, మహారాష్ట్ర సీఎంలు
Highlights

కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న తెలంగాణ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు...

కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న తెలంగాణ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసింది. దాదాపు సగం తెలంగాణతోపాటు 40లక్షల ఎకరాలకు సాగునీరందించే, కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఏపీ, మహారాష్ట్ర సీఎంలను ఆహ్వానించారు.

కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఇటీవల వారం రోజుల గ్యాప్‌లో రెండుసార్లు కాళేశ్వరం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 21న ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించారు.

అత్యంత ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా రానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వయంగా విజయవాడ వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే ఫోన్లో ఫడ్నవిస్‌తో మాట్లాడిన కేసీఆర్‌ త్వరలోనే ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎంను స్వయంగా ఆహ్వానించనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దాదాపు 151 టీఎంసీల గోదారి జలాలను ఒడిసిపట్టేందుకు 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు చేపట్టారు. అలాగే 12 బ్లాకుల్లో 1531 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు నిర్మిస్తున్నారు. భారతదేశంలో ఏ ప్రాజెక్టులోనూ వినియోగించని భారీ పంపులను కాళేశ్వరంలో ఉపయోగించారు. అలాగే రికార్డు సమయంలో ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి వేలాది మంది కార్మికులు రాత్రిబంవళ్లూ పనిచేశారు. అంతేకాదు రివర్స్ పంపింగ్‌ టెక్నాలజీతో కాళేశ్వరం దేశంలోనే అరుదైన ప్రయత్నంగా రికార్డులకెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద సగానికి పైగా తెలంగాణ కవర్ కానుంది. 13 జిల్లాలు, 80 నియోజకవర్గాల్లో 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చి దాదాపు 60శాతం తెలంగాణ సస్యశ్యామలం కానుంది. దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయనిగా నిలవనుంది.


లైవ్ టీవి


Share it
Top